Take a fresh look at your lifestyle.

కరోనా కట్టడిలో జీవ వైద్య వ్యర్థాల నియంత్రణ

“మనదేశంలో నాలాలు, మురుగు కాల్వలు, పట్టణ శివారులో ఆస్పత్రి వ్యర్థాలను కుమ్మరిస్తున్న పరిస్థితి ఉంది. ఆస్పత్రుల్లో వినియోగించిన సిరంజీలు, దూది, చేతి తొడుగులు, శస్త్రచికిత్సలో తొలగించిన శరీర భాగాలు మొదలైన వాటిని జనసంచార ప్రాంతాల్లో పారేయరాదన్న బయో మెడికల్‌ ‌వ్యర్థాల చట్ట నిబంధనల పట్ల ఉదాసీనంగా ఉన్న సంస్థలు కరోనా ఉదంతంతో నైనా కళ్ళు తెరవాల్సి ఉంటుంది.”

మహాభారత యుద్ధం 18 రోజుల్లో ముగిసింది కానీ కరోనా మహమ్మారిపై భరత జాతి మహాసంగ్రామం 21 రోజులపాటు కొనసాగుతుంది. దేశవ్యాప్త మూసివేత(లాక్‌ ‌డౌన్‌) ‌నిర్ణయం ప్రకటిస్తూ ప్రధాని మోడీ పలికిన మాటలివి. చైనాలో కరొనా వైరస్‌ ‌వల్ల పుట్టుకొచ్చిన కొవిడ్‌-19 ‌వ్యాధి ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నది. కంటికి కనిపించని జీవి మానవ మనుగడను ప్రశ్నిస్తుంది. ఆడ, మగ, జాతి, మతం, కులం, ప్రాంతం సంపన్న దేశం, బలహీన దేశం ప్రజాస్వామ్యం, నియంతృత్వం అనే భేదం లేకుండా అన్ని దేశాలు ఈ వైరస్‌ ‌ముందు మోకరిల్లినాయి. ప్రపంచంలోని 206 దేశాలకు విస్తరించిన ఈ వైరస్‌ ‌వల్ల వాటి ఆర్థిక వ్యవస్థలు స్తంభించి కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 14 లక్షలకు పైచిలుకు కేసులతో 90 వేలకు పైగా మరణాలతో చెలరేగుతున్న కోవిడ్‌ -19 ఈనెల 12(ఈస్టర్‌ ‌డే) నాటికి విశ్వరూపం ప్రదర్శించనుంది అని ట్రంప్‌ ‌సర్కారే చెబుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా కట్టడికి అనేక వ్యూహాలను ప్రారంభించాయి. మన దేశంలో కూడా కరోనా నియంత్రణకు బహుముఖ వ్యూహాలను చేపట్టినారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించి పౌరులను స్వీయ నియంత్రణలో ఉంచడం, కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన ముప్పును ఎదుర్కొనటానికి 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం, బ్యాంకులు రెపో రేటు, రివర్స్ ‌రెపో రేట్లను సవరించడం. ఈ చర్యలన్నీ సత్ఫలితాలను ఇస్తున్న దశలో, నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌ఘటన కరోనా వ్యాప్తికి దోహదపడింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ‌విజృంభణతో కరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరిగి ఆసుపత్రుల యందు బయో వ్యర్థాలు భారీగా పోగుపడుతున్నాయి. బయో వ్యర్థాలను సక్రమంగా నిర్మూలించ లేకపోతే నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌ఘటన తరహాలో కరోనా వ్యాధి కరాళ నృత్యం చేసే అవకాశం ఉంది.

