- నన్ను హత్య చేయించేందుకు కుట్రలు
- నయీమ్కే బయపడని ఉద్యమనేతను
- పాదయాత్రకు ముందే అనుమతి కోరినా అడ్డంకులు
- మిడియా సమావేశంలో ఈటల రాజేందర్ మండిపాటు
టీఆర్ఎస్ ప్రభుత్వం గుండాగిరి చేస్తుందని మాజీమంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి ఈటల తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి హనుమాన్ ఆలయంలో ఈటల దంపతులు పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రజాకార్లను తలపిస్తున్నారని ఈటల విమర్శించారు. తాను నరహంతక నయూమ్కే భయపడలేదన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన సోమవారం నుంచి ‘ప్రజా జీవన యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్బంగా శనిగరంలో ఏర్పాటు చేసిన సభలో ఈటల మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్లకు సీఎం వెలకట్టారని, ఈ విషయం తనకు తెలుసునని అన్నారు. తనను చంపడానికి జిల్లా మంత్రి కుట్రలు చేస్తున్నారన్నారు. హంతక ముఠాలతో చేతులు కలిపినట్లు తనకు సమాచారం వొచ్చిందన్నారు. ‘అరె కొడుకుల్లారా ఖబర్దార్..? నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు.. మి చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను… ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని, ఈటల మల్లయ్య కొడుకును..ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఎం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది..
2018లో నన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా.. నా ప్రజలు అండగా నిలిచారు.. ఇప్పుడు నిలుస్తారు.. చట్టం మిద నాకు విశ్వాసం ఉంది.. పోలీసులూ సహకరించండి’ అంటూ ఈటల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ‘ఈ పాదయాత్ర పది రోజుల క్రితమే ప్రకటించాం. మా పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే. కానీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఓ రైస్ మిల్లును కార్యకర్తల భోజనాల కోసం మాట్లాడుకుంటే.. మిల్లు యజమానిని బెదిరించారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ నాయకత్వంలో ఇలాంటి చిల్లర పనులు జరుగుతున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే మికు గుణపాఠం తప్పదు. మేం ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదు. ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నాం. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుంది’ అన్నారు. హుజురాబాద్లో ప్రచారం చేస్తున్న ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలకు దమ్ముంటే ముందు మి దగ్గర పథకాలు అమలు చేయాలి.
తెలంగాణకు విముక్తి కావాలంటే తొలి అడుగు ఇక్కడినుంచే పడాలని ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ మాకు అడ్డంకులు సృష్టించాలని, నీచపు పనులు చేయాలని చూస్తే ఖబర్దార్. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం సరికాదు. చిల్లర వేషాలు వేసేవారిని వదిలిపెట్టమన్నారు. నా పాదయాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీల విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారు. ఈ పాదయాత్ర 25 నుంచి 26 రోజుల పాటు ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతోంది. ప్రజలందరూ నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరుతున్నానని ఈటల రాజేందర్ అన్నారు. పాదయాత్రంలో భాగంగా శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాముల పేట, అంబలలో పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనవెంట ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడగె శోభ, పార్టీ నేత వివేక వెంకట స్వామి పాల్గొన్నారు.