డా।। వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ నేతల నివాళి
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి, పేద ప్రజలకోసం తీసుకొచ్చిన పథ•కాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ టికాంగ్రెస్ నేతలు ఆయనకు నివాళులర్పించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మల్లు రవి ఇతర నాయకులు పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి, గాంధీభవన్‌లోని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించరు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ…వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక రాజకీయ ప్రజా శక్తిగా ఎదిగారని, రాజశేఖర్ రెడ్డి మరణించినా ప్రజల హీదయాలలో నేటికీ బతికుండడానికి ఆరోగ్య శ్రీ పథ•కమే కారణమని కొనియ్యాడరు. ప్రతిపేద వాడికి వైద్యం, విద్య అందేలా చేసిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 108, 104 కనుమరుగైపోయాయని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ వేసి ట్రాఫిక్ లేకుండా చేశారని, సోనియా గాంధీ నాయకత్వంలో మెట్రో రైల్ పునాదికి కారణం రాజశేఖర్ రెడ్డి అని, జలయజ్ఞం పేరుతో ప్రతి జిల్లాకి నీళ్లు వచ్చేలా చేశారని, ప్రస్తతం రాష్ట్రంలో ఒకే ప్రాజెక్ట్ పేరు చెప్పి పని చేస్తున్నారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని అందుకే రాజశేఖర్ రెడ్డి రాజు నుండి మహారాజు అయ్యారని అన్నారు.