Take a fresh look at your lifestyle.

3909 ‌మంది జర్నలిస్టులకు కొరోనా సాయం

  • మొత్తం 5.56 కోట్లు అందించాం
  • రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

తెలంగాణ మీడియా అకాడమి ద్వారా రాష్ట్ర జర్నలిస్టులకు అందించిన కోవిడ్‌ ఆర్థిక సహాయం మొత్తం 5.56 కోట్ల రూపాయలకు చేరిందని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కోవిడ్‌ ‌బారిన పడిన జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అకాడమి ఆదుకున్నదని రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. కొరోనా తగ్గుముఖం పడ్తున్న సమయంలో కూడా నాలుగు నెలల కాలంలో ఇప్పటికి కొరోనా బారిన పడిన 77 మందికి 7 లక్షల 70 వేల రూపాయలు మంగళవారం బ్యాంకులో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 3909 మంది జర్నలిస్టులకు కొరోనా సాయం అందించామని తెలిపారు. రాష్టంలోని అన్ని రంగాలను ప్రభావితం చేసిన కొరోనా జర్నలిస్టులను కూడా తీవ్రంగా ఇబ్బందుల పాలు చేసిందని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం-శిక్షణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర మీడియా అకాడమి జర్నలిస్టులకు ఎదురైన కొరోనా ఇబ్బందులను కొద్ది మేరకైనా తొలగించడానికి ప్రయత్నం చేసిందని, అందులో భాగంగా ఇప్పటి వరకు కొరోనా సోకిన 3909 మంది జర్నలిస్టులకి 5 కోట్ల 56 లక్షల 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిందని మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు.

తొలి విడత కొరోనా సమయంలో దరిదాపు 1553 మంది కొరోనా సోకిన జర్నలిస్టులకి 3 కోట్ల 10 లక్షల 60 వేల రూపాయలను, కొరోనాతో హోమ్‌ ‌క్వారంటైన్‌లో ఉన్న జర్నలిస్టులకు 87 మందికి 8 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామని, రెండవ విడత కొరోనా తీవ్ర ఉధృతి కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 2269 మంది జర్నలిస్టులకి కొరోనా సోకిందని, మలి విడత ఆర్థిక సహాయం 10 వేల వంతున 2269 మంది జర్నలిస్టులకి రెండు కోట్ల 26 లక్షల 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామని ఆయన వెల్లడించారు. మొత్తంగా మీడియా అకాడమిలో ఉన్న 42 కోట్ల కార్పస్‌ ‌ఫండ్‌తో వొచ్చిన వడ్డీ ఆధారంగా ఈ మొత్తాలను జర్నలిస్టులను ఆదుకోవడానికి అకాడమి వినియోగించిందని, తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా కూడా కొరోనా సోకిన జర్నలిస్టులకు ఇలా ఆర్థిక సహాయం అందలేదని, ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పనిగా మీడియా అకాడమి భావిస్తున్నదని అల్లం నారాయణ అన్నారు.

Leave a Reply