Take a fresh look at your lifestyle.

ఎన్నికల మీద దృష్టితో కాంగ్రెస్‌ ‌ప్రక్షాళన

ఆరోగ్యం సహకరించకపోయినా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రక్షాళనపై దృష్టిని కేంద్రీకరించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇన్‌ ‌చార్జిగా రామంచంద్ర కుంతియా స్థానే మాణిక్యం ఠాకూర్‌ను నియమించారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆ రాష్ట్రంలో పార్టీ వ్యవహారాల ఇన్‌ ‌చార్జిగా ప్రియాంక గాంధీని నియమించడం ద్వారా యువతరం అభ్యర్థనకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే, రాజస్థాన్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీలో యువతరానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో ఎన్నో కీలక పదవులను నిర్వహించిన గులామ్‌ ‌నబీ ఆజాద్‌ ‌ప్రాధాన్యం తగ్గించడానికి కారణం ఆయన పార్టీ అధిష్టానానికి బహిరంగ లేఖ రాయడమే. అంతేకాక, ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశానికి ముందు 23మంది సీనియర్‌ ‌నాయకులు లేఖ రాసిన నేపథ్యంలో బీజేపీతో కుమ్మక్కయ్యారంటూ రాహుల్‌ ‌గాంధీ పార్టీ సమావేశంలో చేసిన విమర్శకు ఆజాద్‌ ‌నొచ్చుకున్నారు. 30 సంవత్సరాలుగా పార్టీకి సేవలందించినందుకు ఇదా ప్రతిఫలం అని బహిరంగంగానే ప్రశ్నించారు. పార్టీ ప్రక్షాళన పేరిట సోనియా చేసిన మార్పులు రాహుల్‌ ‌గాంధీకి అనుకూలంగానే ఉన్నాయి. ఆయన సన్నిహితునిగా పేరొందిన సూర్జేవాలాకు పార్టీ కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ వర్గాలను ఏకతాటిపైకి తేవడం ప్రియాంక వల్ల అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌ ‌వల్ల లబ్ధి పొందిన వారే ఆ పార్టీకి ఎదురు తిరగడం కొత్త కాకపోయినా, ఉత్తరప్రదేశ్‌లో అది మరీ ఎక్కువ. ఉదాహరణకు గతంలో ఇందిరాగాంధీకి గట్టి మద్దాతుదారుగా ఉన్న హేమవతీనందన్‌ ‌బహుగుణ ఆ తర్వాత ఎదురు తిరిగారు. ఆయన కుమార్తె రీటా బహుగుణ సోనియా హయాంలో చాలా కాలం పీసీసీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమెను తొలగించాలని ఎన్ని ఒత్తిడులు వచ్చినా సోనియా మెత్తబడలేదు. అలాంటి రీటా బహుగుణ గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఆజాద్‌ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించి సీడబ్ల్యూసీకే పరిమితం చేయడం వల్ల పార్టీలో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది. పార్టీలో లోపాలను సరిదద్దమన్నందుకే తనపై వేటు వేశారని ఆయన ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది.

అంతేకాక, ఆజాద్‌కి అన్ని రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై మంచి పట్టు ఉంది. పార్టీ అధ్యక్షురాలికి సహాయకులుగా ఆరుగురితో ఒక ప్రత్యేక కమిటీని నియమించి ఆంటోనీ, సూర్జేవాలా, కేసీవేణుగోపాల్‌, ‌ముకుల్‌ ‌వాస్నిక్‌ ‌వంటి వారిని నియమించారు. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్సి అహ్మద్‌ ‌పటేల్‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. వీరందరినీ చూస్తే, ధైర్యంగా తమ అభిప్రాయాలను వెల్లడించేవారిని పక్కన పెట్టి భజనపరులకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ ‌చార్జిగా ఆజాద్‌ని తొలగించి కుంతియాను నియమించడం వల్ల రాష్ట్రంలో పార్టీ మరింత బలహీనపడింది. ఆజాద్‌ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీకి సన్నిహితుడనే ప్రచారం ఉంది. ఏమైనా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా పార్టీ ఇన్‌ ‌చార్జిగా పని చేయడం వల్ల తెలుగు నాట కాంగ్రెస్‌ ‌వర్గాలతో పరిచయం, సంబంధాలు ఉన్నాయి. అదే సందర్భంలో జగన్‌ ‌విషయంలో మేడమ్‌ ‌కి నెగిటివ్‌ ‌రిపోర్టు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చి తీరాలన్న వర్గాల ఒత్తిడికి తలొగ్గినప్పటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ పరిస్థితి ఉభయ భ్రష్టత్వం అయింది. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు రాహుల్‌ ‌గాంధీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒకప్పుడు దేశమంతటా కాంగ్రెస్‌ ‌వ్యతిరేక గాలి వీచినా, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన బలంతోనే ఇందిరాగాంధీ కాంగ్రెస్‌కు పూర్వవైభవం తేగలిగారు. అటువంటిది ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎక్కడుందో వెతుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌ ‌వైభవం కోసం చిత్తశుద్ధితోనే కృషి చేస్తున్నారు. ఆమెకు అంతా సహకరిస్తేనే ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ తిరిగి బలాన్ని పుంజుకోగలుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా యూపీఏ హయాంలో కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున పదవులను అలంకరించిన వారు తమ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న దాఖలాలు లేవు. కేరళలో కూడా ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా ఆంటోనీకి ప్రాధాన్యం ఇచ్చి ఉంటారు. మోతీలాల్‌ ఓరా వంటి సీనియర్లను దూరంగా ఉంచినప్పటికీ, చిదంబరం వంటి ప్రాధాన్యం ఇంకా తగ్గలేదు. తమిళనాడులో డిఎంకెతో పొత్తు కోసమే చిదంబరంకు పెద్ద పీట వేశారు. ఆయన తోటి సీనియర్లను సాగనంపారు. తమిళనాడులో ప్రస్తుతానికి డిఎంకెపై చేయిగానే ఉంది.

జయలలిత ఇష్టసఖి శశికళ విడుదలైతే రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం మారిపోవచ్చు. ప్రత్యేక ఆహ్వానితుల జాబితా 9 మందిలో ఆంధప్రదేశ్‌కి చెందిన చింతా మోహన్‌ను కొనసాగించారు. అయితే, ఆంధప్రదేశ్‌లో కాంగ్రెస్‌లో అనుభవజ్ఞులు, సీనియర్లు ఇప్పుడు ఎవరూ లేరు. బీహార్‌ ఎన్నికల నేపథ్యంలో సీనియర్‌ ‌నాయకుడు తారీక్‌ అన్వర్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి నాయకుల లోపం ఎన్నడూ లేదు. కానీ, ఆ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడమే పెద్ద లోపం. ఇందుకు తెలుగు రాష్ట్రాలే నిదర్శనం. ఆంధప్రదేశ్‌లో అందరూ పార్టీ కాడి వదిలేశారు. తెలంగాణాలో ఉన్న నలుగురిలోనూ ఐక్యత లేదు. అందుకే, తెలంగాణా ఇచ్చినా కాంగ్రెస్‌కు ఆదరణ లభించడం లేదు. వర్గకలహాలే కాంగ్రెస్‌ ‌కొంపముంచుతున్నాయి. బీజేపీకి ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడా పెద్దగా బలం లేదు. అనైక్యత వల్ల కాంగ్రెస్‌ ‌కోలుకోలేకపోతోంది.

Leave a Reply