Take a fresh look at your lifestyle.

సామాజిక దూరంతో వైరస్‌ ‌మాయం నిరంతర అప్రమత్తతతోనే నియంత్రణ

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు కొరోనా అనుమానిత లక్షణాలతో 272 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో కొరోనా లక్షణాలున్న 10మంది రక్తనమూనాలను పరీక్ష కోసం గాంధీ, పూనే ఆసుపత్రులకు పంపించగా అందరికీ కూడా కొరోనా వైరస్‌ ‌లేదని తేలింది. వరంగల్‌ ఎన్‌ఐటి విద్యార్థి కాన్ఫరెన్స్ ‌కోసం అమెరికా వెళ్లి తిరిగి వరంగల్‌ ‌నిట్‌కు చేరుకోగా కొరోనా లక్షణాలు కనిపించడంతో అతన్ని ఎంజిఎం ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ ‌వార్డులో ఉంచి చికిత్స అందించడం జరిగింది. అతడి రక్తనమూనాలను కూడా పరీక్ష కోసం పంపించగా కొరోనా వైరస్‌ ‌నెగెటివ్‌గా నిర్ధారణ కావడం జరిగింది. దుబాయ్‌ ‌నుండి వచ్చిన ఇద్దరు భార్యభర్తలతో పాటు మరో నలుగురు కొరోనా లక్షణాలతో కనిపించడంతో ఎంజిఎం ఆసుపత్రి ఐసొలేషన్‌ ‌వార్డులో చేర్పించడం జరిగింది. తాజాగా ఢిల్లీ నుండి సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన పంజాబ్‌కు చెందిన 30 ఏళ్ళ యువకుడికి కూడా ఎంజిఎం ఆసుపత్రిలో ఐసోలేషన్‌ ‌వార్డులో ఉంచి, అతని రక్తనమూనాలను పరీక్ష కోసం పంపించడం జరిగింది.

శనివారం హైదరాబాద్‌ ‌నుండి క్వారంటైన్‌లో ఉన్న దంపతులు కూడా వైద్యులకు సమాచారం ఇవ్వకుండా రైలులో తమ ప్రాంతాలకు వెళ్తుండగా కాజీపేటలో ప్రయాణికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించగా వీరిని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. తెలంగాణవాసులకు ఎవరికీ కూడా వైరస్‌ ‌సోకకపోవడం తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖతోపాటు వివిధ శాఖల సమన్వయంతో పనిచేయడం నిబద్ధతకు నిదర్శమనంగా చెప్పవచ్చు. కొరోనా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజాజీవనాన్ని అస్తవస్తం చేస్తూ చిరువ్యాపారులు, చేతివృత్తులు, సినిమాహాళ్ళు, బారులు, రెస్టారెంట్లు, పార్కులు, స్కూళ్ళు, కాలేజీలు అన్ని కొరోనా ప్రభావంతో మూతపడ్డాయి. ఏ ఇద్దరు కలిసినా వైరస్‌ ‌సోకుతుందేమోననే భయం తప్ప మరేం కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొరోనా వైరస్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదు కానప్పటికీ అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరిగుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ముందుచూపుతో వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే వ్యక్తి పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించడం, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎక్కడికక్కడ విదేశీయులను, వైరస్‌ అనుమానితులను కట్టడి చేయడం ద్వారా వైరస్‌ ‌మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా నిరోదించడం జరిగింది. అయితే ప్రభుత్వం విదేశీయుల గుర్తింపు కోసం ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటుననప్పటికీ రాష్ట్రంలో విదేశీ మత ప్రచారకుల హడావుడి కొనసాగుతుంది.

