Take a fresh look at your lifestyle.

రాజ్యసభలో సాగు చట్టాలపై15 గంటలపాటు చర్చ కు సమ్మతి

రైతుఉద్యమంతో ప్రభుత్వం, ప్రజలకు నష్టం కలిగిందన్న కిషన్‌ ‌రెడ్డి
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ కొనసాగుతున్న రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో 15 గంటల పాటు చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం ప్రతిపక్షాలతో సమావేశమైన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్చ రాజ్యసభలో జరగనుంది. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తర్వాత ఈ చర్చ జరపనున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ ‌వెంకయ్యనాయుడు చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో నినాదాలు చేశాయి.

ముగ్గురు ఆమ్‌ ఆద్మీ సభ్యులు పదేపదే నినాదాలు చేయడంతో వాళ్లను సభ నుంచి బయటకు పంపించి వేస్తూ ఛైర్మన్‌ ‌వెంకయ్యనాయుడు ఆదేశింశారు. కేవలం రైతుల ఆందోళనలపైనే ఐదు గంటల పాటు చర్చ జరపాలని 16 ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. అయితే ప్రభుత్వం దానిని 15 గంటలకు పెంచడానికి అంగీకరించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి సభలో ప్రకటన చేశారు. చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ ‌నేత గులాం నబీ ఆజాద్‌ ‌చెప్పారు. ఇదిలావుంటే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ పొలిమేరల్లో రైతులు చేస్తున్న ఆందోళనతో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రజలకూ తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్రహోంశాఖ ప్రకటించింది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రకటించారు. ఢిల్లీ పొలిమేరల్లో రైతుల దిగ్బంధనాన్ని తొలగించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని శివసేన ఎంపీ అనిల్‌ ‌దేశాయ్‌ అడిగిన ప్రశ్నకు కిషన్‌ ‌రెడ్డి సమాధానమిస్తూ… రైతు ఉద్యమంతో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే ఢిల్లీ పొలిమేరల్లో ఉద్యమం చేస్తున్న రైతులను వెనక్కి పంపడానికి కేంద్రం చేపడుతున్న చర్యలను మాత్రం ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు.

శివసేన ఎంపీ అడిగిన ప్రశ్నకు కిషన్‌ ‌రెడ్డి లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ… రైతుల ఉద్యమంతో అటు కేంద్రం, ఇటు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ఘాజీపూర్‌, ‌టిక్రీ, సింఘూ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనతో ఢిల్లీతో పాటు, ఢిల్లీ సరిహద్దులను పంచుకున్న రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు. మరోవైపు… రైతు ఉద్యమానికి మద్దతిచ్చే వారెవరికీ కూడా ఎన్‌ఐఏ ‌తరపున కానీ, ఈడీ తరపున కానీ ఎలాంటి సమన్లూ జారీ చేయలేదని రాజ్యసభ వేదికగా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

Leave a Reply