సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ సంస్థ వెల్లడి
ప్రజలు నిబంధనలు పాటిస్తేనే అరికట్టడం సాధ్యమని వెల్లడి
గాలి ద్వారా కొరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని గతంలో పలువురు వైద్య నిపుణులు చేసిన హెచ్చరికలు రుజువయ్యాయి. అయితే ఇప్పుడు గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి జరుగుతుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కూడా పేర్కొంది. ఇందుకు గల కారణాలను అధ్యయనం చేసి, మార్గదర్శకాలు జారీ చేసింది. కొరోనా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడిన తుంపర్లలో వైరస్ ఉంటుందని, అది గాలి ద్వారా ప్రయాణిస్తుందని తెలిపింది. వ్యక్తుల మధ్య కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించింది. గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించని గదుల్లో ఆరడుగుల కంటే ఎక్కువ దూరం వరకు కూడా వైరస్ ప్రయాణించవచ్చని వివరించింది. కాగా గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని సీడీసీ గతంలోనూ తన వెబ్సైట్లో పేర్కొంది. అయితే, గాలిలో వైరస్ వ్యాప్తిపై భిన్నాభిప్రాయాలు రావడంతో ఆ సమాచారాన్ని తొలగించింది. తాజాగా ఈ విషయాన్ని నిర్దారించింది.
దీంతో ఇప్పుడు కొరోనా వ్యాప్తి తీవ్రతకు గాలి కూడా కారకంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలతో ముందుకు సాగాలని హెచ్చరించింది. ఇక కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో మహిళలలే అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారని, కొరోనా నిబంధనలు పాటించడంలో పురుషుల కంటే మహిళలు ఆదర్శంగా ఉంటున్నారని స్పష్టమైంది. న్యూయార్క్, యేల్ యూనివర్సీటీ పరిశోధనలో ఈ విషయం వెల్లడి కాగా బిహేవియర్ సైన్స్ అండ్ పాలసీలో ఈ ఆర్టికల్ ప్రచురితమైంది. వైద్య నిపుణులు సూచనలు మహిళలు తూచ తప్పకుండా పాటిస్తున్నారని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండటంలో వారు ముందు వరుసలో ఉన్నట్లు పేర్కొంది. పురుషులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ప్రపంచంలో ఎక్కువగా కరోనా భారిన పడిన వారిలో పురుషులు ఉన్నారని స్పష్టం చేసింది. కొరోనా వ్యాప్తి జరుగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను, రక్షణ సూచలను ప్రతీ పౌరుడు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా వుందని నిపుణులు సూచిస్తున్నారు.