- Advertisement -

తాజాగా హైదరాబాద్‌లోని ఒక పేరుపొందిన మసీదులో తలదాచుకున్న విదేశీయులను అధికారులు గుర్తించడం జరిగింది. వారిలో ఒకరికి కొరోనా వైరస్‌ ‌లక్షణాలు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. అంతేగాకుండా నల్గొండ జిల్లాలో కూడా విదేశీ మత ప్రచారకుల కలకలం వెలుగుచూసింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం, విదేశీ వ్యక్తులు, అపరిచిత వ్యక్తులు ఎవరు కనబడినా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించడంతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ ‌వైరస్‌ ‌నివారణ చర్యలను పకడ్బందీగా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడం, విదేశీ యాత్రికులను గుర్తించడం ద్వారా వైరస్‌ ‌వ్యాప్తి కొంత వరకు అదుపులోనే ఉంది. అయితే ఒక్కసారిగా కరీంనగర్‌ ‌సంఘటన నేపథ్యంలో 9మంది ఇండోనేషియా వాసులకు కొరోనా లక్షణాలు కనిపించడంతో తెలంగాణలో కూడా ఒక్కసారిగా కొరోనా బాధితుల సంఖ్య పెరిగింది. ఢిల్లీ నుండి రైలు మార్గం ద్వారా ప్రయాణించిన ఇండోనేషియా వాసులు రామగుండం మీదుగా కరీంనగర్‌ ‌చేరుకోవడం జరిగింది. కొరోనా వైరస్‌ ‌లక్షణాలతో గుర్తించిన వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్‌ ‌వార్డుకు తరలించడం జరిగింది. కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో అనేక కార్యక్రమాలు పెండ్లిళ్లు, శుభకార్యాలు తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేసుకోక తప్పట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు అన్ని రకాల వేడుకలను, మనుషులు గుమికూడే ప్రతీ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో చాలా వరకు ముందే నిర్ణయించిన పెండ్లిళ్లు శుభకార్యాలు అత్యంత తక్కువ అతిథులతో కుటుంబ సభ్యులతో నిర్వహించుకోవడం జరుగుతున్నది.

నగరానికి చెందిన ఓ యువకుడు ఇటీవల పెండ్లి చేసుకునేందుకు నిశ్చయించుకొని ఫ్రాన్స్ ‌నుండి రావడం జరిగింది. నగరంలో ఓ ఫంక్షన్‌హాల్లో భారీ ఏర్పాట్ల మధ్య బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహ వేడుకలు నిర్వహించుకోవడంతో పాటు వివాహానికి సంబంధించిన రిసెప్షన్‌ ‌కార్యక్రమాన్ని కూడా నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే సమాచారం అందుకున్న అధికారులు వెంటనే యువకునికి సంబంధించిన పెద్దలను పిలిపించి రిసెప్షన్‌ ‌కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని సూచించడంతో పాటు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఎంజిఎం ఆసుపత్రిలో సదరు యువకుడికి అతడికి ఎటువంటి వైరస్‌ ‌లక్షణాలు లేకపోయినప్పటికీ ఆ యువకున్ని 14 రోజుల పాటు ఇంట్లో నుండి బయటకు రావొద్దని ఆదేశించడం జరిగింది. చాలా మంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమాజ శ్రేయస్సు కోసం వివాహాలను రద్దు చేసుకోవడం లేదా తక్కువ అతిథులతో నిర్వహించుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ దఫా హోలీ వేడుకలకు కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో అధికార యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఈ నెలలో నిర్వహించనున్న శ్రీరామనవమితో పాటు ఉగాది వేడుకలను కూడా అధికారికంగా నిర్వహించడం లేదని ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మసీదులు కూడా భక్తులు గుమికూడకుండా కార్యక్రమాలు ఏవీ నిర్వహించడం లేదు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొరోనా నేపథ్యంలో మూసివేయడం జరిగింది.

నగరంలో ఉన్న వేయిస్తంభాలయ దేవాలయం, భద్రకాళి దేవాలయం, చారిత్రాత్మక ఖిలావరంగల్‌ ‌కోటలోకి ఎవరినీ అనుమతించడం లేదు. కొరోనా ప్రభావంతో ఇప్పటికే అనేక చిరు కార్మికులు, రోజువారి కూలీలు, భవన నిర్మాణ రంగ కార్మికులు, సినిమా హాళ్ళ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పౌల్ట్రీ రంగంపై కొరోనా తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. అనేక వదంతుల నేపథ్యంలో చికెన్‌తో పాటు కోడిగుడ్లకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో చికెన్‌, ‌గుడ్ల ధర భారీగా పతనమైంది. పౌల్ట్రీరంగం కోల్కోలేని తీవ్రస్థాయిలో నష్టా)ను మూట••ట్టుకుంటున్నది. ఈ సమయంలో కేవలం వైద్యులు, వైద్య సిబ్బంది సేవలను కొనియాడవల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొరోనా నేపథ్యంలో రోగులకు సేవలందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు చప్పట్లతో అభినందించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూకు సిద్ధమవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు జనతా కర్ఫ్యూ పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఇప్పటికే పెద్దఎత్తున ప్రచారం మొదలైన నేపథ్యంలో 22న ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు జనతా కర్ఫ్యూ నేపథ్యంలో అందరు తమ వ్యక్తిగత కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని ఇళ్ళకే పరిమితం కావాలని పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా జనతా కర్ఫ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక దూరాలను పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

Leave a Reply