Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌లో పరిణామాలు బలానికా, బలహీనానికా

కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని ఎటువైపుకు తీసుకుపోనున్నాయో అర్థం కాకుండా పోతున్నది. గత ఏడెనిమిది సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో అధికారానికి దూరమవడమే కాకుండా, ఆ పార్టీ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ వొస్తున్నది. నూటా ముప్పై అయిదేళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పార్టీ పరిస్థితి పోనుపోను దిగజారిపోతున్నది. 2024 పార్లమెంట్‌ ఎన్నికల నాటికి పుంజుకోకపోతే ప్రజలు కాంగ్రెస్‌ను మరిచిపోయే ప్రమాదం ఏర్పడుతుందంటున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఆ పార్టీ అధిష్టానవర్గం ఇప్పటినుండే చర్యలు చేపడుతుందనిపిస్తుంది. ముఖ్యంగా ఆ పార్టీలో వృద్ధ నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండి, యువకులకు అవకాశాలు లేకపోవడంవల్లే పార్టీ దెబ్బతింటున్నదన్న విషయాన్ని చాలా కాలంగా రాహుల్‌ ‌గాంధీ చెబుతున్నప్పటికీ ఆయన మాట పార్టీలో పెద్దగా చలామణి కావడం లేదనడానికి జ్యోతిరాదిత్య లాంటి రాహుల్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న యువ నాయకులు పార్టీ వీడి పోవడమే. గోవా, అస్సాం, ఎంపి, యుపిల్లోని యువనాయకులు ఒక్కరొక్కరుగా పార్టీని వదిలిపెడుతున్నారు. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి అయిన కపిల్‌ ‌సిబాల్‌ అన్న మాటల్లో ఎంతో ఆవేదన కనిపిస్తున్నది.

చాలా కాలంగా పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేసుకోకపోవడం విపరీత పరిణామాలకు దారితీస్తున్నదంటూ ఆయన మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసుకున్న విషయం తెలిసిందే. పార్టీలో చెలరేగుతున్న వివిధ సమస్యలపై సమర్థవంతమైన, అధికారయుత నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు లేకపోవడం వల్ల పార్టీ ఇబ్బందులను ఎదుర్కుంటున్నదంటూ, తాజాగా పంజాబ్‌ ‌సంఘటనను ఆయన ఉదహరించారు. పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలు పార్టీ శ్రేయస్సుకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయి. అక్కడి పార్టీ అంతర్ఘత విభేదాల కారణంగా పంజాబ్‌ ‌కూడా కాంగ్రెస్‌ ‌చెయ్యి దాటిపోతుందేమోనంటూ ఆయన ఆవేదన చెందుతున్నారు. అయితే ఆయన మాటల వెనుకున్న ఆర్ధ్రతను అర్థం చేసుకోకుండా ఆ పార్టీవారే ఆయన ఇంటిపై దాడిచేసేందుకు సిద్ధమవడం చూస్తుంటే కాంగ్రెస్‌ ‌పార్టీకి జాతీయ నాయకత్వం లోపం స్పష్టమవుతుంది. అయితే ఇటీవల కన్హయ్య కుమార్‌, ‌జిగ్నేశ్‌ ‌మేవాని లాంటి వారిని పార్టీలోకి తీసుకోవడం మాత్రం ఆ పార్టీకి నూతన జవసత్వాలు ఒనగూరుతున్నాయనుకోవచ్చు. రాహుల్‌గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరిన కన్హయ్య కుమార్‌ ‌లాంటి వారి అవసరం ఇప్పుడు కాంగ్రెస్‌కు ఎంతో ఉంది. తెలంగాణలో కూడా ఇటీవల రేవంత్‌రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఒక విధంగా కార్యకర్తల్లో, నాయకుల్లో నూతనోత్తేజం వొచ్చిందన్న అభిప్రాయముంది. అలాగే కన్హయ్య కుమార్‌గాని, జిగ్నేశ్‌ ‌మేవానిగాని రేవంత్‌రెడ్డి లాగానే బలవంతమైన వాగ్ధాటి ఉన్న నాయకులు. అలాంటివారి కొరత కారణంగానే కాంగ్రెస్‌ ఉద్యమాలు, కార్యక్రమాలు చప్పగా సాగుతున్నాయన్న అభిప్రాయముంది.

