ప్రియాంకకు చేదు అనుభవం, ఇదేనా ప్రజాస్వామ్యమని ఆమె ఆక్రోశం
వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరిట నరేంద్రమోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు రైతుల పాలిట యమపాశాలుగా తయారయ్యాయి. వాటిని రద్దు చేసే వరకూ ఉద్యమాన్ని ఆపబోమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి వర్గం గురువారం రాష్ట్రపతిని కలుసుకున్నది. కాంగ్రెస్ బృందంలో ముగ్గురు లేదా నలుగురిని మాత్రమే అనుమతించారు. ఆఖరుకు పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన ప్రియాంక గాంధీని కూడా లోపలకు వెళ్ళనివ్వలేదు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపించింది. రైతులను ఎవరో ప్రోత్సహిస్తున్నారనో, లేక రాజకీయ దురుద్దేశ్యంతో వారు ఆందోళన కొనసాగిస్తున్నారనో మోడీ ఇప్పటికీ భావిస్తే అసలు సమస్యను ఆయన అర్థం చేసుకున్నట్టు లేదని రాహుల్ అన్నారు. రైతుల తరఫున మాట్లాడితే నేరంగానూ, దేశ ద్రోహంగానూ పరిగణించే ధోరణిని కూడా ఆయన తప్పు పట్టారు. దేశంలో కోట్లాది మంది రైతుల తరఫున మాట్లాడే హక్కు అందరికీ ఉంది. రాజకీయ పార్టీలు రైతుల సమస్యలపైనే పోరాటాలు సాగించి వెలుగులోకి అంతిమంగా అధికారంలోకి వొస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ జనతాపార్టీ దాని మాతృక భారతీయ జనసంఘ్ పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను కాపాడే పార్టీగా ముద్రపడింది. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోవడానికి సంజయ్ గాంధీ మంత్రాంగం కారణంగా పైకి కనిపిస్తున్నప్పటికీ, అంతర్గతంగా ఆ పార్టీలో ఉన్న విభేదాల కారణంగానే జనతా ప్రభుత్వం కుప్పకూలింది.n
రైతుల ప్రతినిధి అయిన చరణ్ సింగ్ ఆ ప్రభుత్వంలో ఉపప్రధానిగా ఉండేవారు. ఆయన ప్రభుత్వం నుంచి వైదొలగేటప్పుడు సంఘ్ పరివార్, దాని ప్రోద్బలంపై పని చేస్తున్న జనసంఘ్ నాయకులను నేరుగానే విమర్శించారు. పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల పరిరక్షణలో సంఘ్ నాయకులు రైతుల ప్రయోజనాలకు అడ్డు తగులుతున్నారని బహిరంగంగానే విమర్శించారు. దశాబ్దాలు గడిచినా దేశంలో ఇప్పటికీ అవే రాజకీయాలు నడుస్తున్నాయి. భూస్వాములు, పారిశ్రామికవేత్తల్లో ఎవరిది పై చేయి అనే అంశంపైనే పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న రైతుల ఉద్యమానికి కూడా మూల కారణం అదే. రైతుల ఉద్యమాన్ని సమర్థించిన వారిని దేశద్రోహులుగా మోడీ ప్రభుత్వం ముద్ర వేస్తోందని రాష్ట్రపతికి రాహుల్ ఫిర్యాదు చేశారు. ప్రియాంక అంతకన్నా ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒక ప్రజాస్వామ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా రైతుల ఉద్యమం గురించి రాష్ట్రపతికి వివరించాల్సిన బాధ్యత తనపై ఉందనీ, బాద్యతను నెరవేర్చనివ్వకుండా మోడీ ప్రభుత్వం అడ్డుతగులుతోందని ఆమె ఆరోపించారు. మోడీ ప్రభుత్వం సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా, వివిధ వర్గాల మధ్య తగువులను పెంచేందుకు, పెద్దవి చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రియాంక ఆరోపించారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్కు ఒక ర్యాలీని ఆ పార్టీ నిర్వహించింది. ర్యాలీకి ఆంక్షలు విధించడాన్ని ప్రియాంక తప్పు పట్టారు. నూటముప్పయి సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీ పరిస్థితే ఇలా ఉంటే ఇక ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవొచ్చు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను అసలు లెక్క చేయడం లేదు.
