Take a fresh look at your lifestyle.

అమిత్‌ ‌షా ఆదేశాలతోనే కూచ్‌బెహార్‌ ‌కాల్పులు

  • బిజెపిపై మండిపడ్డ సిఎం మమతా బెనర్జీ
  • ఓటమి భయంతో భయోత్పాతం సృష్టిస్తున్నారని విమర్శలు
  • ఘటనకు బాధ్యత వహించి అమిత్‌ ‌షా రాజీనామా చేయాలన్న టిఎంసి

కూచ్‌ ‌బెహర్‌లో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మరణించడాన్ని పశ్చిమబెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశాలతో కుట్రలు నడుస్తున్నాయంటూ విమర్శించారు. హింగల్‌గంజ్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, సీతల్‌కుచి (కూచ్‌ ‌బెహర్‌)‌లో నలుగురు వ్యక్తులను సీఆర్‌పీఎఫ్‌ ‌కాల్చి చంపిందని అన్నారు. శనివారం ఉదయం మరో మరణం చోటుచేసుకుందని చెప్పారు. సీఆర్‌పీఎఫ్‌ ‌తన శత్రువు కాదని, అయితే హోం మంత్రి ఆదేశాలతో కుట్ర జరుగుతోందని, ఇవాల్టి ఘటన ఈ విషయాన్ని రూఢీ పరుస్తోందని పేర్కొన్నారు. ’క్యూలో నిలబడ్డ ఓటర్లను సీఆర్‌పీఎఫ్‌ ‌కాల్చిచంపింది. ఇంత తెగువ వాళ్లకు ఎలా వచ్చింది? తాము ఓడిపోతామని బీజేపీకి తెలుసు. అందువల్లే ఓటర్లను, వర్కర్లను కాల్చిచంపుతున్నారు’ అని మమత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నాలుగో దశ పోలింగ్‌లో భాగంగా  5 జిల్లాల్లోని 44 నియోజకవర్గాల్లో శనివారం ఓటింగ్‌ ‌జరుగుతోంది. వీటిలో 9 నియోజకవర్గాలు హౌరాలో, 11 నియోజకవర్గాలు 24 పరిగణాల్లో, ఐదు నియోజకవర్గాలు అలిపుదూర్‌లోని, 9 నియోజకవర్గాలు కూచ్‌ ‌బెహర్‌లో ఉన్నాయి. నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా కూచ్‌బెహర్‌లో సీఆర్‌పీఎఫ్‌ ‌జరిపిన కాల్పుల్లో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మరణించడాన్ని టీఎంసీ ఖండించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పన్నిన కుట్రలో భాగమే ఈ ఘటనని టీఎంసీ ఆరోపించింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేసింది. టీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన వి•డియా సమావేశంలో ఆ పార్టీ ఎంపీ సౌగత రాయ్‌ ‌మాట్లాడుతూ, ఓటింగ్‌కు అంతరాయం కలిగించేందుకు బీజేపీ గూండాలు చేసిన ప్రయత్నాలను సాధారణ ప్రజానీకం అడ్డుకోవడంతోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు.

బీజేపీ గూండాలకు కేంద్ర బలగాల ప్రోద్బలం ఉందని, హోం మంత్రి సారథ్యంలోనే ఈ కుట్ర జరిగిందని తాము భావిస్తున్నామని చెప్పారు. అమిత్‌షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ’కేంద్ర సాయుధ పోలీసులు బలగాలు కాల్పులు ఎందుకు జరిపాయి? సాధారణ ఓటర్లపై కాల్పులు జరిపే అధికారం వాళ్లకు ఎవరు ఇచ్చారు? ఇదే ప్రధాన ప్రశ్న. ఇది కుట్రలో భాగమే. ప్రధానికి ఈ కుట్రలో ప్రమేయం ఉందని అనుకోవడం లేదు. ఇది ఓటర్లను భయభ్రాంతులను చేసే ప్రయత్నమే’ అని రాయ్‌ అన్నారు. కూచ్‌ ‌బెహర్‌ ‌కాల్పులకు నిరసనగా పశ్చిమబెంగాల్‌లోని ప్రతి బ్లాక్‌లోనూ, వార్డుల్లోనూ టీఎంసీ కార్యకర్తలు నిరసనలు చేస్తారని చెప్పారు. కాగా, కూచ్‌ ‌బెహర్‌లోని పోలింగ్‌ ‌స్టేషన్లలో ఓటింగ్‌ ‌జరుగుతుండగా కేంద్ర బలగాలు రెండుసార్లు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో నలుగురు పార్టీ కార్యకర్తలు మరణించారని టీఎంసీ ఆరోపించింది. జిల్లాలో నలుగురు వ్యక్తుల మరణాన్ని అధికార వర్గాలు కూడా ధ్రువీకరించాయి.

Leave a Reply