Take a fresh look at your lifestyle.

కరోనా..అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం

భారత దేశం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన దేశం. మనదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరు. కేవలం వ్యవసాయ రంగం మీద ఆధారపడి లక్షల కుటుం బాలు జీవనాన్ని కొనసాగి స్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో గ్రామ స్థాయిలో ఉన్న రైతులకు చేతికొచ్చిన వరి పంట మార్కెట్‌కు  చేరుకునే పరిస్థితి లేదు. మిర్చి రైతులు కోల్డ్ ‌స్టోరేజ్లో నిల్వలు నిండిపోయి, పండిన పంటను ఏమి చెయ్యాలో తెలియక బిక్కుబిక్కుమని బతుకుతున్న పరిస్థితి. రైతాంగ వ్యవస్థ చిన్నాభిన్న మయ్యే అవకాశం ఉంది కనుక రైతులకు సరైన మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వల్ల గాని, ప్రకృతి విపత్తుల వల్ల గాని దేశాలు సంక్షోభానికి గురి కావడం చూసాము. కానీ మొదటిసారి ఒక వైరస్‌ ‌ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. చైనాలో వూహన్‌ అనే నగరంలో పుట్టిన కోవిడ్‌ 19 అనే వైరస్‌(‌కరోనా) ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలకు సంక్రమించింది. దాదాపు అన్ని దేశాల్లో లాక్‌ ‌డౌన్‌ ‌పేరుతో ప్రజలు ఇంటికే పరిమితమైన సందర్భం. మానవునికి తన స్వీయ కారణాలు లేదా జన్యు కారణాల వల్ల సంభవించే వ్యాధుల ద్వారా కలిగే ప్రమాదంతో పోల్చితే కరోనా వల్ల మానవ సమాజానికి అత్యధిక ప్రమాదం పొంచి ఉన్నది. కరోనా వ్యాధి ఒక వ్యాధిగ్రస్తుడు మరొక సాధారణ వ్యక్తిని తాకడం వల్ల కాని, అతని నోటి తుంపర్ల ద్వారా కాని సంక్రమిస్తుంది. దీని ప్రభావం ప్రధానంగా ఊపిరితిత్తులపై పడి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగించడం వల్ల మనిషి మరణానికి కారణం అవుతుంది. అదేవిధంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులపై అత్యధికంగా ప్రభావం చూపుతుంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న సందర్భంగా మార్చి 22న ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ విధించి, తర్వాత దానిని లాక్‌ ‌డౌన్‌ ‌పేరుతో ఏప్రిల్‌ 14 ‌వరకూ పొడిగించడం జరిగింది. ఈ లాక్‌ ‌డౌన్‌ ‌విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానించదగిన విషయం అని చెప్పవచ్చు. కానీ లాక్‌ ‌డౌన్‌ ‌నిర్ణయాన్ని మార్చి మొదటి వారంలొనే తీసుకుంటే అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిచిపోయి కరోనా మనదేశంలోకి వ్యాప్తి చెందక పోయి ఉండేది. లాక్‌ ‌డౌన్‌లో కేవలం అత్యవసర సేవలైన వైద్య సదుపాయాలు, నిత్యవసర వస్తువులను అందుబాటులో ఉంచి మిగతావి మూసి వేయడం జరిగింది. దేశవ్యాప్తంగా గుడులు, మసీదులు, చర్చిలు కూడా మూసివేయడం ఇదే మొదటిసారి కావచ్చు. లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ప్రధానంగా పోట్టకూటి కోసం వెళ్ళిన వలస కార్మికులు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు అత్యధిక ధరలకు నిత్యావసర వస్తువులను కొనలేక, సొంత గ్రామాల్లో నివసించుటే మేలు అనే ఉద్దేశంతో వందల కిలోమీటర్లు కుటుంబంతో కలిసి కాలినడకన వెళ్లిన సందర్భం మీడియా మరియు వార్తా పత్రికల ద్వారా చూసాము. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయట పడటం కోసం వివిధ దేశాలు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి పక్క దేశాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి. ఊదాహారణకు క్యూబా దేశ వైద్య బృందం వివిధ దేశాలకు సేవలు అందిస్తే, చైనా మన దేశానికి మాస్క్‌లను అందించింది. మన దేశం అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అనే మెడిసిన్‌ అం‌దించడం జరిగింది.

