Take a fresh look at your lifestyle.

వెంటిలేటర్‌పై కాంగ్రెస్‌ ‌పార్టీ !

సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క అన్నమాటలు కాంగ్రెస్‌పట్ల అక్షరసత్యమనిపిస్తున్నది. ‘కాంగ్రెస్‌పార్టీని బతికించుకుందాం, అప్పుడే మనం రాజకీయాల్లో బతికి ఉంటామంటూ’ ఆయనచేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ పార్టీ ఎలాంటి స్థితిలోఉందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నది. నూటముప్పై ఏళ్ళ వయోవృద్ధపార్టీ, స్వాతంత్య్రం వచ్చిన డెబ్బైఏళ్ళలో అత్యధిక సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలినపార్టీకి ఇవ్వాళ మనుగడలేకుండా పోతోంది. ఒకనాడు మరే ఇతర రాజకీయపార్టీలైనా కాంగ్రెస్‌ను తట్టుకుని నిలబడడమే కష్టంగా ఉండేది.అలాంటి పార్టీకి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను బతిమిలాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ డెబ్బె ఏళ్ళలో కాంగ్రెస్‌ ‌పార్టీ దేశ రాజకీయాల్లో అనేక ఉత్థానపతనాలు చవిచూసింది. అయినా జాతీయ పార్టీగా కనీసం తన మనుగడనైనా కాపాడుకుంటూ వచ్చింది. కాని, ఇటీవలకాలంలో ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. వరుస పరాజయాలను మూటగట్టుకుంటోంది. వివిధ రాష్ట్రాల్లో కనీస స్థాయిలోకూడా అభ్యర్ధులను గెలిపించుకోలేని దీనావస్థకు చేరింది. ఆరేళ్ళ కింది వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఆ తర్వాత వరుసగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోవడంకన్నా దురదృష్టం మరోటిలేదు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో ఒకటి, రెండు లేదా సున్నా స్థానాలకే పరిమితంకావడం ఆ పార్టీ పతనానికి కారణంగా మారుతూవస్తున్నది. అంతెందుకు శతాధిక వయసున్న ఈ పార్టీ నేటికీ సారథిని ఎన్నుకోవడమే బ్రహ్మప్రళయంగా మారిందంటే అంతకన్నా అధ్వాన్న పరిస్థితి మరోటి ఉండదు. కనీసం వరుస పరాభవాలనుండి పాఠాలను నేర్చుకునే స్థితిలోకూడా ఆ పార్టీలేదు. కాంగ్రెస్‌పార్టీ అంటేనే అత్యధిక ప్రజాస్వామ్యం ఉన్నపార్టీగా పేరు. గతంలో ఉన్న కట్టుబాట్లు, పార్టీపట్ల విధేయత అన్నది అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రపార్టీలోనూ లోపిస్తుండడంతో ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకునే వారే లేరు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో ప్రధాన భూమిక నిర్వహించినప్పటికీ ఆ పార్టీలోని కురువృద్ధులే ఇంకా కీలకనేతలుగా చెలమణి అవుతుండడమే ఆ పార్టీని క్షీణింపజేస్తున్నదన్న వాదన ఉంది.

