“ఉమ్మడి జిల్లాలో కరోనా పరిస్థితులను గమనిస్తే 1నుండి 2 నుండి పదుల సంఖ్యలో మొదలైన పాజిటివ్ కేసుల సంఖ్య నేడు వందల సంఖ్యలో చేరుకుంటున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న పరీక్షలలో రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు వరంగల్ అర్బన్ జిల్లాలో 992 యాక్టివ్ కేసులు ఉండగా రూరల్ జిల్లాకు వచ్చి 349 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత మే నెల నుండి గమనిస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలో లాక్ డౌన్ కొనసాగినన్నిరోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు కేసులు కూడా ఎక్కువగా నమోదు కాలేదు కేవలం మర్కజ్ నుండి వచ్చిన ముస్లిం సోదరులతో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కొరోనా వైరస్ నేడు ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అధికారుల నుండి మొదలు సామాన్య ప్రజల వరకు రాజకీయ నేతల నుండి ఉద్యోగుల వరకు ఏ ఒక్కరిని కూడా కొరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు.”
- వరంగల్ అర్బన్ కలెక్టర్‌తో పాటు వరంగల్ నగర మేయర్ దంపతులకు …
- ఎంజీఎం హాస్సిటల్లో 25 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ
వరంగల్ ఉమ్మడి జిల్లాలో గత కొద్ది రోజులుగా కొరోనా వైరస్ విపరీతంగా విస్తరిస్తునది. రోజుకు సుమారు వందల సంఖ్యలో కొరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గత రెండు నెలలుగా ఉమ్మడి జిల్లాలో కొరోనా పరిస్థితులను గమనిస్తే 1నుండి 2 నుండి పదుల సంఖ్యలో మొదలైన పాజిటివ్ కేసుల సంఖ్య నేడు వందల సంఖ్యలో చేరుకుంటున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న పరీక్షలలో రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు వరంగల్ అర్బన్ జిల్లాలో 992 యాక్టివ్ కేసులు ఉండగా రూరల్ జిల్లాకు వచ్చి 349 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత మే నెల నుండి గమనిస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా లో లాక్ డౌన్ కొనసాగినన్నిరోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు కేసులు కూడా ఎక్కువగా నమోదు కాలేదు. కేవలం మర్కజ్ నుండి వొచ్చిన ముస్లిం సోదరులతో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కొరోనా వైరస్ నేడు ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అధికారుల నుండి మొదలు సామాన్య ప్రజల వరకు రాజకీయ నేతల నుండి ఉద్యోగుల వరకు ఏ ఒక్కరిని కూడా వైరస్ వదిలిపెట్టడం లేదు. మరీ ముఖ్యంగా జిల్లాలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతలకు కూడా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోలీసు సిబ్బంది కూడా వైరస్‌కు గురవుతున్నారు. లాక్డౌన్లో ప్రజలు కొరోనా వైరస్‌పై భయాందోళనకు గురై బయటకు రావడానికి కొంత ఆలోచించారు.
కానీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించిన అనంతరం ఉమ్మడి జిల్లాలో కరుణ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తున్నది వైన్ షాపులో తో పాటు మరి కొన్ని వ్యాపార సముదాయాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వరంగల్ అర్బన్ కలెక్టర్‌తో పాటు వరంగల్ నగర మేయర్ దంపతులకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా అర్బన్ కలెక్టరేట్ కార్యాలయంతో పాటు వరంగల్ నగర పాలక సంస్థలో పని చేస్తున్న పలువురు అధికారులు సిబ్బంది కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సూపరిండెంట్‌తో పాటు ఆర్ఎంవోలకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతేకాకుండా ఎంజీఎంలో పనిచేసే జూనియర్ డాక్టర్లు, పలువురు సీనియర్ వైద్యులకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో అధికారుల పర్యవేక్షణ లేక కోవిడ్ వార్డు తో పాటు పలు విభాగాలలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 25 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఎంజీఎం హాస్పిటల్‌కి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
కిందిస్థాయి సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో పెద్ద స్థాయిలో కొరోనా బారిన పడ్డట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో పరీక్షలు వేగవంతం చేయడంతో పాటు రాపిడ్ యాంటిజన్ కిట్లను కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంచడం ద్వారా వైరస్ అనుమానితుల అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో వైరస్ బాధితులు బయట పడుతున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించి కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. పదికి మించి కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 15 కంటెయిన్మెంట్ జోన్లు ఉన్నాయి. అంతేకాకుండా వైరస్‌కు భయపడి ప్రజలు కూడా లాక్ డౌన్‌కు సిద్ధమవుతున్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌తో పాటు వరంగల్ కూరగాయల మార్కెట్లో కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. నగరంలోని నగల దుకాణాలతో పాటు పలు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. బాధితులు తిరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వైరస్ ఉందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వైరస్ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.