- 64శాతం ఒక్క మహారాష్ట్రలోనే నమోదు
- అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ
దేశంలో కొరోనా వైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే గడిచిన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా కొరోనా బారిన పడ్డారు. ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 1.09కోట్లకుపైగా చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య రెండులక్షలపైగా చేరుకుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 24,882 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,33,728కు చేరింది. తాజాగా 19,957 కోలుకోగా.. ఇప్పటి వరకు 1,09,73,260 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 140 మంది మహమ్మారికి బలవగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 2,02,022 ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.78శాతం ఉన్నాయని, రికవరీ రేటు 9.82శాతం, మరణాల రేటు 1.40శాతం ఉందని వివరించింది.కొత్త కేసులు 85.6 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. గత నెల నుండి ఇక్కడ కొరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 2,82,18,457 డోసులు వేసినట్లు చెప్పింది. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజువారీ కేసుల సంఖ్య 25వేలకు చేరువైంది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 8.40లక్షల మందికి కొరోనా పరీక్షలు నిర్వహించగా.. 24,882 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక రోజువారీ కేసులివే. చివరిసారిగా గతేడాది డిసెంబరు 20న 26,624 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కొరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్టాల్లో్ర మాత్రం వైరస్ విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. దీంతో అక్కడ రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 64శాతం కేవలం ఆ రాష్ట్రంలోనే బయటపడటం గమనార్హం. శుక్రవారం అక్కడ 15,817మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,82,191కి పెరిగింది. మహారాష్ట్రలో ఈ స్థాయిలో కేసులు నమోదవడంతో ఐదు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే. చివరిసారిగా గతేడాది అక్టోబరు 2న 15వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నిన్న మరో 56 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కొరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఇదిలావుంటే ఇప్పటివరకు దేశంలో సుమారు 2.80కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 18.40 లక్షల మందికి వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.