దేశంలోనే అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీకి 24 ఏండ్ల తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో శశిథరూర్‌పై మల్లికార్జున్ ఖర్గే దాదాపు 7000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఖర్గేకు 7897 ఓట్లు లభించగా.. థరూర్‌కు కేవలం 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఖర్గే ఇప్పుడు తన పాత్రను నిర్ణయిస్తారని ఆంధ్రప్రదేశ్‌లో డియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ చెప్పారు. కాగా, ఏఐసీసీ కొత్త అధ్యక్షుడికి శశి థరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ అధ్యక్షుడయిన రెండో దళిత నాయకుడిగా ఖర్గే నిలిచారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన తొలి దళిత నాయకుడు బాబూ జగ్జీవన్ రామ్. స్వాతంత్యాన్రంతరం పార్టీ నాయకత్వం 75 ఏండ్లలో 42 ఏండ్ల పాటు గాంధీ కుటుంబంతోనే కొనసాగగా.. 33 ఏండ్ల పాటు పార్టీ అధ్యక్ష పగ్గాలు గాంధీయేతర నేతల వద్ద ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవి 1998లో జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాద్ తలపడ్డారు.
ఆ ఎన్నికల్లో సోనియా గాంధీకి 7,448 ఓట్లు రాగా, జితేంద్ర ప్రసాద్‌కు కేవలం 94 ఓట్లు తగ్గాయి. 1998 నుంచి 2017 వరకు, తిరిగి 2019 నుంచి 2022 వరకు 20 ఏండ్లకు పైగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఉన్న సోనియా గాంధీ.. పార్టీకి ఎక్కువ కాలం పనిచేసిన అధ్యక్షురాలుగా రికార్డుల్లో నిలిచారు. 2017 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ఈ పదవిని చేపట్టేందుకు నిరాకరించడంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని శశి థరూర్ ప్రధాన ఎన్నికల ప్రచారకుడు సల్మాన్ సోజ్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణలో పోలింగ్‌కు ముందు, పోలింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని సోజ్ చెప్పారు. అవకతవకలు జరిగిన విషయాన్ని పార్టీ ఎన్నికల ఇంఛార్జ్ మధుసూదన్ మిస్త్రీకి తెలియజేసినా ఫలితం లేకపోయిందని సోజ్ విచారం వ్యక్తం చేశారు.