Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత అహ్మద పటేల్‌ ‌కన్నుమూత

  • ప్రధాని మోడీ, మన్మోహన్‌ ‌సింగ్‌, ‌సోనియా గాంధీ తదితరుల సంతాపం

కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత అహ్మద్‌ ‌పటేల్‌(71) ‌కొరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం 3.30 గంటలకు అహ్మద్‌ ‌పటేల్‌ ‌మృతి చెందారని ఆయన కుమారుడు ఫైజల్‌ ‌పటేల్‌ ‌ట్విటర్‌ ‌ద్వారా తెలియ జేశారు. అహ్మద్‌ ‌పటేల్‌కు నెల రోజులు క్రితం కొరోనా వైరస్‌ ‌సోకింది. గత కొద్దిరోజులుగా ఆయన శరీరంలోని పలు అవయవాలు సవ్యంగా పనిచేయకపోవడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 15 నుంచి అహ్మద్‌ ‌పటేల్‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ ‌నేత అహ్మద్‌ ‌పటేల్‌ ‌మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీ… అహ్మద్‌ ‌పటేల్‌ ‌సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని కొనియాడారు. అలాగే కాంగ్రెస్‌ ‌పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. తాను అతని కుమారుడు ఫైజల్‌కు ఫోనుచేసి, వారి కుటుంబాన్ని పరామర్శించానని, సానుభూతి ప్రకటించానని తెలిపారు. ఆయన మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు : మన్మోహన్‌, ‌సోనియా, రాహుల్‌, ‌ప్రియాంక, కాంగ్రెస్‌ ‌నేతల నివాళి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు అహ్మద్‌ ‌పటేల్‌ ‌మృతిపట్ల మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ‌తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. అహ్మద్‌పటేల్‌ ‌తనకు గొప్ప స్నేహితుడని, ఆయన అకాల మరణవార్త తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాతికి గురయ్యానని మన్మోహన్‌ ‌సింగ్‌ ‌తెలిపారు.

ఈ మేరకు ఆయన డియాకు ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు. ఆయన మరణంతో కాంగ్రెస్‌ ‌పార్టీకి కోలుకోలేని దెబ్బ అని మన్మోహన్‌ ‌తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆహ్మద్‌పటేల్‌ను కోల్పోయిన అతని కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్‌ ‌నేత సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీతో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు సంతాపాలు తెలిపారు. కాంగ్రెస్‌ ‌పార్టీ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన సహచరుడుని కోల్పోయా నంటూ సోనియా ట్వీట్‌ ‌చేశారు. అహ్మద్‌ ‌గొప్ప ప్రజ్ఞాశాలి. విధుల పట్ల ఆయన నిబద్ధత, బాధ్యత, విశ్వసనీయత ఆయన్ని ప్రత్యేక వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ఇతరులకు సహాయపడటము, దయా హృదయము ఆయన నుండి ఇతరులు నేర్చుకోవలసినవి. ఆయన లేని లోటును పూడ్చలేము. విశ్వాసమైన సహచరుడు, స్నేహితుడు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అంటూ సోనియా గాంధీ ట్వీట్‌ ‌చేశారు. అహ్మద్‌ ‌పటేల్‌ ‌కాంగ్రెస్‌కు మూలస్తంభం లాంటి వాడని రాహుల్‌ ‌గాంధీ కొనియాడారు.

కాంగ్రెస్సే శ్వాసగా, ధ్యాసగా బతికారు. క్లిష్ట సమయాల్లో కూడా కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆయన పార్టీకి ఎనలేని ఆస్తి. ఆయనను కోల్పోయాము అంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియాంక గాంధీ సైతం ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఏ సలహా, సూచన కోసం వెళ్లినా సరైన మార్గనిర్దేశనం చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన లేకపోవడం కాంగ్రెస్‌ ‌పార్టీకి తీర్చలేని లోటని వ్యాఖ్యానించారు. అన్ని క్లిష్ట సమయాల్లో తమకు అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వీరితో పాటు కాంగ్రెస్‌ ‌నేతలు చిదంబరం, కపిల్‌ ‌సిబాల్‌, ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి అమరీందర్‌ ‌సింగ్‌, ‌రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గ్లెట్‌, ‌కాంగ్రెస్‌ ఎం‌పి శశిథరూర్‌ ‌పలువురు ఆయన మృతికి సంతాపాలు తెలియజేశారు.

Leave a Reply