Take a fresh look at your lifestyle.

నామినేషన్లు వేసి నిర్ణయం ప్రజలకే వదిలేద్దామా ?

ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దాం
టీఆర్‌ఎస్‌, ‌బీజేపీలకు జానారెడ్డి సవాల్‌
‌హాలియాలో కాంగ్రెస్‌ ‌భారీ జన గర్జన సభ
ప్రభుత్వ మార్పుకు సాగర్‌ ఉప ఎన్నికతోనే నాంది : ఉత్తమ్‌

‌స్వాతంత్య్రం ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్‌ ‌పార్టీయేననీ, నాగార్జునసాగర్‌, శ్రీ‌శైలం ఎడమ కాలువ ద్వారా లక్షలాది ఎకరాల భూమికి సాగు నీరు ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ ‌పార్టీయేననీ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత కె.జానారెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం హాలియాలో కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్వహించిన జన గర్జన బహిరంగ సభలో జానారెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలలో నామినేషన్లు వేసి ప్రచారం చేయకుండా నిర్ణయం ప్రజల అభిష్టానికి వదిలేద్దామనీ, ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దామని టీఆర్‌ఎస్‌, ‌బీజేపీలకు సవాల్‌ ‌విసిరారు. తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటో సీఎం కేసీఆర్‌ ‌వస్తే చూపిస్తామనీ, ఆ లెక్కలన్నింటికీ సీఎం జవాబు చెప్పాలని స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీయేననీ, నల్ల చట్టాలు చేసి రైతులకు అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ పోరాటం చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ ఇస్తే సర్పంచ్‌లు కాలేని వారి కూడా ఎమ్మెల్యేలు అయ్యారని ఎద్దేవా చేశారు. 1984లో తాను నామినేషన్‌ ‌వేసి కరపత్రం పంచి ప్రజల అభీష్టం మేరకు వోట్లు వేయాలని కోరాలనీ, ఇప్పుడు కూడా ఈ రెండు పార్టీలు నామినేషన్లు వేసి ప్రచారం చేయకుండా నిర్ణయం ప్రజలకే వదిలేద్దామని టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలకు సవాల్‌ ‌విసురుతున్నాననీ, ఈ సవాల్‌ను స్వీకరించడానికి రెండు పార్టీలు సిద్ధమేనా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌లో కూర్చో, బీజేపీ వాళ్ల పార్టీ కార్యాలయంలో కూర్చోవాలి, నేను గాంధీభవన్‌లో కూర్చుంటా ఎవరు గెలుస్తారో చూద్దామా అని సవాల్‌ ‌విసిరారు. జానారెడ్డి అనేక మంది నాయకులకు ప్రాణం పోస్తే వాళ్లే ఏజెంట్లుగా జానారెడ్డి ప్రాణం తీసేందుకు ఇంచార్జిలుగా వచ్చారనీ, కేసీఆర్‌ ‌వస్తే అక్కంపల్లి రిజర్వాయర్‌ ‌వద్ద ఎన్టీయార్‌, ‌జానారెడ్డి పేరు ఉందని చూపిస్తానని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో గతంలో 44 వేల ఎకరాల ఆయకట్టు ఉండేదనీ, ఇప్పుడు ఈ ఒక్క నియోజకవర్గంలోనే 2 లక్షల ఎకరాల భూమి పారుతుందని చెప్పారు. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో డబ్బు సంచులు పంచి వోట్లు పొందాలని టీఆర్‌ఎస్‌ ‌నేతలు చూస్తున్నారనీ, ఈ ప్రలోభాలకు లొంగవద్దని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ మార్పుకు సాగర్‌ ఉప ఎన్నికతోనే నాంది : ఉత్తమ్‌
‌నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌పార్టీ విజయంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని టీ పిసిసి చీఫ్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. హాలియాలో నిర్వహించిన కాంగ్రెస్‌ ‌జన గర్జన సభలో ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికీ టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. ఇక్కడ బీజేపీకి డిపాజిట్‌ ‌కూడా దక్కదనీ, ఆ పార్టీ నేతల మాయమాటలకు ప్రజలు లొంగరని స్పష్టం చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడకు వెళ్లి ప్రజలను మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందనీ, ఈ ఆరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాగార్జునసాగర్‌ ‌నియోజకవర్గానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. సాగర్‌ ‌ప్రజలు ప్రేమాభిమానాలతో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply