ఉత్తర ప్రదేశ్‌లో ఆడపిల్లలు కనిపిస్తే చాలు అపహరించుకుని పోయి, లైంగిక దాడి చేసే మృగాళ్ళు తయారయ్యారు. ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హత్రాస్ సంఘటనలో నిందితులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బలరామ్ పూర్ జిల్లా గైనార్సీలో బికాం విద్యార్ధినిని కొందరు వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకుని వెళ్ళి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగరిక సమాజానికి మచ్చ తెచ్చే రీతిలో ఉంది. ఈ రెండు సంఘటనల్లోనూ బాధితురాళ్ళను ఆ మృగాళ్ళు కాళ్ళూ, చేతులు విరిచేసి కట్టి, అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. హత్రాస్ సంఘటనలో బాధితురాలు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్లో రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. తాజా సంఘటనలో బికాం విద్యార్థిని కొద్ది గంటల్లోనే మరణించింది. హత్రాస్ సంఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని అదనపు డిజిపి చెబుతున్నారు. ఈ ఘటనలో మృతురాలి పోస్టు మార్టమ్ నివేదికలో అత్యాచారం జరిగినట్టు ఆధారాలున్నాయని పేర్కొనగా, ఫోరెన్సిక్ పరీక్షలో అటువంటి ఆధారాలేవీ లభించలేదని అదనపు డీజీపీ స్పష్టం చేస్తున్నారు. హత్రాస్ సంఘటనపై కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఆందోళన ప్రారంభించడం వల్ల జాతీయ స్థాయి ప్రాముఖ్యం లభించింది. ఎనిమిదేళ్ళ క్రితం ఢిల్లీలో నిర్భయ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిట్టు హత్రాస్ సంఘటనపై కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రం ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. అయితే, బీజేపీ ఎంపీలు, నాయకులు మాత్రం తలోరీతిలో స్పందిస్తున్నారు. ఒక ఎంపీ అయితే, వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యువతులు, విద్యార్దినులు బయటకు వస్తే బలవంతంగా పట్టుకు పోయే ముఠాలపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సామాజిక వర్గాల వొత్తిళ్ళకు లోనై చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రధానమంత్రి మోడీకి సన్నిహితుడు. ఆయన అయోధ్యలో రామాలయం నిర్మాణ కార్యక్రమాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు ప్రధానికి మాట ఇచ్చారు. అయితే, రాముణ్ణి కొలవడం ఎంత ముఖ్యమో, తన పాలనలో ఉన్న ప్రజలకు భద్రత కల్పించడం కూడా అంతే ముఖ్యమని ఆయన గ్రహించినట్టు లేదు. ఒక్క యూపీలోనే కాదు, దేశంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు బాధితులకు పరిహారం ప్రకటించడం పాలకులకు అలవాటుగా మారింది. ప్రభుత్వ సాయం బాధిత కుటుంబాలకు ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి కానీ, గాయాన్ని మార్చలేదు. ఓదార్పు వచనాలు వారికి ఊరట కలిగిస్తాయి.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ప్రియాంకా గాంధీ గురువారం బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆ గ్రామానికి బయలు దేరినప్పుడు పోలీసులు చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. జాతీయ పార్టీ నాయకుల పట్ల అంత దురుసుగా పోలీసులు వ్యవహరించిన తీరు ఎక్కడా లేదు. రాహుల్‌ని కిందికి తోసేసి, కార్యకర్తలపై లాఠీ చార్జి జరిపారు. దాంతో రాహుల్ ఆగ్రహోదగ్రుడయ్యారు. రోడ్లపై మోడీ తప్ప ఇంకెవరూ నడవకూడదా అని ప్రశ్నించారు. ఈ సంఘటనతో ముఖ్యమంత్రి యోగి ప్రధానికి తన విధేయతను చాటుకున్నారు కానీ, రాష్ట్రానికి మాయని మచ్చ తెచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో నేరగాళ్ళ ముఠాలు దశాబ్దాలుగా ప్రభుత్వ పెద్దల ప్రాపకంతో చెలరేగి పోతున్న మాట నిజమే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు ఈ ముఠాలను పెంచి పోషిస్తున్నాయి. ముఖ్యంగా, సమాజ్ వాదీ, బహుజన సమాజ్ పార్టీల ఏలుబడిలో ఈ ముఠాలు బలాన్ని పుంజుకున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరమై చాలా కాలమైంది కనుక, తిలా పాపంలో ఆ పార్టీ భాగస్వామ్యం తక్కువే. అయితే, అధికారంలో లేకపోయినా ఆ పార్టీ నాయకులు ముఠాలను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. ఈ ముఠాలను అదుపులో పెట్టలేకే రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని అర్ధంతరంగా వదిలేశారు. ఏమైనా రాహుల్‌ను కింద పడేసి ఆయన కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి జరిపిన సంఘటన యావత్ దేశంలో ఉత్తరప్రదేశ్ ప్రతిష్ఠను మంటగలిపింది. హత్రాస్ సంఘటనలో మృతురాలి అంత్యక్రియలను రాత్రివేళ అత్యంత గోప్యంగా నిర్వహించడం వల్ల అనుమానాలు ఇంకా తొలగలేదు.
ఈ తాజా సంఘటనలో కూడా మృతురాలి అంత్యక్రియలను రాత్రివేళే నిర్వహించడం పోలీసుల పట్ల అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోనే బులంద్ షహర్, ఆజాంగఢ్ జిల్లాల్లో కూడా బాలికలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకున్న సంఘటనలతో రాష్ట్రంలో హక్కుల సంఘాల వారు ఆందోళన ప్రారంభించారు. ముఖ్యమంత్రి యోగి పాలనపై పట్టు కోల్పోయారనీ, కేవలం ప్రధానమంత్రి ఆదేశాలను అమలు జరిపే విషయంలోనే ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కొరోనా వైరస్ నియంత్రణలో కూడా యోగీ విఫలమయ్యారనీ, కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో కూడా ఒక బాలికపై మృగాళ్ళు ఇదే మాదిరిగా అత్యాచారం జరిపారు. ఈ రెండు రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోనే ఉండటం గమనార్హం. డబ్బు, అధికారం, హోదాతో ఎలాంటి అరాచకాలకైనా వ్యక్తులు పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనలే రుజువు. గతంలో కాంగ్రెస్ పాలనలో ఇలా జరిగినప్పుడు తాము అధికారంలోకి వస్తే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని బీరాలు పలికిన బీజేపీ కూడా నిందితుల్లో తమ పార్టీకి సంబంధించిన వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. మూడేళ్ళ క్రితం కుల్దీప్ సింగ్ సెంగార్ అనే మాజీ ఎమ్మెల్యే ఒక యువతిపై అత్యాచార ఘటనలో నిందితునిగా ఉన్నప్పుడు అతడిని కాపాడేందుకు యోగి చివరి వరకూ ప్రయత్నించారు. ప్రజాందోళన కారణంగానే సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టి అతడిని జైలుకి పంపింది.