Take a fresh look at your lifestyle.

ప్రజల క్షేమమే రాజ్యాంగ లక్ష్యం

‌ప్రజాస్వామ్య ప్రక్రియ పరిహాస ప్రాయంగా మారుతున్నది.ఎన్నికల్లో అంగబలం, అర్ధబలంతో పాటు మద్యం ఏరులై ప్రవహించడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. ధన ప్రభావం వలన ఎంతో మంది అర్హులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అశక్తులుగా మిగిలిపోతున్నారు. కుల, మత, ప్రాంతాలు, భాషా విబేధాలు వోటర్లను శాసిస్తున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి.

నేడు భారత రాజ్యాంగ దినోత్సవం

నవంబర్‌ 26 ఒక చారిత్రక దినం. ఈ రోజు  భారత రాజ్యాంగం స్ఫురణకు రావాలి. దురదృష్ట వశాత్తు చాలా మందికి గణతంత్ర దినోత్సవమే తప్ప  భారత రాజ్యాంగ దినోత్సవం గురించి తెలియదు. 2015 నవంబర్‌ 19 ‌వ తేదీన వెలువడిన గెజిట్‌ ‌నోటిఫికేషన్‌ ‌ద్వారా భారత ప్రభుత్వం నవంబర్‌ 26 ‌వ తేదీని రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించింది. రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ రచన కోసం పడిన శ్రమను విస్మరిస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలిస్తున్నాం. ఇది అత్యంత బాధాకరం. అయితే రాజ్యాంగ పరిరక్షణ  ప్రతీ ఒక్కరి  భుజస్కంధాలపై ఉంది. విభిన్న  కులాలు, మతాలు, ప్రాంతాలు, సంస్కృతులు, భాషలతో విరాజిల్లుతున్న భారత దేశాన్ని పాలించడం సులభమైన విషయం కాదు. జనాభా పరంగా ప్రపంచంలో రెండవ స్థానంలో ఉండి, ఎన్నో రకాల వైరుధ్యాలు అగుపించే  సువి శాలమైన భారత దేశాన్ని సమైక్యంగా ఉంచుతూ, దేశ సార్వ భౌమత్వాన్ని కాపాడేం దుకు ఒక పటిష్ఠమైన యం త్రాంగాన్ని నెలకొల్పాలనే సంకల్పంతో భారత రాజ్యాంగ పరిషత్‌ ఏర్పడింది.

రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం భారతదే శానికొక పటిష్ఠమైన రాజ్యాం గాన్ని రూపొందించడం. రాజ్యాంగ  పరిషత్‌ ఏర్పాటు చేయలనే డిమాండ్‌ ‌స్వాతంత్య్రానికి పూర్వం నుంచే పురుడు పోసుకుంది.’’పూర్ణ స్వరాజ్య్’’ ‌ప్రకటనకు ముందే భారత దేశానికి ఒక పటిష్ఠమైన రాజ్యాంగం అవసరమని ఎంతో మంది మేథావులు సూచించారు. దాని ఫలితం గానే 1946 డిసెంబర్‌ 6 ‌వ తేదీన రాజ్యాంగ సభ ఏర్పడింది. రాజ్యాంగ రచనకోసం ఎంతో మంది అవిశ్రాంతంగా కృషిచేశారు. వీరిలో అంబేడ్కర్‌ అ‌గ్రగణ్యుడు. అంబేడ్కర్‌ ఆలోచనలే రాజ్యాంగ రూపకల్పనలో ప్రముఖ పాత్రపోషించా యనడంలో అతిశయోక్తి లేదు. బ్రిటన్‌, అమెరికా, రష్యా, కెనడా, ఐర్లాండ్‌, ‌జర్మనీ లాంటి సుమారు 60  దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, తీవ్రకసరత్తు జరిపిన రాజ్యాంగ పరిషత్‌ ఆయా దేశాల రాజ్యాంగాలలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.సుమారు 3 సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితంగా ఎట్టకేలకు భారతదేశానికొక పటిష్ఠమైన రాజ్యాంగం రూపొందించడం జరిగింది.

