Take a fresh look at your lifestyle.

కోవిషీల్డ్ ‌ధరలపై భగ్గుమన్న విపక్షాలు

  • వేర్వేరు ధరలు నిర్ణయించడంపై• మండిపాటు
  • మోడీ అనుచరులకు లభం చేకూర్చేందుకే అన్న రాహుల్‌
  • ‌టీకా పాలసీ నోట్ల రద్దులాంటిదే అని విమర్శ
  • టీకా పంపిణీ పారదర్శకంగా ఉండాలన్న ఏచూరి

కోవిషీల్డ్ ‌టీకా ధరలపై కాంగ్రెస్‌, ‌వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒక మోతాదు కోవిషీల్డ్ ‌టీకాను కేంద్ర ప్రభుత్వానికి రూ.150గానూ, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400గానూ నిర్ణయించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే ధరకు ఈ టీకాను అందజేయాలని డిమాండ్‌ ‌చేశాయి. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ ‌విశ్వవిద్యాలయం అభివృద్ధిపరచిన కోవిషీల్డ్ ‌టీకాను పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తున్నది. ఈ టీకా ధరలను బుధవారం ఈ సంస్థ ప్రకటించింది. ఒక మోతాదు కోవిషీల్డ్ ‌టీకా ధర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 అని, ప్రైవేటు హాస్పిటళ్లకు రూ.600 అని ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో మార్పులు ఉండబోవని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఒక మోతాదు కోవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ ‌రూ.150కి అందుతుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ట్విటర్‌ ‌వేదికగా స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్నేహితులకు ఇదొక గొప్ప అవకాశమని, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ‌ప్రకటనను ఆయన ఈ ట్వీట్‌కు జత చేశారు. టీకాల పంపిణీలో వివక్ష కనిపిస్తున్నదని దుయ్యబట్టారు. సీపీఎం జనరల్‌ ‌సెక్రటరీ సీతారాం ఏచూరి ఇచ్చిన ట్వీట్‌లో, టీకాలను పారదర్శక, న్యాయబద్ధమైన విధానంలో పంపిణీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. పీఎం-కేర్స్ ‌ఫండ్‌పై  ప్రశ్నలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం టీకాలను కొనాలని, వాటిని పారదర్శకంగా, ఉచితంగా రాష్ట్రాలకు అందజేయాలని కోరారు. పీఎం-కేర్స్ ‌నిధికి వొచ్చిన లక్షల కోట్ల రూపాయలను దీని కోసం ఖర్చు చేయాలన్నారు. 70 ఏళ్ళ నుంచి మన దేశంలో ఉచిత, సార్వజనీన వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం అమలవుతున్నదన్నారు.

దేశంలోని 18 ఏళ్లు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామని మంగళవారం దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అయితే ప్రధాని చేసిన ఈ వాగ్దానం నిజంగా పేదలకు ఉపయోగపడేది కాదని, ఇది పూర్తిగా కొద్ది మంది వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమేనని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా టీకా పాలసీ.. నోట్ల రద్దు లాంటి నిర్ణయానికి ఏమాత్రం తీసిపోదని, పెద్ద నోట్లు మార్చుకోవడానికి సాధారణ ప్రజలు లైన్లలో వేచి ఉన్నట్లే టీకా కోసం కూడా భారీగా లైన్లు ఉండబోతాయని రాహుల్‌ అన్నారు. బుధవారం ట్విట్టర్‌ ‌ద్వారా స్పందించిన రాహుల్‌ ‌గాంధీ.. ‘కేంద్ర ప్రభుత్వ టీకా పాలసీ మరో నోట్లరద్దుకు ఎంత మాత్రం తక్కువ కాదు, సాధారణ ప్రజలు లైన్లలోనే ఉండిపోతారు. డబ్బు, ఆరోగ్యం, ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వొస్తుంది. చివర్లో కొద్ది మంది వ్యాపారవేత్తలు మాత్రమే లాభపడతారు’ అని తన అధికారిక ట్విట్టర్‌ ‌ఖాతాలో స్పందించారు.

Leave a Reply