Take a fresh look at your lifestyle.

‘‌నా చివరి శ్వాస వరకూ నీళ్ల గోస కొరకు పోరాడుతూనే ఉంటా’

  • రైతు ఆత్మ గౌరవం పెరగాలి – ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణ కావాలి
  • ఇక నుంచి ప్రతి రైతూ వాణిజ్య పంటలపై దృష్టి సారించాలి
  • కాళేశ్వరం నీళ్లతో.. మిషన్‌ ‌కాకతీయ చెరువులు నింపాం
  • సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఏనాడు తెలంగాణను పట్టించుకోలేదు
  • నర్మెట్ట గద్దలాయ చెరువులో గంగమ్మకు జలహారతి పట్టిన మంత్రి హరీష్‌రావు

రైతు ఆత్మగౌరవం పెరగాలి. ఆత్మహత్యలు లేని ఆకు పచ్చ తెలంగాణ కావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గా, ఖాతా గ్రామాల్లో చెక్‌ ‌డ్యాముల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, అనంతరం నర్మెట్ట గ్రామంలోని గద్దలాయ చెరువు కాళేశ్వరం జలాలతో నిండి అలుగు పారుతున్న సందర్భంగా చెరువులో గంగమ్మ తల్లికి జలహారతి పట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ఒకనాడు రైతు అంటే ఆత్మహత్యలు, అప్పులు ,కన్నీళ్లు, చిన్నచూపు ఉండేదని అలాంటి పరిస్థితి తొలగించి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని ప్రతి గ్రామానికి తాగు, సాగునీరు అందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎం‌తగానో కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు కాల్వల ద్వారా కాళేశ్వరం నీళ్లు తెచ్చి కాకతీయ చెరువులు నింపామని చెప్పారు. ఇక నుంచి సాగు నీటి ద్వారా ప్రతి ఒక్కరికీ చేతినిండా పనులు ఉంటాయని తెలిపారు. ఆత్మహత్యలు లేని ఆకు పచ్చని తెలంగాణ కావాలన్నదే సిఎం కేసీఆర్‌ ‌ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతులకు ఆత్మ గౌరవం పెరగాలనీ, గోదావరి జలాలు పుష్కలంగా వచ్చాయన్నారు. ఇక నుంచి రైతులు మూడు పంటలు పండించినప్పుడే రైతు ఆత్మగౌరవం ఆకాశమంత ఎత్తుగా ఉంటుందన్నారు.

కాళేశ్వరం నీళ్లతో మిషన్‌ ‌కాకతీయ చెరువులు నింపామన్నారు. రైతులకు రుణమాఫీ విడుదల వంటి అనేక కార్యక్రమాలతో రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని మంత్రి తెలిపారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నదని పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు కాళేశ్వరం నీళ్లు తెచ్చి నర్మెట్ట శివాలయంలో అభిషేకం చేస్తాననీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేశామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందనీ, నా చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల నీళ్లగోస కోసం పోరాడుతూనే ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. ఎంతగా కొట్లాడిన అప్పట్లో అరణ్య రోదనగానే మిగిలిపోయిందనీ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్నీ గ్రామాల అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, గ్రామ సర్పంచ్‌ అజీద్‌, ‌స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

భూగర్భ జలాల పెంపు కోసమే.. చెక్‌ ‌డ్యాముల నిర్మాణం:
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం దర్గా గ్రామంలోని సిద్ధిపేట వాగుపై రూ.2.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న చెక్‌ ‌డ్యాము నిర్మాణాని•తీ శంకుస్థాపనతో పాటుగా మండలంలోని ఖాతా గ్రామంలోని పెద్ద వాగుపై రూ.9.35 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రెండు చెక్‌ ‌డ్యాములకు జెడ్పీ చైర్మన్‌ ‌వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖాతాలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… నంగునూరు మండలంలో కొత్తగా 3 చెక్‌ ‌డ్యాముల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనీ, నంగునూరు మండలంలో కిలో మీటరుకు ఒక్క షేక్‌ ‌హ్యాండ్‌ ‌చెక్‌ ‌డ్యాముల చొప్పున నంగునూరు పెద్ద వాగుపై ఇప్పటికే 7 చెక్‌ ‌డ్యాములు పూర్తి చేసుకున్నామన్నారు. తాజాగా మరో రెండు చెక్‌ ‌డ్యాములను కలుపుకుని 9 చెక్‌ ‌డ్యాములు నిర్మాణం పూర్తవుతాయన్నారు. కాళేశ్వరం జలాలు ప్రతి చుక్కా చెక్‌ ‌డ్యాములు తాకేలా పెద్ద వాగుపై 365 రోజులు చెక్‌ ‌డ్యాముల్లో మత్తడి దూకేలా ఏర్పాట్లు పూర్తి చేశామనీ, నంగునూరు మండలంలో కరువు అనే పదానికి డిక్షనరీలో అర్థం వెతకొద్దు. కాలం కోసం ఎదురుచూపులు చూసే పరిస్థితి ఉండదనీ, పెద్ద వాగుపై నీళ్ల ప్రవాహం.. నిండు గర్భిణీలా, నిండు కుండలా.. ఉంటుందన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూనే ప్రభుత్వం వాటి అమలుకు చర్యలు చేపట్టిందనీ, రానున్న రోజుల్లో నంగునూరు మండలంలో జల కళ సంతరించుకుంటుందనీ, ఇప్పటికే నంగునూరు మండలానికి కాలేశ్వరం ద్వారా సాగునీరు తెచ్చి చెరువులు నింపామన్నారు. ఇక నుంచి ఈ రైతులు మూడు పంటలు వేసుకోవచ్చనీ, భూగర్భ జలాల పెంపు కోసమే చెక్‌ ‌డ్యాముల నిర్మాణాలనీ మంత్రి హరీష్‌రావు అన్నారు.

Leave a Reply