Take a fresh look at your lifestyle.

నియంత్రణగా మారుతున్న నియంత్రిత ‘సాగు’

నియంత్రిత సాగు రైతన్నలకు లాభాలార్జించి పెడుతుందంటూ సంప్రదాయ సాగును నియంత్రిస్తున్న ప్రభుత్వం తన కొత్త విధానాన్ని సంపూర్ణంగా ఆచరణలు పెట్టే చర్యలు తీసుకోలేకపోతున్నది. ఆలోచన వొచ్చిందే తడవు అన్నట్లు ఈ వర్షాకాలంనుండే ఈ కొత్తవిధానాన్ని అమలు చేయాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేకపోతున్నట్లు స్పష్టమవుతున్నది. ఈ రంగాన్ని ఇంతకాలంగా వేదిస్తున్న అనేక సమస్యలు ఇంకా సమస్యలుగానే కొనసాగుతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు నియంత్రిత వొత్తిడి మరో భారంగా మారింది. ఏ ప్రాంతంలో ఏ పంట పండించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ ప్రాంత రైతులను పరిగణలోకి తీసుకోక పోవడం రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది. పైగా తాము చెప్పిన పంటనే వేయాలన్న నిర్బంధం . కాని పక్షంలో రైతు బంధు పథకం వారికి అమలుకాదని బెదిరింపొకటి. ఇప్పటికే మొక్కజొన్న రైతులు కోర్టు తలుపులు తట్టాల్సి వొచ్చింది. గత సీజన్‌లో రికార్డు స్థాయిలో మొక్కజొన్న దిగుబడులు రావడంవల్ల ఈ వర్షాకాలంలో మళ్ళీ అదే పంటవేసి నష్టాలు కొనితెచ్చుకోవద్దని ప్రభుత్వం చెబుతున్నది. ఈ పంట సాగుకు ప్రోత్సహించవద్దని అటు అధికారులకు, ఇందుకు సంబందించి విత్తనాలు విక్రయించవద్దని విత్తన వ్యాపారుల పైన ప్రభుత్వం వొత్తిడిచేస్తోంది. అయితే మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న తప్ప మరే ఇతర పంటలకు అనుకూలంకాదని, వర్షాలు తక్కువ పడినా తమకు పంట చేతికి వొస్తుందన్న నమ్మకముందంటున్నారు మొక్కజొన్న సాగు చేసే రైతులు. ప్రధానంగా భద్రాచలం, కొత్తగూడెం గిరిజన ప్రాంతాల రైతులు దీనిపై న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. మొక్కజొన్న పంట నిషేధితమైన పంటకాదని న్యాయస్థానం వ్యాఖ్యానించడంతో మరికొందరు రైతులుకూడా అదేబాట పట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే నియంత్రిత సాగుకు కావాల్సినన్ని విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచక పోవడంతో రైతులు ప్రైవేటు విత్తన వ్యాపారులపై ఆధారపడాల్సి వొస్తున్నది.

ప్రధాన పంటలైన వరి, పత్తి,కంది పంటలకు సంబందించిన విత్తనాలు లభించడంలేదని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ప్రభుత్వం చెబుతున్నట్లు రాష్ట్రంలో ఇరవై అయిదు లక్షల ఎకరాల్లో వరి సన్నరకాలను సాగుచేయాలంటే కనీసం 37లక్షల విత్తన బ్యాగులు కావాల్సి ఉండగా, ఇరవై లక్షల విత్తన బ్యాగులే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో సోయాసాగు 4.70 లక్షల ఎకరాల్లో వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు 2.5 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరంకాగా, ప్రభుత్వం కేవలం ఒకటిన్నర లక్షల క్వింటాళ్ళకు మాత్రమే అందించగలిగింది. దీంతో రైతులు ప్రైవేటు విత్తన కంపెనీలకు సంబందించిన విత్తనాలు కొనుగోలుచేయాల్సి వొచ్చింది. ఫలితంగా ఆ విత్తనాలు మొలకెత్తకపోవడంతో లబోదిబో మన్నారు. ఎకరాకు కనీసం అయిదువేల రూపాయల పెట్టుబడినికూడా వారు నష్టపోవాల్సి వొచ్చింది. అలాగే ఇతర పంటలకు సంబందించిన విత్తనాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం ప్రభుత్వం చెబుతున్న నియంత్రిత సాగుకు అడ్డంకిగా మారుతున్నది. ఒక పక్క విత్తనాలు, మరోపక్క ఎరువుల సబ్సీడీ, రుణాల మాఫీ సకాలంలో జరుగకపోవడంతో ధరలు పెరగడానికి, నకిలీలు మార్కెట్‌లోకి రావడానికి అవకాశంగా మారుతోంది. ఇటీవలనే నకిలీ విత్తన సరఫరా మూఠాను ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఏర్పడకుండా విక్రయదారుల దగ్గరకు నకిలీ విత్తనాలు, ఎరువులు చేరిపోయాయికూడా. ఈ విషయంలో రైతులు, రైతు సంఘాలు సంవత్సరాల తరబడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా, ప్రతీఏటా అవే అవే పునరావృతం అవుతున్నాయి. విత్తన బిల్లును చట్టంగా రూపొందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేయడం అనేక అనర్ధాలకు దారితీస్తుందంటున్నారు రైతు సంఘాలనాయకులు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వంకూడా విత్తన చట్టాన్ని రూపొందించేందుకు రైతు సంఘాలనుండి సూచనలను, సలహాలను కోరింది. కాని ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. దీన్ని చట్టంగా రూపొందించే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టమవుతుందంటున్నారు రైతు సంఘ నాయకులు. కాగా, రైతులకు ఇప్పటికీ ఫసల్‌ ‌బీమా అందలేదు. బ్యాంకులు కూడా కొత్త అప్పులను ఇవ్వడంలేదు. ఈ వర్షాకాలం సాగు విస్తీర్ణకూడా పెరుగుతున్నా బీమా పథకం అమలుపై రాష్ట్రంలో అనిశ్చిత కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంకూడా ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలు దాదాపు 1.25 కోట్ల ఎకరాలకు పైగానే సాగయ్యే అవకాశాలున్నాయి. వాతావరణంలో అనుకోని మార్పులు సంభవించి పంటకు నష్టంఏర్పడితే అప్పుడు పరిస్థితేమిటన్న ఆందోళనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడిపెట్టి పండించినా మార్కెట్‌ ‌దోపిడీ ఇంకా తగ్గేట్లులేదు. ఫలితంగా ప్రతీఏటా ఆత్మహత్యలు తప్పడంలేదు. అందుకు ప్రభుత్వ ఆర్డినెన్స్ ‌ద్వారా విత్తన చట్టాన్ని తీసుకొస్తే, రైతులకు ఇచ్చే రాయితీలు,ఇతర పథకాలకన్నా ఎక్కువ మేలు జరుగుతుందంటున్నాయి రైతు సంఘాలు.

Leave a Reply