Take a fresh look at your lifestyle.

రాజ్యాంగమా… రాజదండమా…?

‘‘‌మిమ్ములను అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన రాజ్యాంగాన్ని వదిలిపెట్టి రాజదండానికి పూజలు చేయడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనం..?  రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌కి నమస్కరించకుండా సాధువులకు పెద్దపీట వేయడం ప్రజాస్వామ్య సంస్కారమా.!’’

ప్రపంచంలోనే భిన్న మతాలకు భిన్న కులాలకు నిలయమై భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడానికి ప్రజాస్వామ్య వ్యవస్థ గా రూపుదిద్దుకోవడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి అనేక మంది స్వాతంత్రోద్యమ నాయకులు,మేధావులు,విద్యావంతులు భారతదేశ పరిస్థితులకు అనుగుణమైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో వారు పోషించిన పాత్ర వెలకట్టలేనిది. ఈ రాజ్యాంగం భారత ప్రజలమైన మేము..మాకు మోము ఆమోదించుకుంటున్నామని ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని అమలులోకి తెచ్చుకోవడం జరిగింది. ఇంతటి మహోన్నతమైన రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి 2014 వరకు అనేక ఒడిదుడుకుల మధ్య అమలవుతూనే వచ్చింది. కానీ 2014లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సంఘపరివారు నిర్దేశకత్వంలో అధికారంలోకి వచ్చిన భాజాపా భారత రాజ్యాంగ ప్రభావాన్ని అంచలంచెలుగా తగ్గించుకుంటూ వచ్చింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడ్డ కాడి నుండి కూడా భారత రాజ్యాంగం పైన గాని రాజ్యాంగ నియమ నిబంధనల పైన గాని దానికి విశ్వాసం లేదు. అది రూపొందించుకున్న నియమ నిబంధనావళీ నే అనుసరిస్తుందే  తప్ప భారత రాజ్యాంగానికి లోబడి నడుచుకున్న దాఖలాలు లేవు ఇది అక్షరాల సత్యం. ఈ సంఘ్‌ ‌పరివార్‌ ‌శక్తులు భారతదేశాన్ని మతోన్మాద దేశంగా రూపొందించడానికి అవి చేయని కుటిల ప్రయత్నాలంటూ లేవు.కాల పరీక్షకు తట్టుకుని నిలబడింది  భారత రాజ్యాంగం.అంబేడ్కర్‌  ఆలోచనల కల ఈ దేశంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ తో కూడిన జీవితం, సమానత్వం తో కూడిన సామాజిక హోదా, కల్పించడమే రాజ్యాంగం  లక్ష్యం..
భారతదేశాన్ని ప్రజాస్వామికరించేందుకు రాజ్యాంగం దోహదపడింది.ఆది నుండి రాజ్యాంగం లో పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛ పై పరిమితులు విధించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బిజేపిని ఒక వాహాకంగా వాడుతుంది.ఆరెస్సెస్‌ ‌కలల హిందూ రాజ్యం  రాజ్యాంగం మనుస్మృతి ని ప్రకటించి తన తాను ముక్క అయిన… బిజేపి ద్వారా కార్యాచరణ ను ప్రారంభించింది.ఈ దేశంలో దళితులు ఆదివాసీలు, వెనుక బడిన వర్గాల వారికి కల్పించబడిన ప్రత్యేక అవకాశాలపై (రిజర్వేషన్లు)పై ఎప్పటికప్పుడు విషం వెదజల్లుతోంది.పారదర్శకతతో, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందించే క్రమంలో గత పాలకుల దార్శనికత, నైతికత తో కూడిన అనే సాత్వికతతో కూడిన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక రాజ్యాంగ బద్ధ సంస్థల ను బిజేపి జేబు సంస్థలుగా  మార్చడంలోను కీలక పాత్ర పోషించింది.

