విజయవాడ,ఆగస్ట్ 18 : ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టడంలేదు. రాష్ట్రంలోని ఆలయాల్లో సైతం కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని పలువురు అర్చకులు, సిబ్బందికి కరోనా రావడం కలకలం రేపుతుండగా… తాజాగా విజయవాడ దుర్గగుడి ఆలయంలోని సిబ్బంది, ఉన్నతాధికారులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. దుర్గగుడి ఈవోకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
ఆలయంలో మరో 18 మంది కరోనా బారిన పడ్డారు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా కారణంగా చనిపోయారు. మూడు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన భార్య కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. అయితే టెస్ట్ చేయించుకునేవరకు కరోనా భయటపడటం లేదు దాంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఆలయంలో రోజూ శానిటైజ్ చేసినా, మాస్క్‌లు ధరించినా కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని సిబ్బంది వాపోతున్నారు.శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది.