Take a fresh look at your lifestyle.

దేశ వ్యాప్తంగా కొరోనా విజృంభణ

24గంటల్లోనే కొత్తగా 62,538 మందికి పాజిటివ్‌..886 ‌మరణాలు
20 లక్షలు దాటిన కేసులు..21రోజుల్లోనే రెట్టింపు

భారత్‌లో కొరోనా వైరస్‌ ‌మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కోవిడ్‌ ‌కేసులు బయటపడుతున్నాయి. దేశంలో వైరస్‌ ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. ప్రాణాంతక వైరస్‌ అన్ని ప్రాంతాలకు విస్తరించడంతో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో గత తొమ్మిదోరోజులుగా 52 వేలకు పైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. తాజాగా అత్యధికంగా 62 వేలకు పైగా కొరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 62,538 మందికి కొత్తగా వైరస్‌ ‌సోకింది. ఒకేరోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ ‌కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 20,27,075కు చేరాయి. ఇందులో 6,07,384 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా, 13,78,106 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 886 మంది మరణించారు. దీంతో దేశంలో కొరోనా మృతుల సంఖ్య 41,585కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తాజాగా నమోదవుతున్న పాజటివ్‌ ‌కేసుల్లో దాదాపు 38 శాతం ఆంధ్రప్రదేశ్‌, ‌కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, ‌పశ్చిమబెంగాల్‌, ‌బీహార్‌ ‌రాష్ట్రాల్లోనే ఉన్నాయి. జూలై నెలలో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఈ రాష్ట్రాల వాటా 19 శాతంగానే ఉన్నది. భారత్‌లో ఒక్కరోజులోనే 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కేసులసంఖ్య 20,27,034కు చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13లక్షల 78వేల మంది కోలుకోగా, మరో 6లక్షల 7వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 50వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కొరోనా బాధితుల రికవరీ రేటు 68శాతానికి పెరిగింది. కోవిడ్‌ ‌మరణాల రేటు 2.07శాతంగా ఉంది. నిత్యం 800లకు పైగా కోవిడ్‌ ‌రోగులు ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన తొమ్మిది రోజుల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా ఐదు లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో కొరోనా కేసులు రెట్టింపు కావడానికి 21రోజుల సమయం పడుతోంది. ఇకపోతే కోవిడ్‌ ‌మహమ్మారి తీవ్రతకు మహారాష్ట్ర వణికిపోతోంది. నిత్యం దాదాపు పదివేల కేసులు, 300మరణాలు సంభవిస్తున్నాయి. గురువారం ఒక్కరోజే కొత్తగా 11,500 కేసులు నమోదుకాగా మరో 300మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య4లక్షల 80వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 16,700 మంది మరణించారు. తమిళనాడులోనూ నాలుగోసారి 100మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు తమిళనాడులో కొరోనా సోకి 4500మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌, ‌కర్ణాటక, యూపీ, తెలంగాణల్లోనూ వైరస్‌ ‌తీవ్రత అధికంగా ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!