మహిళా ఎంపీడీఓపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కమలాపూర్ మండలం ఉప్పల్లో జరిగిన కార్యక్రమంలో అందరి ముందు అవమాన పరిచేలా అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఎంపీడీఓను ఉద్దేశిస్తూ ఎంపీడీవో మీరు బాగానే ఊపుతున్నారు.. కానీ ఇక్కడ ఏం ఊపడం లేదని మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఎంపీడీవో షాక్ తిన్నారు. మంత్రి వెనకాలే ఉన్న ఆమె మంత్రి కామెంట్స్ విని అలాగే నిలబడిపోయారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఓ మహిళా అధికారిపై ఇలా అనుచిత కామెంట్స్ చేయడం టిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేల్లులుతుందని పలువురు విమర్శిస్తున్నారు.
ఎంపిడివోపై దురుసుగా మాట్లాడడం అవివేకం…కెయు విద్యార్థి జెఎసి నాయకుడు తిరుపతి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎంపిడిఓపై దురుసుగా మాట్లాడడం అవివేకమని కేయూ విద్యార్థి జేఏసీ నాయకుడు తిరుపతి విమర్శించారు. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో స్థానిక ఎంపిడిఓపై దురుసుగా మాట్లాడి కించపరిచారని, మహిళా ఎంపీడివోపై అలా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని అన్నారు.
ఉద్యమాలతో, ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతూ ఇలా దుర్భాషలాడడం ఎర్రబెల్లికే చెల్లుతుందని విమర్శించారు. వారు ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇకనైనా మాటలు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో మీపై ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.