- తాజాగా రెండున్నర లక్షలకు చేరువలో కొత్త కేసులు
- వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్.. 5,488 కేసులు నమోదు
న్యూ దిల్లీ, జనవరి 13 : భయాందోళనలకు తగ్గట్లుగానే కొరోనా ధర్డ్‌వేవ్ తీవ్ర రూపంతో ముంచుకొస్తుంది. దేశంలో రోజురోజుకీ భారీ సంఖ్యలో రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం క్రితం రోజు 18 లక్షల మందికి పరీక్షలు చేయించగా.. తాజాగా 24 గంటల్లో 2.47 లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ వేవ్‌లో ఇదే అత్యధిక కేసులు. మొత్తంగా ఇప్పటి వరకు 5,488 ఒమిక్రాన్ కేసులున్నాయి. కొరోనా మొదలైన నాటి నుండి మొత్తం కేసులు 3.63 కోట్లకు చేరుకున్నాయి. వీరిలో 3.47 కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 11,17,531 మంది చికిత్స పొందుతున్నారు. క్రియా శీలక రేటు 3.08 శాతంగా ఉంది. క్రితం రోజు 84 వేల మందికిపైగా కోలుకున్నారు. రికవరీ రేటు 95.58 శాతానికి పడిపోయింది. అదే విధంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 380 మంది మరణించడంతో.. మొత్తంగా 4.85 లక్షల మందిని కొరోనా బలి తీసుకుంది. మరోవైపు వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతంగా సాగుతుంది.
బుధవారం ఒక్క రోజు 76 లక్షల మందికి టీకా ఇచ్చారు. దీంతో వీటి వినియోగం సంఖ్య 154 కోట్లు దాటింది. 15-18 ఏళ్ల మధ్య వయస్సు వారికి 3 కోట్లకు పైగా టీకాలు పంపిణీ చేశారు. ప్రికాషన్ డోసుల పంపిణీ 26 వేలు దాటాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ కొరోనా బారిన పడ్డారు. ఆయనతో సహా మరో ఏడుగురికి వైరస్ ఉన్నట్లు నిర్దారణైందని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ గురువారం తెలిపింది. ఇటీవల ప్రారంభమైన ఇండియా ఓపెన్‌లో పాల్గొంటున్నారు. ఈ ఏడుగురిలో అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్ థక్కర్, సిమ్రన్ అమాన్ సింఘీ, కుషి గుప్తా, ట్రెస్సా జోలీ, మిధున్ మంజునాథ్ ఉన్నారు. వీరూ ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నారని చెప్పింది. ఇక మూడోవేవ్ ఆందోళనలను నిజం చేస్తూ కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది. బుధవారం రెండు లక్షల మార్క్‌కు చేరువైన కేసులు తాజాగా ఏకంగా రెండున్నర లక్షలకు చేరువ కావడం దేశంలో వైరస్ తీవ్రతకు అద్దం పడుతుంది.
బుధవారం నమోదైన కేసులతో పోలిస్తే గురువారం 52,697 ( 27 శాతం) కోవిడ్ కేసులు అధికంగా పెరిగాయని కేంద్రవైద్యారోగ్య శాఖ పేర్కొంది.మరోవైపు దేశంలో వైరస్ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి ఎగబాకింది. ఇక కోవిడ్ నుంచి 24 గంటల్లో84,825 కొరోనా రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,17,531 కొరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో సుమారు 216 రోజుల తర్వాత ఇన్ని క్రియాశీల కేసులుండడం గమనార్హం. మరోవైపు కొత్త వేరియంట్ కూడా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. బుధవారం ఒక్కరోజే 620 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరుకుంది. రాష్ట్రాల వారీగా చూస్తే..కొరోనా వ్యాప్తిలో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. అక్కడ నిన్న ఒక్కరోజే 46,723 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. ఆతర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అక్కడ 27,561 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో( 22,155), కర్ణాటక (21,390), తమిళనాడు(17,934 ) రాష్టాల్రు ఉన్నాయి.