Take a fresh look at your lifestyle.

భారత్‌లో కొరోనా విలయతాండవం

‌ప్రపంచంలో రెండో స్థానానికి..

  • బ్రెజిల్‌ను దాటిన మొత్తం కేసుల సంఖ్య
  • ఒక్క రోజే కొత్తగా 1,68,912 కొత్త కేసులు నమోదు
  • మరణాల్లో నాలుగో స్థానంలో..
  • మొదటి దశను మించి రెండోదశలో విజృంభణ
  • మరో కేంద్రమంత్రి సంజీవ్‌ ‌బల్యాన్‌కు పాజిటివ్‌
  • ‌దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌
  • ‌ఛత్తీస్‌ఘడ్‌లో 18 జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌
  • 24 ‌నుంచి భారత్‌ ‌నేపాల్‌ ‌సరిహద్దులు మూసివేత

‌దేశంలో కొరోనా విలయతాండవం చేస్తున్నది. రోజురోజుకూ విజృంభిస్తున్నది. గతంలో కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. మొదటి దశను మించి రెండోదశలో కేసులు పెరుగుతున్నాయి. నాలుగైదు రోజుల క్రితం లక్ష దాటిన కేసుల సంఖ్య లక్షా 60 వేలను మించి పోయింది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,68,912 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో కొరోనా బారిన పడిన వారి సంఖ్య 1,35,27,717కి చేరింది. దీంతో కొరోనాతో విలవిలలాడుతున్న దేశాల జాబితాలో బ్రెజిల్‌ను దాటేసి అమెరికా తర్వాత భారత్‌ ‌రెండో స్థానంలో నిలిచింది. అమెరికాలో ఇప్పటి వరకు 3,19,18,591 కొరోనా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో మొత్తం ఇప్పటివరకు 1,34,82,543 కేసులు వెలుగులోకి వొచ్చాయి. తాజాగా బ్రెజిల్‌ ‌కేసుల సంఖ్యను కూడా భారత్‌ ‌దాటేసింది. కేసుల సంఖ్య పరంగా భారత్‌ ‌రెండో స్థానంలో ఉండగా.. మృతుల సంఖ్య 1.70 లక్షలతో నాలుగో స్థానంలో ఉంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్‌ ‌కోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడడం తాజాగా కలకలం రేపుతోంది.

విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీమ్‌ ‌కోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్‌ ‌చేస్తున్నారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్‌ ‌బారిన పడటంతో ఇక వి•దట వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఇంటి నుంచే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం. తాజా కోవిడ్‌ ‌కలకలం నేపథ్యంలో కోర్టు బెంచ్‌లన్నీ ఓ గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించాయి. కాగా, శనివారం ఒక్క రోజే కోర్టులో 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌గా తేలింది. గతంలో కొంతమంది న్యాయమూర్తులు కొరోనా బారినపడినా.. ఆ తర్వాత కోలుకున్నారు.

ఇండియాలో గత కొన్ని వారాలుగా వైరస్‌ ‌తీవ్రస్థాయిలో విజృంభిస్త్తున్నది. గత వారం రోజుల్లో ఏకంగా పది లక్షల కేసులు వెలుగు చూశాయి. రోజువారీ కేసుల సంఖ్య వరుసగా ఆరో రోజు కూడా లక్ష మార్కును దాటింది. తాజాగా కోవిడ్‌ ‌బారిన పడి 904 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా కేంద్ర వ్యవసాయ, ఆహార శుద్ధి శాఖ సహాయ మంత్రి సంజీవ్‌ ‌బల్యాన్‌కు వైరస్‌ ‌పాజిటివ్‌ ‌వొచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో పర్యటించినప్పడు కొరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించానని, దాంతో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కొరోనా వ్యాక్సినేషన్‌ ‌ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్‌ ‌ప్రకాశ్‌ ‌కొరోనా టీకా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా టీకా మహోత్సవం కొనసాగుతున్నది. వ్యాక్సిన్‌ ‌పంపిణీని వేగవంతం చేయడంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఆదివారం ప్రారంభమయ్యింది.

ఈ కార్యక్రమంలో అర్హులలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే టీకా నిల్వలు లేకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఒకవైపు పెరుగుతున్న కొరోనా కేసులు, మరోవైపు, యూపీ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భారత్‌- ‌నేపాల్‌ ‌భద్రతా ఏజెన్సీలు ఈ నెల 24 నుంచి భారత్‌- ‌నేపాల్‌ ‌సరిహద్దులు పూర్తిగా మూసివేయాలని నిర్ణయించాయి. ఈ సందర్భంగా భారత్‌ ‌యాక్టింగ్‌ ‌కమాండర్‌ ‌విక్రమజీత్‌ ‌మాట్లాడుతూ ఇరు దేశాల భద్రతా ఏజెన్సీల సమావేశం అనంతరం సరిహద్దుల మూసివేతపై నిర్ణయం తీసుకున్నామన్నారు. కొరోనా మరింతగా వ్యాప్తిచెందకుండా ఉండేందుకు, పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఇక ఛత్తీస్‌గఢ్‌లో కొరోనా విలయతాండవం చేస్తున్నది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు చర్యలు చేపడుతున్నది. రాష్ట్రంలో కొరోనా తీవ్రత అధికంగా ఉన్న 18 జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ‌విధించారు. మరోవైపు రాష్ట్రానికి వొచ్చేవారు తమ కొరోనా నెగెటివ్‌ ‌రిపోర్టు అధికారులకు తప్పనిసరిగా చూపించాల్సివుంటుంది. ఆ రిపోర్టు గడచిన 72 గంటలలోపుగా తీసుకున్నదై ఉండాలి. కాగా కంటైన్మెంట్‌ ‌జోన్లలో ఇంటికే నిత్యావసర సరుకులు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Leave a Reply