- కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు నమోదు
- వ్యాధిబారిన పడి మరో 51మంది మృత్యువాత
తెలంగాణ రాష్ట్రంలో కొరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,361 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి మరో 51 మంది మరణించారు. కొత్తగా మహమ్మారి నుంచి 8,126 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒకే రోజు 77,345 టెస్టులు నిర్వహించగా.. 6,361 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,09,491 మంది కోలుకున్నారు. మరో 2,527 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,225, మేడ్చల్ జిల్లాలో 422, రంగారెడ్డి జిల్లాలో 423 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఇదిలావుంటు జంటనగరాల్లోని ఆలయాల్లో కోవిడ్ భయం వెంటాడుతోంది.
బల్కంపేట అమ్మవారి ఆలయంలో నలుగురికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఆలయ ఈవో అన్నపూర్ణతో పాటు మరో ముగ్గురు ప్రధాన పూజరులు కొరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ముఖ్యమైన సిబ్బంది మాత్రమే ఆలయ ప్రాంగణంలో ఉండేలా చర్యలు చేపట్టారు.ఆలయ సిబ్బంది వైరస్ బారిన పడటంతో ఈ నెల 14 వరకు ఆలయాన్ని మూసివేయా లని నిర్ణయించారు. 15న తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. కొరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శనాలు, సేవలు కూడానిలిపి వేస్తున్నట్టు పేర్కొన్నారు. నిత్య పూజలు అంతరాలయంలో జరుగుతాయని కేవలం పూజారులు మాత్రమే పాల్గొంటారన్నారు.