రాజ్యాంగ జీవన సూత్రాలైన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వ భావనలకు చరమ గీతం పాడుతూ నియంతృత్వానికి పట్టం కడుతున్నారు.ఈ దేశ ప్రజల సజీవ ఆకాంక్షల ప్రతి రూపం రాజ్యాంగం ఎప్పటికీ హిందూత్వకు ప్రతి బంధకమని అవకాశం వచ్చినప్పుడల్లా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రతినిధులు వక్ర భాష్యం చేస్తున్నారు.మనుధర్మమే మాకు అత్యున్నత చట్టం అని దాని సారమే ఈ దేశ ప్రజల జీవన తాత్త్వికత అని అనైతిక ప్రభోధాలతో దేశ ప్రజల మధ్య విద్వేషాలతో నింపుతున్నారు. కానీ నేడు అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు చాలా విస్తృతంగా అధ్యయనం చేయాలి.దాదాపు వంద సంవత్సరాల ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రయాణం లో భారతదేశ  సాంస్కృతిక మూలాల్లోకి జొరపడి వైవిధ్యత కలిగిన ప్రజలపై భిన్నమైన భావజాలలతో వారి మెదళ్ల లో విద్వేషాలు నింపారు.సకల జనుల ఆలోచనల ప్రతిబింబం, భిన్నమైన గొంతుకులకు చట్టాల రూపం ఇచ్చిన పార్లమెంటు స్థానంలో నేడు నిర్మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కలల సౌధం న్యూ సెంట్రల్‌ ‌విస్టా ఆవిష్కరణ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా రాజ్‌ ‌పేరు మీద పూర్తిగా సాధువులే ప్రతినిధులుగా హాజరై ప్రారంభించారు.

వీడోలకు కూడా అత్యున్నత పదవులను ఇచ్చి గౌరవించిన రాజ్యాంగం, మహిళలకు హక్కులు హిందూ కోడ్‌ ‌బిల్లు రూపంలో బాబా సాహెబ్‌  అం‌బేడ్కర్‌ ‌రూపొందిస్తే నాటి నుండి నేటి  వరకు బిజేపి  మహిళల ఎదుగుదల వారికి కంటగింపుగా మారింది.వారిపై అఘాయిత్యాలు, దౌర్జన్యం, పితృ స్వామిక ఆధిపత్య ధోరణులను అనుసరిస్తూ బాధ్యత బంధనం లో వారిని బంధిస్తున్నారు.ఆలోచనల పరులకు, పోరాట స్ఫూర్తి కలిగిన నాయకత్వానికి వేదికలుగా నాటి  పార్లమెంట్‌ ఉం‌టే  నేడు సెంట్రల్‌ ‌విస్టా మతాధికారులు,సన్యాసులకు వేదికగా ఉంది.సెంగోల్‌ అనే రాజదండం చుట్టూ చర్చను కొనసాగించి అసలు న్యూ సెంట్రల్‌ ‌విస్టా ని పరిచయం చేస్తూ ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళారు.ప్రజాప్రతినిధుల సంఖ్య పేరుతో సెంట్రల్‌ ‌విస్టా నిర్మాణం చేపట్టడం స్వాతంత్య్ర కాలం నాటి ఆకాంక్ష లకు అవరోధం కలిగించినట్లే.ఒక రకంగా అందులో ప్రజా ప్రతినిధులుగా కార్పోరేట్‌ ‌కబంధ హస్తాలలో ఉన్న వారు మాత్రమే ఉంటారనేది వాస్యవం.అందులో పూర్తిగా కార్పోరేట్‌ అభివృద్ధి నమూనా ఉన్నది.

రాజ్యాంగానికి బదులు రాజదండమే ప్రజలకు శిలా శాసనం అని ప్రకటించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఈ దేశ ప్రధానమంత్రి రాజ్యాంగానికి లోబడి నేర్చుకోవాలి కదా.!మిమ్ములను అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన రాజ్యాంగాన్ని వదిలిపెట్టి రాజదండానికి పూజలు చేయడం ఏ ప్రజాస్వామ్యానికి నిదర్శనం..?  రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ ‌కి నమస్కరించకుండా సాధువులకు పెద్దపీట వేయడం ప్రజాస్వామ్య సంస్కారమా.! మీరు లౌకిక విలువలను గౌరవించాలనుకుంటే దేశంలో  సర్వ మతాలకు సంబంధించిన పెద్దలను పిలిచి పార్లమెంటు ప్రారంభించాలి .! అలా కాకుండా  సన్యాసులతో బాజాభజింత్రలతో అంగరంగ వైభవంగా పార్లమెంటును ప్రారంభించడం లౌకిక రాజ్య భావాలకు విరుద్ధం కాదా.! ఇది  వారు కోరుకుంటున్న హిందూ మతోన్మాదాన్ని ప్రేరేపించే విధానం కాదా.!
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply