రాష్ట్ర సర్కార్ పంచాయితీలను నిర్వీర్యం చేస్తున్నది
ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు
కెసిఆర్ పాలనలో గ్రామ పంచాయితీలు నిర్వీర్యం అయ్యాయని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పంచాయితీలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేరుగా నిధులు ఇచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం ట్రాక్టర్ల కొనుగోళ్లు, స్మశానవాటికల నిర్మాణాలు, హరితహారాలు పనులు చేయించి పంచాయతీ నిధులు ఖర్చు చేయిస్తోందన్నారు. కాంగ్రెస్ సర్పంచులు ఉన్న దగ్గర కనీసం ప్రోటోకాల్ పాటించకుండా టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరిస్తోందన్నారు. పంచాయతీలకు హక్కుగా రావాల్సిన నిధులను కూడా రానీయడం లేదని, పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా చేసిందన్నారు.
టీఆర్ఎస్కు కాలం దగ్గర పడిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఇక కల్వకుంట్ల కంపెనీ ఇంటికి పోవాల్సిందేనని తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ వేధిస్తోందని ఉత్తమ్ దుయ్యబట్టారు. ఇలాంటి దరిద్రపు పాలన ఎన్నడూ చూడలేదని తప్పుబట్టారు. శాతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన ఫైనాన్స్ కమిషన్ నిధులను వాడుకున్నారని, సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్ పవర్ విడ్డూరమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. త్మగౌరవం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు దీక్షలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మరో కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులే అసలైన ప్రజా నేతలని కొనియాడారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వడం లేదని, పార్టీ మారితే బిల్లులు ఇస్తామని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు.