Take a fresh look at your lifestyle.

ముదురుతున్న పులిచింతల పంచాయితీ

  • తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తితో నీటి వృధా
  • వేసవి తాగునీటి అవసరాలకు దెబ్బే అంటున్న నిపుణులు

విజయవాడ, జూలై 5 : వరదలొచ్చినప్పుడు నాగార్జునసాగర్‌ ‌నుంచి విడుదల చేసే నీటి నుంచి 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడం కోసం పులిచింతల బ్యాలెన్సింగ్‌ ‌రిజర్వాయర్‌ను ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించారు. కృష్ణా డెల్టాను స్థిరీకరించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. దీంతో పాటు విద్యుత్‌ ఉత్పత్తిని కూడా దృష్టిలో పెట్టుకుని పులిచింతల ఎడమ వైపున తెలంగాణ భూభాగంలో విద్యుత్‌ ‌కేంద్రం నిర్మితమైంది. రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణానదికి కుడి వైపున ఉన్న విద్యుత్‌కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌కు, ఎడమ వైపున ఉన్నవాటిని తెలంగాణకు పంచారు. ఈ కారణంగానే పులిచింతల వద్ద విద్యుత్‌ ఉత్పత్తి చేసే అధికారం, వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి లభించాయి.

పులిచింతల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు చెందినప్పటికీ విద్యుత్‌కేంద్రం మాత్రం తెలంగాణకు దక్కింది. దీంతో తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శిస్తున్నారు. ఇకపోతే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించిన తర్వాత పులిచింతల బ్యాలెన్సింగ్‌ ‌రిజర్వాయర్‌ ‌వల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తూ ప్రకాశం బ్యారేజీకి తరలించడం వల్ల కృష్ణాజిల్లాకు సాగునీటి సమస్య తీరిపోయింది. కృష్ణాజలాల కోసం వేచిచూడకుండా రైతులు సకాలంలో పంటలు వేసుకుంటున్నారు. వేసవిలో మంచినీటి కొరత ఏర్పడినప్పుడు మాత్రమే పులిచింతల ఉపయోగ పడుతోంది. ఈ సీజన్‌లో వరదలు రాని పక్షంలో పులిచింతల ఖాళీ అయిపోతుంది. అప్పుడు మంచినీటి కొరత ఏర్పడినా నీళ్లు ఉండవు. అయితే కాళేశ్వరం నుంచి వర్షాకాలంలోనే నీటిని ఎత్తిపోస్తున్నారు కనుక విద్యుత్‌ అవసరం తెలంగాణకు ఎక్కువగా ఉంటుంది. అందుకే పులిచింతల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని కేసీఆర్‌ ‌నిర్ణయించుకున్నారని అంటున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరైన ఎపి సిఎం జగన్‌, ఇప్పు‌డు తెలంగాణ ముఖ్యమంత్రితో కనీసం ఫోన్లో కూడా మాట్లాడటానికి ఎందుకు ప్రయత్నించడంలేదని రైతాంగ నేతలు విమర్శిస్తునన్నారు. ప్రధానికి ఫిర్యాదు చేయడం వల్ల ప్రయోజనం లేదంటున్నారు. పులిచింతలలో నిల్వ ఉన్న నీరు ఎండాకాలం అవసరాలకు కావలసి ఉంటుందని అంటున్నారు. నీరు వృధాగా పోతున్నందున ఉత్తుత్తి హెచ్చరికలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని అంటున్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోగల సమస్యలను కూడా జటిలం చేస్తూ రాజకీయ అవసరాల కోసం ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇరువైపులా జరుగుతోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చూపెట్టి సీమప్రజల చూరగొనవచ్చునన్నది జగన్‌ ‌రెడ్డి ఎత్తుగడ కావచ్చు.

మొత్తానికి ఇద్దరికీ రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి కనుక ప్రస్తుత ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి చేయడం ద్వారా పులిచింతలను ఖాళీ చేయడం వల్ల ఎవరికైనా నష్టం జరుగుతోందంటే అది కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకే. వచ్చే వేసవిలో తాగునీటి కొరత ఏర్పడితే ఇబ్బంది పడేది వారే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌ ‌రెడ్డి బలహీనతలు, బేలతనం బయటపడుతున్నాయి. రాయల సీమను కూడా కోనసీమగా చూడాలని ఉందని ఏడాదిన్నర క్రితం గొప్పగా చెప్పి ఔదార్యాన్ని చాటుకోవ డమే కాకుండా నగరిలో ఉండే ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లి విందు ఆరగించి వచ్చిన కేసీఆర్‌, ఇప్పు‌డు తన రాజకీయ అవసరాల కోసం ప్రస్తుత వివాదానికి తెర తీశారని విమర్శిస్తున్నారు. తెలంగాణ గడ్డ ద జగన్మోహన్‌ ‌రెడ్డి సోదరి షర్మిల సొంత పార్టీ పెట్టుకోవడంపై కేసీఆర్‌ ఆ‌గ్రహంగా ఉన్నారని కూడా అంటున్నారు. సోదరిని కట్టడి చేయలేకపోతున్న జగన్‌ ‌రెడ్డిపై మంటగా ఉన్న కెసిఆర్‌ ఇలా జలజగడాలకు తెరతీసారని కూడా అంటున్నారు.

Leave a Reply