భారతదేశంలో రోజు రోజుకీ పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అదే విధంగా కరోనా నియంత్రణలో పోలీసు యంత్రాంగం ప్రజలను క్వారంటైన్‌లో ఉంచేందుకు బయటకు వెళ్లిన వారిపై దాడులకు దిగడం వల్ల, ప్రజలు కేవలం పోలీసుల భయం వల్ల మాత్రమే ఇంటి నుండి బయటకు రావడం లేదు. ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా మాత్రమే రోగాన్ని నియంత్రించడం సాధ్యం అవుతుందన్న విషయాన్ని పక్కన పెట్టి, వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రధానంగా కరోనా నియంత్రణ వైద్య బృందం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో ఉన్న విద్య, వైద్య వ్యాపార రంగాల్లో పెనుమార్పులు సంభవించాయి. అందులో భాగంగా ప్రైవేట్‌ ‌దవాఖానాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొని రావడం జరిగింది. వైద్యం మరియు అత్యాధునిక పరికరాల, సేవల పేరుతో పేద మధ్యతరగతి ప్రజల నుండి ఆర్థిక దోపిడీకి పాల్పడిన ప్రైవేట్‌ ‌దవాఖానాలు నేడు మూసివేతకు గురికావడం జరిగింది. నేటివరకు అచేతన స్థితిలో ఉన్న ప్రభుత్వ దవాఖానాలు మరియు వైద్య బృందాలు కరోనా నియంత్రణలో భాగస్వామ్యం అవుతున్నారు. క్వారంటైన్‌ ‌సెంటర్లో వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ ఉండడం వల్ల వైద్య సిబ్బంది సరిపోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ప్రైవేట్‌ ‌దవాఖానాలను క్వారంటైన్‌లుగా మరియు ప్రైవేటు వైద్యులను కరోనా నియంత్రణలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. లాక్‌ ‌డౌన్‌ ‌విధించి నెలకు పైగా రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ప్రజలకు మాస్కులు, గ్లౌజులు అందించలేని స్థితిలో ఉంది. భారతదేశంలో కనుక కరోనా వ్యాధి వేగంగా విజృంభిస్తే ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలపై అత్యధికంగా ప్రభావం పడే అవకాశం ఉంది. సరైన అవగాహన లేక తగిన జాగ్రత్తలు పాటించక అత్యధికమంది ప్రజలు వ్యాధిగ్రస్తులుగా మారే అవకాశం ఉంది.
కరోనా ప్రభావం కేవలం మానవ సమాజం మీదే కాక, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై కూడా పడనుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధిరేటు పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తుంటే, భవిష్యత్తులో మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు, దిగుమతులు లేక స్టాక్‌ ‌మార్కెట్‌ ‌విలువ పడిపోయింది. ఈ ఆర్థిక భారాన్ని భర్తీ చేయడం కోసం ప్రభుత్వలు భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రమైన ఆర్థిక భారాన్ని ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొననుంది.

భారత దేశం ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన దేశం. మనదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరు. కేవలం వ్యవసాయ రంగం మీద ఆధారపడి లక్షల కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో గ్రామ స్థాయిలో ఉన్న రైతులకు చేతికొచ్చిన వరి పంట మార్కెట్‌కు చేరుకునే పరిస్థితి లేదు. మిర్చి రైతులు కోల్డ్ ‌స్టోరేజ్లో నిల్వలు నిండిపోయి, పండిన పంటను ఏమి చెయ్యాలో తెలియక బిక్కుబిక్కుమని బతుకుతున్న పరిస్థితి. రైతాంగ వ్యవస్థ చిన్నాభిన్న మయ్యే అవకాశం ఉంది కనుక రైతులకు సరైన మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా అకాల వర్షాల వల్ల నష్టపోయిన వారికి పంట నష్టపరిహారాన్ని కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే అప్పులబారంతో ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది. భారత దేశంలో రెండో ప్రధాన రంగం, అసంఘటిత కార్మిక రంగంలో భాగమయిన దినసరి కూలీలు, వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు అత్యధికంగా మన దేశంలో ఉండటం చాలా బాధాకరమైన విషయం. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సహాయం కోసం విడుదల చేసిన 500రూపాయలు కేవలం జీరో అకౌంట్‌ ఉన్న లబ్ధిదారులకు మాత్రమే అందాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్‌ ‌కార్డు లబ్దిదారులకు కుటుంబంలో ఒక్కోకరికి 12 కిలోల బియ్యం, 1500 రూపాయలు అందిస్తామని చెప్పి, ప్రభుత్వం కేవలం బియ్యం పంపిణీ చేసి 1500 రూపాయలు మాత్రం ఇంకా కొన్ని కుటుంబాలకు అందించాల్సి ఉంది. ఈ దేశంలో ఎలాంటి స్థానికత లేని, గుర్తింపు కార్డులు కూడా లేని, సంచారజాతుల పరిస్థితి ఊహించలేనిది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పేద, మధ్యతరగతి ప్రజలు కరోనా మరణాల కంటె ఆకలి మరణాలనే ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విపత్కర పరిస్థితుల నుండి సామాన్య ప్రజలను బయట పడేయల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మరియు వాటిలో పనిచేసే కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

కరోనా మన దేశానికి ఒక హెచ్చరికను జారీ చేసింది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో విద్య, వైద్య రంగానికి తక్కువగా నిధులను విడుదల చేసి నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, కరోనా ఈ సమాజానికి వైద్య రంగం యొక్క ప్రాముఖ్యత ప్రభుత్వాలకు తెలియజేస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏదిఏమైనప్పటికీ కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దేశంలో రెడ్‌ ‌జోన్‌ ‌ప్రకటించిన ప్రాంతలలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా దేశంలో ఉన్న పెట్టుబడిదారులు ఆర్థికపరంగా పేద ప్రజలను ఆదుకోవాలసిన సమయం ఇది. కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ ‌కనుగొనే విషయంలో కూడా శాస్త్రవేత్తలు జరిపే ప్రయోగాలకి ప్రభుత్వం తగిన బడ్జెటుని విడుదల చేసి మానవ సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పౌరుడు స్వీయ నియంత్రణ పాటించి కరోనాను ఎదుర్కొవాల్సిన అవసరం ఉంది.

– చింతోజు శ్రీకాంత్‌,
ఓయూ విద్యార్థి,
9010500638.

Leave a Reply