Take a fresh look at your lifestyle.

సహకార పోరులో ‘గులాబీ’ ప్రభంజనం

Cooperative War1

  • 95 శాతం డైరెక్టర్ల పదవులు అధికారపార్టీకే
  • రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం పోలింగ్‌
  • ‌పలుచోట్ల ఘర్షణ, ఉద్రిక్తత
  • సూర్యాపేట జిల్లాలో టీఆర్‌ఎస్‌ ‌నేత హత్య
  • ఆది, సోమవారాల్లో సొసైటీ చైర్మన్ల ఎన్నిక

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల( పీఏసిఎస్‌) ఎన్నికలలో అధికార పార్టీ బలపరచిన డైరెక్టర్లు విజయ దుందుభి మోగించారు. రాష్ట్రంలో మొత్తం 909 పీఏసిఎస్‌లు ఉండగా, శుక్రవారం నాటికి 157 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం మిగతా 747 సంఘాలకు జరిగిన ఎన్నికలకు లెక్కింపు ప్రక్రియ పూర్తి కాగా, కడపటి వార్తలు అందేసరికి 550 సంఘాలలో టీఆర్‌ఎస్‌ ‌బలపరచిన డైరెక్టర్ల్లుగా ఎన్నికయ్యారు. సంఘాలలో గులాబీ పార్టీ హవా కొనసాగింది. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ మద్దతుదార్లను గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాయి. శనివారం రాత్రి 11 గంటల తరువాత రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పీఎసీఎస్‌ల ఎన్నికల లెక్కింపు ప్రక్రియపై పూర్తి స్థాయి నివేదికను అందజేస్తామని సహకార సంఘాల ఎన్నికల అధికారి, అడిషనల్‌ ‌రిజిస్ట్రార్‌ ‌తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ మద్యాహ్నం ఒంటి గంటకు పూర్తికాగా మొత్తం 80 శాతం పోలింగ్‌ ‌నమోదైంది. మద్యాహ్నం 2 గంటలకు 6248 డైరెక్టర్ల పదవులకు జరిగిన ఎన్నికలకు లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఎన్నికలలో 12 లక్షల మంది రైతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం, సూర్యాపేట, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌,‌కరీంనగర్‌ ‌జిల్లాల్లో ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు పోలింగ్‌ ‌బూత్‌ల వద్ద బీజేపీ, టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పార్టీల మధ్య వాగ్వాదాలు, కొట్లాటలు జరిగినప్పటికీ సహకార సంఘాల కోసం రైతులు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

Cooperative War1

యార్కారం గ్రామ మాజీ సర్పంచ్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌నాయకుడు ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. ఈ గ్రామంలో సహకార ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు వర్గాల మధ్య ఘర్శణ తీవ్ర స్థాయిలో జరిగింది. కామారెడ్డిలో ఓటర్ల జాబితాలో రైతు పేరు ఫోటోలో ఒకటి ఉండగా, మరో రైతు పేరు ఉండటంతో స్థానికంగా పోలింగ్‌ ‌దగ్గర గొడవ చోటుచేసుకుంది. ఏజెంట్లు కలుగజేసుకుని ఇద్దరు రైతులు ఓటు వేసే విధంగా చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లా హాలియా మండలం కొత్తపెల్లిలో రైతుపై అక్కడి ఎస్సై చేయి చేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రైతును ఎస్సై కొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెప్పగా తాను ఆ రైతును కొట్టలేదని ఎస్సై వివరణ ఇచ్చారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం బీరోలు సహకార సంఘానికి జరిగిన ఎన్నికలో పోలింగ్‌ ‌కేంద్రంలోకి ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి వెళ్లడాన్ని గమనించిన ప్రత్యర్థి వర్గం ఆందోళనకు డిగింది. అలాగే, టీఆర్‌ఎస్‌ ‌నాయకుడు నరేశ్‌రెడ్డి పోలింగ్‌ ‌కేంద్రంలోని వెళ్లడానికి ప్రయత్నింగా అడ్డుకోవడంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలు పోలింగ్‌ ‌బూత్‌లలోకి వెళుతున్నా పోలీసులు అడ్డుకోలేదని కాంగ్రెస్‌, ‌బీజేపీ నాయకులు ఆరోపించారు.కాగా, ఆది, సోమవారాలలో పీఏసీఎస్‌ ‌చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ఎన్నిక పూర్తయిన తరువాత డీసీసీబీ, డీసీఎంఎస్‌, ‌చైర్మన్లతో పాటు మార్క్‌ఫెడ్‌ ‌పాలకవర్గాలను పీఏసీఎస్‌ ‌చైర్మన్లు ఎన్నుకుంటారు. దీనికి సంబంధించి ఈనెల 17, 18 డీసీసీబీ, డీసీఎంఎస్‌ ‌పాలకవర్గాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ‌వెలువడనుంది.

Leave a Reply