Take a fresh look at your lifestyle.

కేంద్రంలో శతృత్వం..రాష్ట్రంలో మితృత్వం

congress vs bjp in centralదేశంలో అనేక రాజకీయ పార్టీలున్నా జాతీయ స్థాయిలో మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీలు మాత్రమే ప్రత్యర్థి పార్టీలుగా స్థిరపడ్డాయి. ఈ రెండు పార్టీల నేపథ్యంలోనే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడుతూ వొస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంత అవసరాల రిత్యా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక వర్గంలో చేరడమన్నది ఓ రాజకీయ క్రీడగా మారింది. ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయంగా ఉన్న ఈ పార్టీలు ఏనాడు ఒకటవడమో లేదా ఒకదానికి ఒకటి మద్దతివ్వడమన్నది కలలో కూడా ఊహించని విషయం. కాని, విచిత్రమేమంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణలో మాత్రం ఈ రెండు పార్టీలు కొత్త సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. ఈ అనూహ్య కలయిక అటు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తుండగా, కాంగ్రెస్‌ ‌పార్టీలోని పలువురి ఆగ్రహానికి కారణంగా మారింది. ఇంతకాలం బద్ధ శత్రువులుగా కొనసాగుతూ వొచ్చిన ఈ రెండు పార్టీలు ఒకటి రెండు స్థానాల కోసం కలవడం, సంప్రదాయాన్ని విస్మరించడమేనంటూ ఆ పార్టీలోని సీనియర్‌ ‌నాయకులు రాష్ట్ర నాయకత్వంపైనా ఆగ్రహిస్తున్నారు. అది కూడా కేవలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీని ఎదుర్కునేందుకు, దశాబ్ధాల కాలంగా ఉన్న తమ సిద్ధాంతాలను విస్మరించడాన్ని వారు తీవ్రంగా తప్పు పడుతున్నారు. వాస్తవంగా తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు అధికార పార్టీని పెద్దగా ఎదుర్కోలేకపోయాయి. అధికార పార్టీ ముందుగానే ప్రకటించినట్లు వందకు పైగా స్థానాలను కైవసం చేసుకుంది. మరికొన్నిటిని ఎక్స్ అఫిసియో సభ్యులతో గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితిలో కేవలం ఒకటి రెండు చోట్ల పాలకమండళ్ళను ఏర్పాటుచేసేందుకు పై రెండు పార్టీలు జతకట్టడమేంటని రాజకీయ విశ్లేషకులకు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. సుదీర్ఘ చరిత్రగల కాంగ్రెస్‌ ‌పార్టీ స్వంతంగా ఒక మున్సిపాల్టీని గెలుచుకోలేకపోయింది.

కాని, ఒకటిరెండు స్థానాలను దక్కించుకోవడంకోసం బిజెపితో చేతులు కలపడమే ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ ‌టాపిక్‌గా మారింది. శాసనసభ ఎన్నికల నుండి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కెప్టెన్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలిపై చాలామంది పార్టీ సీనియర్లు అలకబూని ఉన్నారు. ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవినుండి వెంటనే తొలగించాలంటూ పార్టీ అధిష్టానంతో పలుసార్లు మంతనాలు కూడా చేశారు. అయితే రాష్ట్ర పార్టీలో చాలావరకు సీనియర్లు ఉండడం, ఎవరికి ఆ పదవిని అంటగట్టినా మిగతా వారు అలకపూనుతారని అధిష్టానం ఎప్పటికప్పుడు ఆ వ్యవహారాన్ని వాయిదా వేస్తూ వొస్తున్నది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దురదృష్టమో, కాంగ్రెస్‌పార్టీ దురదృష్టమోగాని ప్రతీ ఎన్నికల్లో పార్టీ ఘోరాతిగోరంగా అపజయం పాలవుతూ వొస్తున్నది. నిన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సంగతి ఎలా ఉన్నా, అన్ని స్థానాలకు పోటీచేయలేకపోయింది. పోటీ పడేందుకు ఆ పార్టీకి అభ్యర్థులే లభించలేదన్న విమర్శను అధికారపార్టీనుండి కాంగ్రెస్‌ ‌తీవ్రంగా ఎదుర్కోవాల్సివచ్చింది. ఒక పక్క అధికారపార్టీతో పోటీ పడలేకపోగా, శత్రుపార్టీతో కలిసి పనిచేయడాన్ని ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఈ విషయమై ఆ పార్టీ సీనియర్‌ ‌నేత విహెచ్‌ ‌హన్మంతరావు ఇప్పటికే బాహాటంగానే విమర్శిస్తున్నాడు. ఈ విపరీత పరిణామాన్ని తాను కేంద్రం దృష్టికి తీసుకుపోతానంటూ ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా మరికొందరు సీనియర్‌ ‌నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియాకు ఫిర్యాదుచేశారు. బిజెపితో పొత్తుపెట్టుకునే విషయంలో కనీసం తమలాంటి పార్టీ సీనియర్‌లను సంప్రదించకుండా పార్టీ అధ్యక్షుడు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని వారు ఆయన దృష్టికి తీసుకువొచ్చారు. కమిటీల నియామకంలో కూడా ఆయన ఏకపక్షంగా వ్యవహరించాడంటూ ఫిర్యాదు చేయడంతోపాటు, భవిష్యత్‌లో పార్టీకి తీవ్రనష్టాన్ని చేకూర్చే ఈ చర్చపై విచారణ జరిపి ఉత్తమ్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ ‌చేశారు కూడా.

ఒక విధంగా తమలాంటి సీనియర్‌లకు ఇది అవమానాన్ని కలిగించే అంశంగా వారు భావిస్తున్నారు. రాష్ట్ర పార్టీని ప్రక్షాళన చేస్తే తప్ప కాంగ్రెస్‌ ‌మళ్ళీ బతికి బట్టకట్టదని పార్టీ వర్గాలు అభిప్రాయబడుతున్నాయి. కాని పక్షంలో ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలు పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఏర్పడుతున్నాయంటున్నారు సీనియర్‌లు. ఇదిలా ఉంటే ఉత్తమ్‌ ఎం‌పిగా ఎన్నికైన తర్వాత అధ్యక్షస్థానం నుండి వైదలగనున్నట్లు అధిష్టానానికి చెప్పినా అధిష్టానం ఆ విషయంలో ఎలాంటి చర్చ తీసుకోలేదు. ఈ పదవిని అలంకరించేందుకు అనేకమంది ఆశావహులుండడంతో అధిష్టానం కూడా ఎలంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నది. త్వరలో సహకార ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీంతో ఈ వ్యవహారం మరోసారి మరుగునపడే అవకాశం లేకపోలేదు. ఆ ఎన్నికల తర్వాతే అధ్యక్షుడి మార్పు జరుగతుందనుకుంటున్నారు.

Leave a Reply