Take a fresh look at your lifestyle.

గోవుల అక్రమ రవాణాపై.. ముదురుతున్న వివాదం

  • ఎమ్మెల్యే రాజాసింగ్‌, ‌సిపి సజ్జన్నార్‌ల మధ్య మాటల యుద్ధం
  • గోవధకు పోలీసులు సహకరిస్తున్నారన్న రాజాసింగ్‌
  • అనవసర విమర్శలు చేస్తే కేసులు తప్పవన్న సజ్జన్నార్‌
  • ‌రాజాసింగ్‌ ‌వ్యాఖ్యలపై తీవ్ర పరిణామాలుంటాయి : ఎమ్మెల్సీ సలీం

హైదరాబాద్‌ ‌నగరానికి గోవుల అక్రమ రవాణా అంశం వివాదాస్పదంగా మారుతోంది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదం కాస్తా ముదిరి బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌, ‌సైబరాబాద్‌ ‌సిపి సజ్జన్నార్‌ ‌మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ ‌నగరానికి అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌వెంబడించి అడ్డుకున్నారు. గోవులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్‌ ‌పోలీసులకు అప్పగించారు. ఆ మరుసటి రోజే మరో చోట ఇదే తరహా సంఘటన జరిగింది. హైదరాబాద్‌ ‌నగరంలోని బహద్దూర్‌పురాలో ఉన్న పశువధ శాలకు గోవులను తరలిస్తున్నట్లు వాహనంలో ఉన్న వ్యక్తులు చెప్పడంతో రాజాసింగ్‌
‌హైదరాబాద్‌ ‌పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు.

గోవుల అక్రమ రవాణాకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని విమర్శలు చేశారు. పోలీసులు డబ్బులు తీసుకుని గోవుల అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పైగా, పోలీసు స్టేషన్ల ముందు నుంచే గోవుల అక్రమ రవాణా జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వేతనాలు సరిపోకుంటే బిక్షమెత్తి అయినా ఇస్తామని కానీ గోవధకు సహకరించడం వంటి పాపం చేయవద్దని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సైబరాబాద్‌ ‌సిపి సజ్జన్నార్‌ ‌సైతం అంతే తీవ్రంగా స్పందించారు.

- Advertisement -

పోలీసులపై రాజకీయ నేతలు విమర్శలు చేయడం ఫ్యాషన్‌గా మారిందనీ, పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాజాసింగ్‌ ‌పోలీసులపై చేసిన వ్యాఖ్యలు మొత్తం పోలీసు శాఖ నైతిక స్తైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనీ, భవిష్యత్తులో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవధ అక్రమ రవాణా విషయంలో పోలీసులు డబ్బులు తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. సిపి సజ్జన్నార్‌ ‌వ్యాఖ్యలపై ఎమ్మెల్యే  రాజాసింగ్‌ ‌సామాజిక మాథ్యమాల వేదికగా మరోసారి స్పందించారు.

సైబరాబాద్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లయితే, గోవుల అక్రమ రవాణా విషయం బయటపడుతుందని స్పష్టం చేశారు. పాత నగరంలోని బహద్దూర్‌పురా పశు వధశాలకు ప్రతీ రోజూ అక్రమ గోవుల రవాణా జరుగుతోందనీ, అలాగే, నగర శివార్లలోని చెంగిచెర్ల పశువుల వధకు కూడా 24 గంటలు గోవులు అక్రమంగా రవాణా అవుతున్నాయనీ, పోలీసులు నిజాయితీ పరులైతే వీటి అక్రమ రవాణాను అడ్డుకోవాలనీ, బాద్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌పోలీసులకు సవాల్‌ ‌విసిరారు. కాగా, గోవుల అక్రమ రవాణా అంశంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌, ‌సిపి సజ్జన్నార్‌ ‌మధ్య కొనసాగుతున్న వివాదంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సలీం ప్రవేశించి వివాదాన్ని మరింత తీవ్రతరం చేశారు. రాజాసింగ్‌ ‌చేస్తున్న వ్యాఖ్యలు మత విధ్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనీ, భవిష్యత్తులో ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌, ‌సిపి సజ్జన్నార్‌ ‌మధ్య తలెత్తిన గోవుల అక్రమ రవాణా వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

Leave a Reply