ముందు చూపుతో నియంత్రిత సాగు ..
‘‘రాబోయే రోజుల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయి కోటి 30 లక్షల ఎకరాలలో బంగారు పంటలు పండించే దిశగా తెలంగాణ పురోగమిస్తున్నది. ఇబ్బడిముబ్బడిగా ధాన్యం ఉత్పత్తి కాబోతున్న నేపథ్యంలో రాబోయే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.”
‘‘నియంత్రిత సాగు కేవలం ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించిన విధానం కాదు. తెలంగాణలో వ్యవసాయ విప్లవం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ముందు చూపుతో ఆలోచించి రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, పరిష్కారాలను దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సే కేంద్రబిందువుగా సమగ్ర వ్యవసాయ అభివృద్ధి విధానం రూపొందించాం. కరెంటు సమస్య తీరిపోయి ప్రాజెక్టులు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ సమృద్ధి కలిగిన రాష్ట్రంగా రూపుదాలుస్తుంది. ఈ యాసంగిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.సి.ఐ) దేశవ్యాప్తంగా లక్షా 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 64 లక్షల టన్నులు తెలంగాణ నుంచే సేకరించింది. అంటే దేశం మొత్తంలో 55శాతం ధాన్యం తెలంగాణ నుంచే సేకరించింది. ఈ సందర్భంగా తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఎఫ్.సి.ఐ చైర్మన్ స్వయంగా అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాళ్లకు వ్యవసాయం సరిగా చేయడం రాదని, పాలన చేతగాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అలుముకుంటుందని, రైతాంగం తీవ్ర కష్టాల పాలవుతుందని అప్పటి పాలకులు అవాకులు, చవాకులు పేలారు. కానీ, తెలంగాణ అద్భుతంగా పురోగమించి గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందనడానికి పెరిగిన వ్యవసాయ ఉత్పత్తి గొప్ప తార్కాణం.’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.
- మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే రైతులు పండిస్తారు. దీనివల్ల కొనుగోలు సమస్య, మద్దతు ధర సమస్య తలెత్తదు.
- భూమి నుంచి పంటలను తీసుకోవడమే కాకుండా, ఆ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పంటల మార్పిడి వల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుంది.
- ఒకేరకం పంట వేయడం వల్ల, ఆ ధాన్యానికి అలవాటైన బ్యాక్టీరియా ఆ పొలాల్లోనే తిష్టవేస్తుంది. చీడ పీడలకు, తెగుళ్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. పంటల మార్పిడి వల్ల బ్యాక్టీరియా పంటలపై తిష్టవేసే ప్రమాదం ఉండదు.
- నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండి, మురుగునీటి సమస్య తలెత్తే ప్రమాదం తప్పుతుంది.
- భూమిలో లవణీయత పెరిగి చవుడు బారిపోయే ప్రమాదం ఉండదు.