తన వాదాన్ని అందరూ ఔదల దాల్చాలన్న నిరంకుశ పోకడను అనుసరిస్తున్నారని ఇప్పటికే చాలా మంది ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. దానిని ఎవరూ కాదనలేరు. ఇందిరాగాంధీ హయాంలో కూడా ఎమర్జెన్సీ కాలంలో తప్ప మిగిలిన కాలమంతా ఇలాంటి ర్యాలీలు, సభలు ఎన్నో జరిగినా అడ్డు చెప్పలేదు. మోడీ పైకి చెప్పే మాటలకూ, చేతలకూ తేడా ఉందన్న ప్రతిపక్షాల ఆరోపణ ఇలాంటి సందర్బాల్లో రుజువు అవుతోంది. వ్యవసాయ చట్టాలపై ఎంపిక చేసిన కొందరు నిపుణుల చేత ప్రకటనలు ఇప్పించేసి మిగిలిన వారెవరూ మాట్లాడకూడదంటే ఎలా అని హక్కుల ఉద్యమ కారులు ప్రశ్నిస్తున్నారు. మోడీకి సమర్థనగా మాట్లాడే నిపుణులు అద్దాల గదిలో కూర్చిని సమీక్షించేవారే. వారికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలియవన్న హక్కుల ఉద్యమ కారుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యలో నిజం ఎంతో ఉంది. రైతుల ఉద్యమానికి దేశంలో ప్రజాస్వామ్య చైతన్యానికి ప్రతీకగా ప్రజాస్వామ్య ప్రియులు అభివర్ణిస్తుంటే, మన దేశంలో ప్రజాస్వామిక స్పిరిట్ ఎక్కువైపోయిందంటూ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించడం దురదృష్టకరం.
ప్రభువులకు ఎక్కడ కోపం వొస్తుందోనని పూర్వకాలంలో మంత్రులు, వందిమాగదులు వంత పాడేవారు. ఇప్పుడు అమితాబ్ కాంత్ వంటి వారు ఆ పాత్ర పోషిస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరు పొందాలని ఒక వంక ఉపన్యాసాలు దంచేస్తూనే, మరో వంక ప్రజాస్వామ్యానికి సంకెళ్ళు వేసే మోడీ వంటి పాలకులు ఉన్నంత కాలం ప్రజాస్వామ్య స్ఫూర్తి మచ్చుకైనా కానరాదన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలో అసత్యం లేదు. మోడీ తీసుకున్న ప్రధానమైన నిర్ణయాల్లో ప్రతిపక్షాలను అసలు సంప్రదించలేదు. ఆయన దృష్టిలో ప్రతిపక్షాలనేవి లేనే లేవు. వాటికి ప్రజాబలం లేదు. తమ పార్టీకే దేశ ప్రజలంతా మద్ధతు ఇస్తున్నారని ఆయన నమ్ముతున్నారు. రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు. ఆయనను కలుసుకునే హక్కు దేశంలో ప్రతి ఒక్కరికీ ఉంది. తనను అడ్డుకోవడంపై ప్రియాంక చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ భవిష్యత్ పోరాటానికి సూచికగా పేర్కొనవొచ్చు. ఆమె ప్రజాస్వామ్య ప్రియులకు ఈరోజే పిలుపు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో పార్టీ ఇన్ చార్జీగా ఆమె కొత్త బాధ్యతలను తలకెత్తుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఆమె ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవొచ్చు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇవ్వాలన్న ప్రియాంక పిలుపును దేశ ప్రజలంతా అందుకునే సమయం ఆసన్నమవుతోంది.