- బీహార్ కేసులతో జాతీయంగా పెరుగుదల
- 24 గంటల్లో కొరోనాతో అత్యధికంగా 6,148 మంది మృతి
- 94,052 పాజిటివ్ కేసులు నమోదు
- ఆరేళ్లలోపు బాలలపై కోవాగ్జిన్ ప్రయోగాలు.. ట్రయల్స్ చేపట్టిన భారత్ బయోటెక్
- మూడు నెలలపాటు నిరాఘాటంగా వ్యాక్సినేషన్ : ఆర్థికశాఖ ప్రతిపాదన
కొరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని అనుకుంటున్న సమయంలో పెరిగిన మరణాల సంఖ్య భయాందోళనలకు గురిజేస్తున్నది. 24 గంటల్లో దేశంలో 6,148 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ క్రమంగా రోజురోజుకు కంట్రోల్ అవుతుందనుకుంటున్న సమయంలో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. మొత్తంగా దేశంలో కొరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. తాజాగా వరుసగా మూడు రోజు కోవిడ్ కేసులు లక్షకు దిగువన నమోదవగా.. రికార్డు స్థాయిలో ఒకే రోజు 6,148 మరణాలు నమోదయ్యాయి. కొరోనా మహమ్మారి నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 94,052 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 1,51,367 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. ఇందులో 2,76,55,493 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,59,676 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది.
టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 23,90,58,360 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. అయితే, బిహార్ మరణాల డేటాను సవరించిన నేపథ్యంలో మృతుల సంఖ్య ఈ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది. కొరోనాను ఖతం చేయటానికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతున్నా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 32,90,58,360 టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ క్రమంలోనే దేశంలో మొదటిసారిగా వైరస్ మరణాల సంఖ్య 6 వేలు దాటి రికార్డు స్థాయికి చేరింది. దేశంలో పాజిటివిటి రేటు 4.60 శాతంగా ఉంది. 17 రోజులుగా 10 శాతానికి దిగువన పాజిటివిటి రేటు నమోదు కాగా..28 రోజులుగా కొత్త కేసులకన్నా అధికంగా నమోదవుతున్న రికవరీ కేసులు ఉన్నాయి. దేశంలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నట్లుగా తెలుస్తున్నది.
ఐదు రాష్ట్రాల్లో లక్షకు పైగా యక్టీవ్ కేసులు ఉండగా..కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఆంధప్రదేశ్లలో అధికంగా యక్టీవ్ కేసులున్నాయి. యక్టీవ్ కేసులు.. పెరుగుతున్న రికవరీ కేసులు పెరగటం మంచి పరిణామం. దీంతో కొరోనా రికవరీ రేటు 94.55 శాతానికి పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలావుంటే గరిష్ట సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణం… బీహార్ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలేనని తెలుస్తున్నది. ఇప్పటి వరకు 5,500 మంది మాత్రమే చనిపోయారన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం ఆ సంఖ్యను సవరిస్తూ 9,429 మంది చనిపోయారని తెలిపింది. అంటే 72 శాతం అధికమన్నమాట. బీహార్‌లో మరణాలను రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా చూపిస్తున్నదని వొస్తున్న వార్తలపై స్పందించిన హైకోర్టు సరైన లెక్కలు తేల్చాలని ఆదేశాలివ్వడంతో మరణాల సంఖ్యను సవరిస్తూ ప్రకటన చేసింది. దీంతో ఒక్కరోజులోనే రాష్ట్రంలో 3,951 మంది మరణించారు. ఈ సంఖ్య జాతీయ సంఖ్యపై ప్రభావితం చూపింది.
ఆరేళ్లలోపు బాలలపై కోవాగ్జిన్ ప్రయోగాలు..ట్రయల్స్ చేపట్టిన భారత్ బయోటెక్
దేశంలో కొరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతూ టీకా దిగుమతి, ఉత్పత్తికి చర్యలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా యూపీలోని కాన్పూర్‌లో రెండేళ్ల నుంచి ఆరేళ్లలోపు వయసుగల పిల్లలపై టీకా ట్రయల్స్ ప్రారంభించారు. ఈ వయస్సు గల పిల్లలపై టీకా ప్రయోగాలు ఇప్పటి వరకూ ఎక్కడా జరగలేదు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన దేశీయ టీకా కోవాక్సిన్‌ను పిల్లలపై ప్రయోగిస్తున్నారు. ఆరు నుంచి 12 సంవత్సరాలు, 12 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలకు రెండు విభాగాలుగా టీకా ఇస్తున్నారు.
ఇందుకు సంబంధించి కాన్పూర్‌లోని ఆర్యనగర్‌లో గల ప్రఖర్ హాస్పిటల్లో టీకా వేయబోయే చిన్నారులను ఎంపిక చేశారు. ఇందుకోసం రెండేళ్ల నుంచి ఆరేళ్లు….ఆరేళ్ల నుంచి 12 ఏళ్లు… 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకూ మూడు విభాగాలుగా చిన్నారులను ఎంపికచేశారు. వారిలో కొంతమందికి టీకాలు వేశారు. వ్యాక్సినేషన్ తరువాత 45 నిమిషాలపాటు వారిని పరిశీలనలో ఉంచారు. వీరెవరిలోనూ సైడ్ఎఫెక్టస్ కనిపించలేదు. ఈ సందర్భంగా సీనియర్ పీడియాట్రిషియన్, మాజీ డీజీఎంవో ప్రొఫెసర్ విఎన్ త్రిపాఠి మాట్లాడుతూ రెండేళ్ల పిల్లలపై కొరోనా టీకా ట్రయల్స్ ప్రపంచంలోనే ఇది మొదటిదని తెలిపారు.
మూడు నెలలపాటు నిరాఘాటంగా వ్యాక్సినేషన్ : ఆర్థికశాఖ ప్రతిపాదన
దేశ ఆర్థిక ప్రగతిని పరిగెత్తించాలంటే వచ్చే రెండు మూడు నెలల పాటు రాత్రి, పగలూ తేడా లేకుండా 24 గంటలూ టీకాలు వేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ప్రతిపాదించింది. అలా చేస్తేనే మెజార్టీ ప్రజలకు టీకా వేయడం సాధ్యం అవుఉతందని అబిప్రాయపడింది. సెప్టెంబర్ చివరకల్లా దేశంలో 70 కోట్ల మందికి టీకాలు అందాలనేది లక్ష్యం కావాలని పేర్కొంది. దేశ ఆర్థిక స్థితిగతులపై గురువారం విడుదల చేసిన నెలవారీ నివేదికలో ఈ సూచన చేసింది. ఆర్థిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే వ్యాక్సినేషన్ పక్రియను మరింత వేగవంతం చేయాలి. ఇది చాలా కీలకం.
సెప్టెంబర్ కల్లా 70 కోట్ల మందికి టీకాలు అందాలంటే..113 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. రోజుకు 93 లక్షల మందికి టీకాలు వేస్తే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని కూడా సూచించింది. ప్రస్తుతం ఉన్న షిఫ్టులను రెండితలు చేయడం, వీలైతే వచ్చే రెండు నెలల పాటూ రోజులో 24 గంటలూ టీకాలు వేయడం ద్వారా రోజు కోటి టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొంది. గతేడాది లాక్ డౌన్ నుంచి రాష్టాల్రు అనుభవం గడించిన కారణంగా.. కరోనా సెకెండ్లో తయారీ, నిర్మాణ రంగాలు చిన్న కుదుపుకు లోనవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం.. రెండు నెలలుగా నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వాలు ఆచితూచి ఒక్కొక్కటిగా అనుమతిస్తున్నాయి.