Take a fresh look at your lifestyle.

రైతు సంక్షేమానికి నిరంతర కృషి

  • వరం(రైతుల సహకార సంఘం) పరిధిలో కొనుగోలు కేంద్రాలు
  • సంఘం ప్రక్రియ ముందుకెళ్లేలా అన్ని విధాలా సహకారం: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

ప్రభుత్వం రైతు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. సోమవారం జిల్లాలోని మునిపల్లి, రాయికోడ్‌, ‌వట్‌ ‌పల్లి, అందొల్‌, ‌పులకల్‌, ‌చౌటకూర్‌ ‌మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాయికోడ్‌ ‌గ్రామంలో వరం (రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం) కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కాళేశ్వరం నీటిని అందోల్‌, ‌జహీరాబాద్‌ ‌నియోజకవర్గాలకు తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో వరం పరిధిలో కొన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. వరం ద్వారా అమ్మడమే కాకుండా, కొనుగోళ్లుజరగడం అభినందనీయమన్నారు. పెసలు, కందులు, శనగలు ,మినుములు లాంటివి నేరుగా అమ్మకుండా పప్పుగా మార్చాలని అందుకు అవసరమైన దాల్‌ ‌మిల్లును ఏర్పాటు చేసుకుని సమష్టిగా కష్టపడితే తక్కువ ధరకే వినియోగదారులకు పప్పులు అందించడంతోపాటు రైతులు లాభపడే అవకాశం ఉందన్నారు. వరంకు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

- Advertisement -

ఒక్కొక్క మెట్టుగా అభివృద్ధి పథంలోకి వెళ్లేలా రైతుల ఆలోచనలు ఉండాలన్నారు. ఆ దిశగా రైతులు ముందుకు కదలాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలో, వసతి గృహాలలో కొనుగోలు చేస్తున్న పప్పులు, కూరగాయలు, పండ్లు, తదితరాలను వరం నుండి కొనుగోలు చేసేలా చూస్తామనారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాకు వరం ఆదర్శంగా ఎదగాలని అన్నారు. వరం నిర్వహిస్తున్న ప్రక్రియ ముందుకు వెళ్లేలా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. రైతులు ఏర్పాటు చేసుకున్న వరంలో 1600.మంది రైతులు ఉన్నారని, రైతుల ప్రయోజనాలకు ఉపయుక్తమైన పనులు చేపట్టాలని, జిల్లాలో వరంతో రైతులందరూ సంఘటిత శక్తిగా మారాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్పర్సన్‌ ‌మంజు శ్రీ, ఎంఎల్‌సి ఫరీదొద్దీన్‌, ఎంఎల్‌ఏ ‌చంటి క్రాంతి కిరణ్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు, అదనపు కలెక్టర్లు రాకార్షి షా, వీరారెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు, సర్పంచులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply