Take a fresh look at your lifestyle.

దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే… తెలంగాణ నియంత్రణలో ముందంజ..!

  • కొరోనా యాక్టివ్‌ ‌కేసులు, మరణాలు తక్కువ, గణనీయంగా రికవరీ
  • సత్ఫలితాలనిచ్చిన ముందస్తు లాక్‌డౌన్‌, అవగాహన చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నప్పటికీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువగానే ఉన్నది. దేశంలో కొరోనా వైరస్‌ ‌కనిపించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తతో వ్యవహరించి లాక్‌డౌన్‌ అమలు చేయడం, నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. దేశంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు మార్చి నెలలో ప్రారంభం కాగా, ఏప్రిల్‌ ‌నెల మొదటి వారంలో తెలంగాణలో తొలి కొరోనా పాజిటివ్‌ ‌కేసు నమోదైంది. కొరోనా మహమ్మారిని నియంత్రించడానికి ఈ వైరస్‌ ‌సోకిన ప్రజల ద్వారా మరొకరికి సోకకుండా ఉండేందుకు మార్చి 22న ప్రయోగాత్మకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ దేశంలోని ప్రజలెవరూ రోడ్ల మీదికి రావొద్దనీ, ఇలాంటి లాక్‌డౌన్‌లు భవిష్యత్తులో మరిన్ని ఉంటాయని ముందుగానే ప్రకటించారు. భవిష్యత్తు పరిస్తితిని ముందుగానే ఊహించిన సీఎం కేసీఆర్‌ అదే నెల చివరి వారంలో రాష్ట్రంలో సంపూర్ణ
లాక్‌డౌన్‌ను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ చర్యల కారణంగా కొరోనా వైరస్‌ను నియంత్రించడంలో విజయం సాధించిందనే చెప్పాలి.

తెలంగాణతో పోలిస్తే దేశంలోని మిగతా పెద్ద రాష్ట్రాలలో కొరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద రాష్ట్రాలలో  జూలై 15వరకు నమోదైన మొత్తం కేసులు, డిశ్చార్జి అయిన వారు, మరణించిన వారి సంఖ్యను పరిశీలిస్తే మహారాష్ట్రలో… మొత్తం 1,03,813 కేసులు నమోదయ్యాయి. 1,40,325 మంది వైద్య చికిత్సలతో కోలుకోగా, వైరస్‌ ‌బారిన పడి మొత్తం 10,289 మంది మరణించారు. అలాగే, సమీప రాష్ట్రమైన తమిళనాడులో…యాక్టివ్‌ 46,972 ‌రికవరీ 89,532, మరణాలు 1966 చోటుచేసుకున్నాయి. కర్నాటకలో యాక్టివ్‌ 22, 750, ‌రికవరీ 15, 409, మరణాలు 684 సంభవించాయి. ఇక దేశా రాజధాని ఢిల్లీలో యాక్టివ్‌ ‌కేసులు 19,155, రికవరీ 89,986, మరణాలు 3371గా నమోదయ్యాయి. ఇక పొరుగు రాష్ట్రమైన ఏపీలో యాక్టివ్‌ ‌కేసులు 13, 428, రికవరీ 15,412, మరణాలు 398గా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో టెస్టులు కూడా భారీ సంఖ్యలో చేయడం గమనార్హం. ఇక దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో యాక్టివ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు 12, 208, రికవరీ 23,334, మరణాలు 934గా జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే జూలై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 12, 958 యాక్టివ్‌ ‌కేసులు ఉండగా, వైద్య చికిత్సలతో 25, 999 మంది కోలుకున్నారు. కేవలం 386 మాత్రమే మరణాలు సంభవించాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కొరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించడానికి గాంధీ, ఉస్మానియా, కింగ్‌ ‌కోఠి, చెస్ట్ ‌హాస్పిటల్స్‌లో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో పాటు వైరస్‌ ‌నియంత్రణకు చేపట్టిన కఠిన నిబంధనలు, ప్రజలలో అవగాహన కలిగించడం వంటివి రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులను గణనీయంగా తగ్గించడానికి ఉపయోగపడ్డాయని సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నమోదైన పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య, డిశ్చార్జి అయిన వారి సంఖ్య, మరణించిన వారి సంఖ్య కూడా అతి తక్కువగా ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించడం గమనార్హం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!