మనది అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర  దేశంగా అవతరించిన భారత రాజ్యాంగంలో  కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ భారత దేశాన్ని ముందుకు నడిపించడానికి ఏర్పాటు చేయబడ్డ పటిష్ఠమైన  యంత్రాంగాలు. ఇందులో ఏ వ్యవస్థ పనిచేయక పోయినా ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యమనుగడే ప్రశ్నార్థకమౌతుంది. భారత ప్రజాస్వామ్య మనుగడకు ఈ మూడు వ్యవస్థలు మూడు స్థంబాల వంటివి. ‘మీడియా’ నాలుగో స్థంబం లాంటిది.

భారత పౌరులకు ప్రాథమిక హక్కులతో పాటు,ప్రాథమిక బాధ్యతలు కూడా ఇవ్వబడ్డాయి.భారతదేశంలోని పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉండదు. సమానత్వం, స్వేచ్ఛ, స్వాతం త్య్రం, మత స్వేచ్ఛ, దోపిడీ కి వ్యతిరేకమైన హక్కులు, విద్యా, సాంస్కృతిక హక్కు, రాజ్యాంగపరమైన పరిహారపు హక్కులతో పాటు, ప్రాథమిక విధులు కూడా పౌరులకు ఇవ్వబడ్డాయి. భారత దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు, సమైక్యతకు పాటుపడాలని, దేశ భద్రత విషయంలో ప్రతీ ఒక్కరూ తమ వంతు బాధ్యతను విస్మరించరాదని, శాంతి, సామరస్యాలను కాపాడుతూ, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని, భారత దేశానికి సిరిసంపదలైన నదులు, సరస్సులను కాపాడుతూ, వన్యప్రాణి సంరక్షణకు కృషిచేయాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి కర్తవ్యమని రాజ్యాంగం నిర్ధేశించింది. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడమంటే దేశాన్ని గౌరవించడమే నన్న భావన ప్రతీ పౌరుని ప్రాథమిక విధి.

మన రాజ్యాంగం ప్రతీ విష యంలో దేశక్షేమాన్ని, ప్రజల బాగోగులను దృష్టియం దుంచుకుని అనేక మైన నియమ నిబంధనలు రూపొం దించింది. అయితే ఎంత పక డ్బందీగా రాజ్యాంగ రూ పకల్పన జరిగినా రాజ్యాంగాన్ని అమలు పరచడంలో విఫలమైతే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. రాజమార్గం ఒకటే అయినా, దొడ్డిదారులు అనేకం ఉంటాయి. అడ్డదారిలో రాజ్యాంగాన్ని నిట్టనిలువునా వంచించే వ్యూహాలను నిలువరించాలి.రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినేలా జరిగే వ్యూహరచనలకు స్వస్తి చెప్పాలి.

ఇప్పటికే మన రాజ్యాంగానికి ఎన్నో సవరణలు జరిగాయి. కాలానుగుణంగా సవరణలు తప్పని సరి.అయితే రాజకీయ కారణాలతో రాజ్యాంగమౌలిక సూత్రాలకు విఘాతం కలిగించడం తగదు. ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల పాత్ర, శాసన వ్యవస్థలో స్పీకర్ల పాత్ర వివాదాస్పదమౌతున్పది. న్యాయ స్థానాలు జోక్యం చేసుకుని ఎన్నో సార్లు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కాపాడిన విషయం విదితమే. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు సజావుగా ఉండకపోవడం వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటున్నది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియ పరిహాస ప్రాయంగా మారుతున్నది.ఎన్నికల్లో అంగబలం, అర్ధబలంతో పాటు మద్యం ఏరులై ప్రవహించడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. ధన ప్రభావం వలన ఎంతో మంది అర్హులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అశక్తులుగా మిగిలిపోతున్నారు. కుల, మత, ప్రాంతాలు, భాషా విబేధాలు వోటర్లను శాసిస్తున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితులకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయాలి. ఎన్నికల సంఘం ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలకు అడ్డుకట్టవేయాలి. టి.ఎన్‌.‌శేషన్‌ ‌లా  ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షించబడుతుంది. ప్రజాస్వామ్యం పరిహాసప్రాయం గా మారితే ఆ  తప్పు రాజ్యాంగానిదా? ప్రజలదా? పాలకు లదా?  ఎవరిది? రాజ్యాంగం వలన ఏర్పడిన  వ్యవస్థలు విధ్వంసమైతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. ప్రజాస్వామ్యం లో ప్రజలే  ప్రభువులు. ప్రజల నిర్ణయమే శిరోధార్యం.

– సుంకవల్లి సత్తిరాజు.
మొబైల్‌: 9704903463.

Leave a Reply