Take a fresh look at your lifestyle.

గవర్నర్‌ ‌వ్యవస్థపై మరోసారి వివాదం

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూల్చడానికి వినియోగపడుతున్న గవర్నర్‌ ‌వ్యవస్థను రద్దు చేయాలంటూ సిపిఐ పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్నది. ఈ మేరకు ఛలో రాజ్‌భవన్‌ ‌పేర బుధవారం పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం ఆందోళనకరంగా మారింది. ఆందోళన కారులు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా పోలీసులు గట్టి బందోబస్త్  ‌చేపట్టినప్పటికీ, పోలీసులను తప్పించుకుని పలువురు రాజ్‌భవన్‌వైపు దూసుకు వెళ్ళారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని  సాంబశివరావు, సీనియర్‌ ‌నేతచాడా వెంకట్‌రెడ్డి తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

గవర్నర్‌ ‌వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్‌ ‌చాలాకాలంగా రాజకీయ పార్టీల మధ్య నలుగుతున్నది. రాజ్యాంగ పరిరక్షణతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలనిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈ వ్యవస్థ క్రమేణ వివాదగ్రస్తంగా మారుతోంది. రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రమే గవర్నర్‌ ‌కీలక పాత్ర నిర్వహించాల్సి ఉండగా, రాష్ట్ర రాజకీయాల్లో వారు జోక్యం తీసుకుంటున్నారన్న ఆరోపణ ఉంది. కేంద్రంలో పార్టీలు మారినప్పుడల్లా  రాష్ట్రాల్లో గవర్నర్‌లను మార్చడమన్నది ఇప్పుడు సహజమైపోయింది. కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన వారినో, ఆ పార్టీ అనుబంధ సంస్థలకు చెందినవారినో లేక తమకు అనుకూలంగా ఉండేవారినో ఈ పదవుల్లో నియమిస్తూ రావడంకూడా అంతే సహజమైపోయింది. వారు తమపార్టీ అనుకూలమైన విధానాలను రాష్ట్రంలో చేపట్టడంకూడా అంతే సహజంగా జరుగుతున్నదనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రభుత్వమే కొనసాగాలన్న లక్ష్యంగా కేంద్రం ఈ వ్యవస్థను తమకు అనుకూలంగా వాడుకుంటున్నదంటూ ప్రతిపక్షాలు చాలాకాలంగా ఆరోపిస్తూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను అకారణంగా కూల్చి తమకు అనుకూలమైన నాయకునికి లేదా తక్కువ మెజార్టీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల నేతలను కలుపుకుని ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు. నరేంద్రమోదీ నేతృత్వంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వొచ్చిన తర్వాత గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌లాంటి రాష్ట్రాలే అందుకు ఉదాహరణ.  అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మహారాష్ట్రలోకూడా  ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. 1967 వరకు ఈ వ్యవస్థ సాఫీగా సాగింది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్రాల్లో వేరువేరు పార్టీలు అధికారంలోకి రావడంతో  గవర్నర్‌లను అడ్డుపెట్టుకుని కేంద్రాలు రాష్ట్రాలపై పెత్తనం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. 1977లో జనతాపార్టీ మొదలు ఇప్పటి వరకు ఆలా 41 ప్రభుత్వాలు డిస్‌మిస్‌ ‌చేయబడ్డాయని  ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపిస్తున్నారు.

1984లో నాటి ఉమ్మడి ఏపి గవర్నర్‌ ‌రాంలాల్‌ ఆ ‌నాటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావును ఎంత ఘోరంగా అవమానించారన్న విషయాన్ని ఆయన  ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందుకే ఆనాడే ఈ వ్యవస్థను  రద్దు చేయాలని  ఎన్టీఆర్‌ ఆం‌దోళన చేపట్టారు. వాస్తవంగా రాష్ట్ర శాసనసభ, మండలిలో అమోదించిన బిల్లులను లాంఛనంగా అమోదించాల్సిన గవర్నర్‌ ‌వాటిపై ఎలాంటి చర్య తీసుకోకుండా చాలాకాలంగా పెండింగ్‌లో పెట్టి రాష్ట్ర ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నారంటున్నారు సాంబశివరావు. కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి అనుమతికోసం ఆ బిల్లులను  రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంటుంది. లేదా వాటిపై సంపూర్ణ వివరణకోసం తిరిగి రాష్ట్రప్రభుత్వానికి పంపించవొచ్చు. అలాంటి పరిస్థితిలో ఆలస్యం  జరుగడం అనివార్యం. కాని ఏలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టడమన్నది సరైందికాదు. రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి పంపినప్పుడు మాత్రం ఆ బిల్లులపైన గవర్నర్‌కు ఆమోద ముద్ర వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాని, కేంద్రానికి అనుకూలంలేని  రాష్ట్రాల్లో అందుకు భిన్న ప్రక్రియలు జరుగుతున్నదన్నది సాంబశివరావు ఆరోపణ.  గవర్నర్‌ ‌కార్యాలయాలు బిజెపి క్యాంపు కార్యాలయాలుగా మారుతున్నాయన్నది ఆయన ఆరోపణకూడా.

పశ్చిమ బెంగాల్‌, ‌కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పాలనలో గవర్నర్‌లు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారు.  తెలంగాణరాష్ట్రానికి వొస్తే శాసనసభ, మండలి ఆమోదించి పంపిన ఏడు బిల్లులు గత రెండు నెలలుగా గవర్నర్‌ ‌వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పైగా ప్రగతి భవన్‌, ‌రాజ్‌భవన్‌ ‌మధ్య అంతరం పెరుగుతున్నది. అలాగే కేరళలో ఆరు బిల్లులకు చాలాకాలంగా మోక్షం లేదు. తమిళనాడులో శాసనసభ ఆమోదించిన ఇరవై బిల్లులు నెలల తరబడి ఆమోదానికి నోచుకోవడంలేదు. అందుకే పెద్దగా ఉపయోగపడని ఆరవ వేలుతో పోలుస్తున్న ఈ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలంటోంది  సిపిఐ. గవర్నర్‌ ‌వ్యవస్థను తప్పుపట్టిన సర్కారియా కమిషన్‌  ‌పాటు, ఇతర అనేక కమిషన్‌ ‌లు గవర్నర్‌ ‌వ్యవస్థ  ప్రక్షాళన కోసం చేసిన అనేక సిఫారసులను పరిగణలోకి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ వ్యవస్థను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని, అందులో భాగంగా ఈ నెల 19న మరో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కూడా ఆ పార్టీ ప్రకటించింది.

Leave a Reply