- సొంతూళ్లకు వెళ్లిన యువత
- వోటింగ్ శాతం తగ్గే అవకాశం
ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం ఈసారి తక్కువగానే నమోదయ్యేలా ఉంది. ఈ నెల 14 న పోలింగ్ ఉండగా, దీనికి ముందు నుంచి వరుస సెలవులు ఉండడంతో చాలా మంది గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు ఇప్పటికే సొంతూళ్లకు వెళ్లిపోయారు. గురువారం శివరాత్రి, శుక్రవారం షబ్ ఏ మెరాజ్ (ఆప్షనల్ హాలిడే), రెండోశనివారం, ఆ తర్వాత సండే కావడంతో ఇలా వరుసగా లీవులు రావడంతో ఫ్యామిలీతో గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 5,31,268 వోటర్లు ఉండగా, వీరిలో 3,36,256 మంది పురుషులు, 1,94,944 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ లక్షన్నర, లక్ష మంది ప్రైవేట్ ఉద్యోగులు , రెండు లక్షల మంది స్టూడెంట్స్ వోట్లు ఉన్నాయి.
ఎమ్మెల్సీ క్యాండిడెట్లకు వోటింగ్ టెన్షన్ పట్టుకుంది. వోటర్ల వివరాలు తీసుకొని వారికి ఫోన్ చేసి వోటు వేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. వోటర్ల నుంచి షాకింగ్ రిప్లై వస్తోంది. వోటు వేసేందుకు రాలేమని డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లామని, ఫ్యామిలీతో టూర్ కు వెళ్లామని చెబుతున్నారు. మరికొంత మంది సిటీలో వోట్లు నమోదు చేసుకొని ఇప్పుడు ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో ఆ వోట్లన్నీ మాకే అని అనుకున్న నేతల్లో ఆందోళన మొదలైంది. ఎలాగైనా వచ్చి వోటు వేసి వెళ్లాలని చాలా మంది వోటర్లను కోరుతున్నారు. సాధారణంగా జనరల్ ఎలక్షన్స్ లోనే సిటీలో వోటింగ్ శాతం 50 కి మించదు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు వోటింగ్ పర్సంటేజీ 40 శాతం కూడా మించుతుందా అనే డౌట్ నెలకొంది.