యువనాయకత్వానికి బాధ్యతలు అప్పగించి, కీలక విషయాల్లో సూచనలు, సలహాలనిచ్చే ఉదారగుణం అగ్రనాయకత్వానికి లేకపోవడంకూడా పార్టీ పతనానికి కారణంగా మారింది. జాతీయ అధ్యక్షపదవిని రాహుల్‌ ‌గాంధీ నిరాకరించడంలోకూడా ఇదే అంశం కీలకంగా మారింది. తాను సారథ్యం చేపట్టాలంటే యువకులకే ప్రాధాన్యతనివ్వాలన్న ఆయన పట్టుదల వృద్ధనా యకత్వంకింద నిలవలేకపోయింది. మొదటినుండి నెహ్రూ కుటుంబాన్ని చూపెట్టుకుంటూ అధికారాన్ని చెలాయిస్తూ వస్తున్న నాయకులకు రాహుల్‌గాంధీ నిర్ణయం ఏమాత్రం నచ్చకపోయినా, అధ్యక్షుడిగా ఆయనకొ నసాగింపులో వారెలంటి అభ్యంతరం చెప్పకపోయినా, రాహుల్‌ ‌మాత్రం ఎట్టిపరిస్థితిలోనూ తానాపదవిలో కొనసాగనని మంకుపట్టుపట్టి బలవంతంగా కట్టబెట్టిన ఏఐసిసి అధ్యక్షపదవికి రాజీనామాచేసిన విషయం తెలియంది కాదు. అధ్యక్షుడిగా కొనసాగిన ఆ ఇరవై రోజుల్లోకూడా ఆయన తాను అనుకున్నట్లు సచిన్‌పాయిలెట్‌, ‌జ్యోతిరాదిత్య లాంటి యువనేతలను ప్రోత్సహించడం గమనార్హం. ఏమైతేనేమీ చివరకు మళ్ళీ నెహ్రూసంతతే దిక్కు అన్నట్లు మరో వ్యక్తిని ఎన్నుకునేవరకు పార్టీ సారధ్య బాధ్యతను సోనియాకే మరోసారి అప్పగించాల్సివచ్చింది. మొదటినుండీ కుటుంబపాలన అంటూ కాంగ్రెస్‌పార్టీపై దాడిచేస్తూ వస్తున్న భారతీయ జనతాపార్టీకిది కలిసివచ్చిన అవకాశంగా మారింది. ప్రతీ ఎన్నికల్లో నెహ్రూ మొదలు రాజీవ్‌గాంధీ వరకు వరుసగా అందరి పేర్లను ఉటంకిస్తూ వారిపాలనాకాలంలోని తప్పిదాలను ప్రజలముందుకు తీసుకువచ్చి ఓట్లను ప్రోగుచేసుకుంటోంది బిజెపి. దాన్ని ఎదుర్కుని నిలబడగల సత్తా రాహుల్‌కు లేకుండా పోయింది. ఆయన ప్రధాని మోదీపైన చేసిన ఆరోపణలేవీ ఆ పార్టీకి కలిసిరాకుండాపోయాయి. దీంతో పార్టీ అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ బలహీనమవుతూ వస్తోంది. చివరకు ఆ పార్టీ అనుబంధ శాఖలకు కనీసం బడ్జెట్‌నుకూడా సమకూర్చలేని స్థాయికి చేరుకుంది.

దీనికి తగినట్లు రాష్ట్రాల్లో అధికారంలోఉన్న స్థానిక పార్టీలు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీల్లోకి కాంగ్రెస్‌నుండి వలసలు ప్రారంభమైనాయి. ఈ వలసలను నిరోధించే శక్తి కూడా పార్టీకి లేకుండా పోయింది. ఇంకా పార్టీ ఫిరాయిస్తారంటూ అడపాతడపా ఒకటిరెండు పేర్లు వినిపిస్తూనేఉన్నాయి. ఫలితంగా స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ తన సత్తాను చాటుకోలేక చేతులెత్తేసింది. ఇదిలాఉంటే రెండుతెలుగురాష్ట్రాలుగా ఏర్పడినప్పటినుండీ కాంగ్రెస్‌ ‌మనుగడ కరవైంది. ఆంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, ఇంకా తెలంగాణలో గుడ్డిలో మెల్లగా కొనసాగుతోంది. అయినా ఇక్కడకూడా పార్టీ సారథ్యం విషయంలో అంతర్ఘత కలహాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా సీనియర్‌నాయకులే ఇంకా పిసిసి అధ్యక్ష స్థానంకోసం పోటీ పడుతుంటే ఇక యువనాయకులకెక్కడిది చోటు? సేమ్‌ ‌సీన్‌ ‌రాష్ట్రాల్లోనూ రిపీట్‌ అవుతోంది. ఒక విధంగా కాంగ్రెస్‌ ఓటమికి కాంగ్రెసే కారణంగా మారుతోంది. అందుకే భట్టి విక్రమార్క అన్నమాటలు అక్షర సత్యాలు. పార్టీని బతికించుకోకపోతే నాయకులకు రాజకీయ భవిష్యత్‌లేదన్నదాన్లో వాస్తవం లేకపోలేదు. ఇదే విషయంపై గతంలో రాహుల్‌ అన్న విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరముంది. భారత్‌లో క్రమేణా ఏకపార్టీ ప్రభుత్వాలు ఏర్పడే ప్రమాదాలు కనిపిస్తున్నాయని, భవిష్యత్‌లో ఇక ఎన్నికలే జరిగే అవకాశం ఉండదేమోననిపిస్తుంది. ఇది భారత్‌లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి ప్రమాదమన్న రాహుల్‌ ‌మాటలను కాంగ్రెస్‌పార్టీ ఏమేరకు అర్థం చేసుకుంటుందో మరి.

Leave a Reply