గ్రేటర్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చిక్కుల్లో పడిందా అనే అను మానాలకు బలం చేకూర్చే విధంగా ఆ పార్టీలో పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క ఓటమి ఎన్నో గుణ పాఠాలను నేర్పుతుందని అంటుంటారు.. కానీ గత ఆరేండ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోతున్నా కాంగ్రెస్ వైఖరిలో కొంతయినా మార్పు కానరావడం లేదు. గడిచిన ఆరేళ్లలో పార్టీ ఎన్ని ఓటములు చవిచూసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే విధంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ యోధాను యోధులు కూడా ఘోరమైన రీతిలో ఓటమి చవిచూశారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పొందిన ఓట్లు అంతంత మాత్రమే. తెలంగాణ ఇచ్చింది తామేనని పదే పదే చెప్పుకునే ఆ పార్టీ నేడు అదే తెలంగాణలో ఈ పరిస్థితికి దిగజారిందంటే ఇంతకంటే అవమానం మరోకటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు ప్రస్తుతం ఉన్నవాళ్లలో సమర్థుడైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగిద్దామంటే సదరు పార్టీకి సీనియర్లుగా చెప్పబడుతున్న, ప్రజల్లో ప్రాబల్యం తగ్గిన సీనియర్లు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిభ కనబర్చింది. కొద్దో గొప్పో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందనుకుంటే అది ఏమాత్రం ముందుకు పడటం లేదు. పైపెచ్చు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైంది. వరుస వైఫల్యాలతో ఓటమి పాలైన ప్రతీసారి అంగీకరిస్తున్నారు తప్పించి..ఆ ఓటమికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ అన్వేషించిన దాఖలాలు లేవు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉనికిపాట్లు మొదలయ్యాయనే చెప్పొచ్చు. సహజంగానే పార్టీ ఉనికి కోల్పోయిన తరుణంలో పార్టీలోని నేతలు పక్క పార్టీల్లోకి జంప్ కావడం అనివార్యం. మరి 130 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఈ పరిస్థితికి రావడానికి గల కారణమేంటి? అసలు లోపం ఎక్కడ? అన్న అంతర్మథనం మాత్రం కానరావడం లేదని రాజకీయ విశ్లేషకుల భావనగా ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీని గాడిలో పెట్టడం అసాధ్యమనేది పార్టీ ఇంఛార్జిలుగా వ్యవహరిస్తున్న వారి మాటగా ఉంది. కుంతియా ఇంఛార్జిగా ఉన్న సమయంలో పార్టీ చెల్లా చెదురైందని అంటున్నారు. వారు పార్టీని బలోపేతం చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారనే విమర్శలు వున్నాయి. ఆలస్యంగానైనా కుంతియా స్థానంలో మాణికం ఠాగూర్ వచ్చారు. మాణికం ఠాగూర్ వచ్చిన తర్వాత కొంతమేర పరిస్థితిలో మెరుగుదలకు కృషి చేసినా నేతల మధ్య సమన్వయ లోపం పార్టీకి తీరని లోటుగా పరిణమిస్తోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చావో రేవో సమస్యగా నిలిచింది. అలాంటి దుబ్బాకలో సైతం ఫలితం వెక్కిరించింది. ఆ తర్వాత వెనువెంటనే గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. దీంతో దుబ్బాక ఉప ఎన్నిక వైఫల్యంతో ఉనికి పాట్లు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికలు పెను సవాల్‌గా పరిణమించాయి. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తమలో పూర్తిస్థాయిలో జోష్ నింపిందని కాపాయం పార్టీ ఎగిరెగిరిపడుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి నిద్రపట్టనివ్వడం లేదు. బిజెపి.. కాంగ్రెస్‌లోని ప్రముఖులకు గాలం వేస్తూ వస్తోంది. మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి దంపతులు కాంగ్రెస్‌ని వీడి కమలం గూటికి చేరిపోయారు. ఇందుకు గల కారణాలు అనేకం. కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఆధిపత్యపోరు పెద్ద మైనస్‌గా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు.
ఇక పార్టీలో గ్రూపుల కొట్లాటలు సర్వసాధారణమన్న విషయం తెలియంది కాదు. పదవుల పందేరంలో గొడవలు నిత్యకృత్యం.. ఇలాంటి వన్నీ పార్టీ పరువును దిగజార్చుతున్నాయని వేరే చెప్పనవసరం లేదు. ఇక అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట పార్టీలో లోలోన చర్చించాల్సిన అంశాలను సైతం బహిరంగంగా ఆ పార్టీ నేతలు చర్చ పెడుతుంటారు. ఇది పార్టీ ప్రతిష్టకు ఎంత భంగం కలిగిస్తుందనేది ఆ పార్టీ నేతలకు బోధపడని స్థితి ఉందని అంటున్నారు. ఇంకోవైపు పార్టీ నుంచి ప్రముఖ నేతలు ఒక్కొక్కరే వలసల బాట పడుతున్నారు. ఇంత జరుగుతున్నా బయటకు వెళ్లేవారిని నిలువరించే ప్రయత్నాన్ని సైతం కాంగ్రెస్ చేయలేకపోవడం బహిరంగ రహస్యమేనని ఆ పార్టీ నేతలే పలు సందర్భాల్లో అంగీకరిస్తున్న మాటగా వినవస్తోంది. ఇదే అదనుగా గ్రేటర్లో మరింత బలపడేందుకు బిజెపి..కాంగ్రెస్‌లోని ప్రజాదరణ కలిగిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అంతేకాదు..వారి వారి ఇళ్లకు వెళ్లి సంప్రదింపులు నెరుపుతోంది. దీంతో పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరిపోతున్నారు. తాజాగా కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగలనుంది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హస్తానికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. విజయశాంతి ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు వెళ్లి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మరికొందరు ప్రముఖులు సైతం కాంగ్రెస్ పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. దీంతో గ్రేటర్ ఎన్నికల ముందే కాంగ్రెస్ డీలా పడిందన్న మాటే నిజమయ్యే ఆస్కారం లేకపోలేదు. గత సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజిగిరి నుండి ఎంపి గా రేవంత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. గ్రేటర్ పరిధిలో వారికి ఒక్క శాసన సభ్యుడు లేరు. తెలంగాణలో రోజురొజుకీ పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరముగా మారింది. నాయకుల ఆధిపత్య పోరు ఎక్కవ అయినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలలో విజయం సాధించడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. స్టార్ కాంపెయినర్ల కొరత వుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పు కోవాల్సిన పార్టీ తమ అగ్ర నేతలు పార్టీ మారడం పార్టీకి షాక్ లా మారింది. గ్రేటర్ ఎన్నికల ఫలితం వస్తే గాని పార్టీ భవిష్యత్ ఎలా వుండ బోతుందో తెలియదు.
