Take a fresh look at your lifestyle.

తెలంగాణలో.. 7 ఏళ్లలో 31.43 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం..!

కేంద్రం 2500 కోట్ల కేటాయింపు కేంద్ర మంత్రి వెల్లడి
కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధాని ఫొటో పెట్టకపోవడం సిగ్గు చేటన్న ఎంపీ బండి సంజయ్‌
‌గార్ల రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు మెరుగుపర్చండి : రైల్వే శాఖ మంత్రికి ఎంపీ బండి సంజయ్‌ ‌లేఖ
స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌-‌గ్రామీణ పథకం కింద గత ఏడేళ్లలో తెలంగాణలో 31,43,393 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ ‌సింగ్‌ ‌పటేల్‌ ‌తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రానికి 2500.79 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 1533.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌-‌గ్రామీణ్‌ ‌పథకంలో భాగంగా ప్రతి ఏటా ఆయా రాష్ట్రాలు సమర్పించే వార్షిక ప్రణాళిక ఆధారంగా కేంద్ర మార్గదర్శకాల మేరకు నిధుల కేటాయింపు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 2014-15 నుండి 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులు, జిల్లాల వారీగా పూర్తయిన మరుగుదొడ్ల నిర్మాణాల వివరాలను వెల్లడించారు. కరీంనగర్‌ ‌జిల్లాలో 1,41,502, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 41,839 మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు.

అలాగే ప్రధాన మంత్రి స్ట్రీట్‌ ‌వెండర్స్ ఆత్మ నిర్భర్‌ ‌నిధి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వీధి వ్యాపారుల నుండి 4.6 లక్షల మంది దరఖాస్తులు రాగా….వాటిలో 3.5 లక్షల మందికి రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌషల్‌ ‌కిషోర్‌ ‌తెలిపారు. అందులో 3.17 లక్షల మంది లబ్దిదారులకు రుణాల పేరిట 313 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కోవిడ్‌ ‌మహమ్మారి నేపథ్యంలో వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్‌ ‌నుండి ప్రధాన మంత్రి స్ట్రీట్‌ ‌వెండర్స్ ఆత్మ నిర్భర్‌ ‌నిధి పథకం అమలు అవుతున్నదని మంత్రి తెలిపారు. కోవిడ్‌ -19 ‌సమయంలో వీధి వ్యాపారులు స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పథకం కింద 42,92,601 మంది వీధి వ్యాపారులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా….25,04,654 మందికి రుణాలు మంజూరయ్యాయని, అందుకోసం 2,224 కోట్లు బ్యాంకుల ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద 2020-11 ఆర్థిక సంవత్సరంలో 3,04,924 మంది లబ్ది పొందినట్లు తెలిపారు. ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,840 మంది లబ్దిదారులు రుణాలు పొందినట్లు వివరించారు. ఆంధప్రదేశ్‌లో 2,77,586 మంది వీధి వ్యాపారులు దరఖాస్తు చేసుకోగా, 1,84,895 మందికి రుణాలు మంజూరయ్యాయన్నారు. అందుకోసం 158.61 కోట్ల నిధులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ప్రధాని ఫొటో పెట్టకపోవడం సిగ్గు చేటన్న ఎంపీ బండి సంజయ్‌
‌కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందనడానికి ఈ వివరాలే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్‌ ఎం‌పీ బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రాయోజిత పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలు పెట్టకుండా కేవలం కేసీఆర్‌ ‌ఫొటోలను మాత్రమే పెడుతుండటం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా కేంద్ర నిధులతో తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే పథకాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ప్రధానమంత్రి మోదీ ఫొటోలను ప్రదర్శించాలని బండి సంజయ్‌ ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

గార్ల రైల్వే స్టేషన్‌లో సౌకర్యాలు మెరుగుపర్చండి : రైల్వే శాఖ మంత్రికి ఎంపీ బండి సంజయ్‌ ‌లేఖ
మహబూబాబాద్‌ ‌జిల్లా గార్ల రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపర్చడంతో పాటు ముఖ్యమైన రైళ్లు ఆ స్టేషన్‌లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్‌ ‌బండి సంజయ్‌ ‌రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. గార్ల రైల్వే స్టేషన్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉందని, జనరల్‌ ‌టిక్కెట్ల అమ్మకం ద్వారా ఏటా 1.5 కోట్ల ఆదాయం వస్తుందని లేఖలో తెలిపారు. ఇక్కడి నుండి పెద్ద ఎత్తున వ్యాపారులు మహబూబాబాద్‌, ‌ఖమ్మం, రామగుండం ప్రాంతాలతోపాటు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతితోపాటు మహారాష్ట్ర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గార్ల రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరారు. ఈ స్టేషన్‌లో ప్లాట్‌ ‌ఫాం-1కు, రైలుకు మధ్య అంతరం ఉండటంతో గతంలో ప్రయాణీకులు మరణించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాట్‌ఫాం నెం .1కు, రైలుకు మధ్య అంతరాన్ని సరిదిద్దాలని కోరారు. అట్లాగే డోర్నకల్‌ ‌నుండి గార్లా మధ్య లెవల్‌ ‌క్రాసింగ్‌ ‌తొలగించడంతోపాటు అక్కడ ఫ్లై ఓవర్‌ ‌నిర్మాణం చేపట్టాలని, రామాపురం, మద్దివంచ గ్రామాల నివాసితుల ప్రయోజనాల కోసం పకాల ఎరు వద్ద మరొక వైపు లెవల్‌ ‌క్రాసింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

Leave a Reply