సాధారణ పరిస్థితులలో ఆసుపత్రుల నుండి దేశవ్యాప్తంగా రోజుకు 550.9 టన్నుల(టిపిడి) జీవ వైద్య వ్యర్థాలను తరలిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇది ఇది రెట్టింపు అయ్యే ఆస్కారం ఉంది. ఆసుపత్రులు, క్వారంటైన్‌ ‌కేంద్రాల నుండి జీవ వైద్య వ్యర్థాలను 48 గంటల లోపు తరలించాలని, లేని పక్షంలో గాల్లోకి వైరస్‌, ‌బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కోవిడ్‌-19 ‌వ్యాధి సోకిన బాధితులకు, అనుమానితులకు వినియోగించిన సూదులు, సిరంజీలు, మాస్కులు మొదలైన సామాగ్రి సహా దేనిని ఇతర సాధారణ వ్యర్థాలతో కలపవద్దని, అన్నింటినీ కలగలిపి తగలబెట్టరాదంటూ వివిధ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ), ‌భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) ‌వంటివి క్రోడీకరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా దేశ కాలుష్య నియంత్రణలో అపెక్స్ ‌సంస్థ అయిన సిపిసిబి రూపొందించిన బిఎండబ్ల్యూఎంఆర్‌-2016(‌జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ నియమావళి-2016)కు కరోనా వైరస్‌ ‌వ్యాప్తి దృష్ట్యా కొన్ని అదనపు నియమాలను రూపొందించింది. కరోనా వార్డులు, క్వారంటైన్‌ ‌కేంద్రాలనుండి సేకరించిన జీవ వైద్య వ్యర్థాలను తప్పనిసరిగా ఎల్లో కవర్‌ ‌బ్యాగులలో భద్రపరిచి దానిమీద స్పష్టంగా కోవిడ్‌-19 ‌వేస్టేజ్‌ అని ముద్రించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు పలు సూచనలు జారీ చేసింది. హానికరమైన వ్యర్థాలను ఇన్‌ ‌సినీ రేటర్‌ ‌ద్వారా రూపుమాపాలని లేనిపక్షంలో లోతైన గొయ్యి తీసి పూడ్చి పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం సాధారణ ఆస్పత్రి వ్యర్థాలలో 10-25 శాతాన్ని ప్రమాదకరంగా భావిస్తారు, కానీ కరోనా విషయంలో అటువంటి లెక్కలు పనికి రావని అడుగడుగునా జాగ్రత్తలు అత్యవసరమని తెలిపింది. అమెరికా, ఐరోపాలతో పోలిస్తే దేశీయంగా కోవిడ్‌-19 ‌కేసుల నమోదు వేగం తక్కువగానే ఉన్నా కోవిడ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఊహకు అందని పరిస్థితుల్లో మనదేశంలో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కనీసం 5 లక్షల మంది కరోనా వైరస్‌ ‌సమరంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఒక్కొక్కరు రోజుకు మూడుసార్లు అయినా వైరస్‌ ‌రక్షణ సామాగ్రి మార్చాలంటే రోజుకుకు 15 లక్షల వ్యక్తిగత రక్షణ సామాగ్రి(పిపిఈ) కిట్లు అవసరపడతాయి. ఒక రోగి దగ్గర నుంచి మరొక రోగి దగ్గరకు వెళ్లేటప్పుడు పిపిఈలను మార్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్య సిబ్బందికి ఒక్కొక్కరికి రోజుకు కనీసం ఒక పిపిఈలను ఇచ్చే పరిస్థితి లేదు.

ఆరోగ్య సిబ్బందిని మొదట మనం రక్షించు కోకుండా కరోనాను నియంత్రించడం సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నెల రోజుల క్రితమే హెచ్చరించింది. అయితే తాజాగా కోవిడ్‌పై పోరాటానికి చైనా విరాళంగా ఇచ్చిన 1.70 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలు మరియు దేశీయంగా సిద్ధమైన 20 వేలతో కలిపి మొత్తం 1.90 లక్షల పిపిఈలను ఆసుపత్రులకు పంపిణీ చేయడం కొంత ఊరట కలిగించే అంశంగా భావించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 14 లక్షలకు పైబడిన కరోనా కేసులలో మూడొంతుల మేర అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ ‌సహా 8 దేశాల్లోనే నమోదయ్యాయి. వాటిలో ఇరాన్‌ ‌మినహా మిగతా దేశాలు వ్యర్థాల నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చైనా కేవలం రోజుల వ్యవధిలో 2 ప్రత్యేక ఆస్పత్రుల ను అవతరింపజేసి, ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది. కరోనా ఉధృతి రాకముందే హూబే ప్రావిన్స్‌లో రోజూ సుమారు 137 టన్నుల దాకా బయో వ్యర్ధాలను సేకరించి నిర్మూలన కేంద్రాలకు తరలించేవారు. వారాల వ్యవధిలో ఆ సామర్థ్యాన్ని 317 టన్నులకు విస్తరింపజేసి షియా వోగన్‌, ‌వాంగ్‌, ‌వుహాన్‌ ‌నగరాలకు సంచార వ్యర్థ నిర్మూలన కేంద్రాలని హుటాహుటిన తరలించి కరోనా కట్టడిలో సఫలీకృతమైంది.