congress party

యువ నాయకత్వంతో పాటుగా దళిత, గిరిజన నాయకులపైన ఇప్పుడు కాంగ్రెస్‌ ‌దృష్టిసారించినట్లు కనిపిస్తున్నది. జిగ్నేశ్‌ ‌మేవాని గుజరాత్‌లోని వడ్గం నియోజకవర్గానికి చెందిన ఎంఎల్‌ఏ. ‌రాష్ట్రీయ దళిత అధికార మంచ్‌(ఆర్‌డిఏఎమ్‌)‌కు చెందినవాడు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌మద్దతుతో అక్కడ విజయం సాధించాడు. గుజరాత్‌లో బిజెపికి దూరమవుతున్న దళితులను దగ్గర చేసుకుంటూ రాజకీయంగా ఎదిగిన వాడు. ఒక విధంగా గుజరాత్‌లో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దళితుల వోట్లు 53 శాతం లభ్యమవడం వెనుక ఆయన కృషి ఉందంటారు. అలాగే కన్హయ్య కుమార్‌ ‌బీహార్‌లోని బెగునరాయ్‌కు చెందిన సిపిఐ నేతల కుటుంబం నుంచి వొచ్చిన వ్యక్తి. పౌరసత్వం సవరణ చట్టంపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఆయన దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జవహర్‌లాల్‌ ‌నెహ్రూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి సంఘ నాయకుడు. ఆయన పార్టీలో చేరుతూనే ఆ పార్టీ పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించాడు. కాంగ్రెస్‌ ‌పార్టీ దేశంలోనే గొప్ప ప్రజాస్వామ్య పార్టీ అని, కాంగ్రెస్‌ ‌లేకుండా దేశంలో పరిపాలన సరిగా సాగదని పెద్ద కితాబే ఇచ్చాడు. మహత్మాగాంధీలోని ఏకత్వం, భగత్‌ ‌సింగ్‌లోని ధైర్యం, అంబేద్కర్‌లోని సమానత్వం, ఈ మూడింటిని కాంగ్రెస్‌ ‌రక్షిస్తున్నదంటూ ప్రకటించిన కన్హయ్య వాయిస్‌ ఆ ‌పార్టీకి మేలుచేస్తుందనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో పంజాబ్‌ ‌పరిణామాలు ఆ పార్టీకిప్పుడు పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టాయి.

పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా నవజ్యోతిసిద్ధూ ఎంపిక కావడానికి తీవ్ర ప్రయత్నమే చేశాడు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆయన ఎంపికైన కొద్దిరోజులకే ఆయనతో పడని పంజాబ్‌ ‌ముఖ్యమంత్రిని మార్చి కొత్త నాయకుడిని ఆ పదవిలో కూర్చోబెట్టింది. కొత్త సిఎం ఏర్పాటు చేసిన మంత్రి వర్గంలో అవినీతి పరులున్నారని, వారిని ఏరివేయాలన్నది సిద్ధూ పట్టుదల. తన మాటను పట్టించుకోకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఇప్పుడు కాంగ్రెస్‌ ఆ ‌రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో గందరగోళంలో పడింది. మరో అయిదు నెలల్లో పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. సిద్ధూ పార్టీ అధ్యక్షపదవి చేపట్టినప్పుడు పంజాబ్‌ ‌కాంగ్రెస్‌లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. ఇంతలోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక వైపు పార్టీ పటిష్టతకు పావులు కదుపుతుంటే, మరోవైపు అప్రతిష్టపాల్జేస్తున్న పరిణామాలు చివరకు బలాన్నిస్తాయా, మరింత బలహీన పరుస్తాయా వేచి చూడాలి.

Leave a Reply