అందుకు విరుద్ధంగా మనదేశంలో నాలాలు, మురుగు కాల్వలు, పట్టణ శివారులో ఆస్పత్రి వ్యర్థాలను కుమ్మరిస్తున్న పరిస్థితి ఉంది. ఆస్పత్రుల్లో వినియోగించిన సిరంజీలు, దూది, చేతి తొడుగులు, శస్త్రచికిత్సలో తొలగించిన శరీర భాగాలు మొదలైన వాటిని జనసంచార ప్రాంతాల్లో పారేయరాదన్న బయో మెడికల్‌ ‌వ్యర్థాల చట్ట నిబంధనల పట్ల ఉదాసీనంగా ఉన్న సంస్థలు కరోనా ఉదంతంతో నైనా కళ్ళు తెరవాల్సి ఉంటుంది. హానికర వ్యర్థాలను ఉంచిన సంచులపై తరచు హైడ్రోక్లోరైట్‌ ‌ద్రావణం పిచికారి చేస్తూ ఉండాలని, వాటిని తరలించే సిబ్బందికి ప్రత్యేక మాస్కులు, గౌన్లు, చేతి తొడుగులు, పాదరక్షలు సమకూర్చాలని నూతన నిబంధనలు సూచిస్తున్నాయి. ఆస్పత్రుల నుంచి తరలించిన జీవ వ్యర్థాలను పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హితకరంగా విచ్ఛిన్నం చేసే ఇన్స్పిరేషన్‌ ‌విభాగాల్ని అభివృద్ధి చేయడం తప్పనిసరి. గంటకు 1000 కిలోల వరకు జీవ వ్యర్థాలను 850-1100 సెంటిగ్రేడ్‌ ‌డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బూడిదగా మార్చే ఇన్‌ ‌సినీ రేట్ల నిర్మాణం ఖర్చు, శ్రమతో కూడిన ప్రక్రియ అయినా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరము. వంద పడకలు కలిగిన ఆసుపత్రులు విధిగా ప్రత్యేక మురుగునీటి శుద్ధి కేంద్రాలను(ఎస్‌టిపిలను) ఏర్పాటు చేసుకోవాలి. ప్రపంచంలోని ఆరోగ్యకర దేశాల జాబితాలో భారత్‌ 120‌వ స్థానంలో ఉన్నది. దేశంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కొరత చాలా ఉంది. వ్యక్తిగత రక్షణ సామాగ్రి రూపకల్పన, తయారీలకు భారత్‌ ‌డైనమిక్స్ ‌లిమిటెడ్‌, ‌రక్షణ పరిశోధన సంస్థలు ముందుకొచ్చాయి. వాటిని ప్రోత్సహించి చౌక ప్రత్యామ్నాయాలను ఆవిష్కరించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవినీతి, అలసత్వంతో కూడిన రాష్ట్ర స్థాయి కాలుష్య నియంత్రణ మండళ్లను క్రియాశీలం చేసి కరోనా నియంత్రణలో కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

challa prabhakar reddy
డా. చల్లా ప్రభాకర్‌ ‌రెడ్డి
ప్రభుత్వ జూనియర్‌ ‌లెక్చరర్ల సంఘం

 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!