Take a fresh look at your lifestyle.

దుబ్బాక ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ ‌కీలక ప్రకటన సరే… నడిపించే నాయకుడేడీ..!?

  • గతంలో పోటీ చేసినోళ్లందరూ పత్తాలేకుండా పోయారు..
  • పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌పోటీ  ప్రకటనపై అనేక అనుమానాలు?

సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే. రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌పార్టీ చేస్తుందనీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో పోటీపై ఎవరేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సిద్ధం కావాలని ఉత్తమ్‌ ‌పిలుపునిచ్చారు. త్వరలో దుబ్బాక నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ ‌పార్టీ బలహీ నమైందని, దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని నేతలకు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సూచించారు. పిసిసి తరపున  అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో మండల స్థాయిలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే, నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఆ సమావేశాలకు పార్టీ ముఖ్యనేతలను అందర్నీ పిలిచి సమన్వయం చేసుకోవాలన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ…దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిని పోటీలో దింపుతామంటూ పిసిసి చేసిన వ్యాఖ్యలే అనేక అనుమానాలకు తావిస్తుందనీ అటు కాంగ్రెస్‌ ‌పార్టీతో పాటు ఇటు ఇతర పార్టీల్లోనూ, సామాన్య ప్రజానీకంలోనూ పెద్దయెత్తున చర్చ మొదలైంది. వాస్తవం చెప్పాలంటే దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌పార్టీ పరిస్థితి అంతంత మాత్రమనే చెప్పాలి. దుబ్బాక కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇప్పుడున్న లీడర్లందరూ ‘ఎవరికి వారే యమునా తీరు’ అన్నచందంగా గ్రూపులతో కొట్టుమిట్టాడుతున్నారు.

2018 డిసెంబర్‌లో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 వోట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 వోట్లు వచ్చాయి. 62,500 వోట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు. 2014లోనూ ఈ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సోలిపేట రామలింగారెడ్డి చేతిలో కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డీ భారీ మెజారిటీతోనే వోడిపోయారు. ఈ నియోజకవర్గం ఏ రకరంగా చూసినా గులాబీకి కంచుకోటగానే చెప్పాలి. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్న గ్రూపులు సరిపోవన్నట్లుగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ సీటును మహాకూటమి అభ్యర్థి చిందం రాజ్‌కుమార్‌కు కేటాయించారు. ఆఖర్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా మద్దుల నాగేశ్వర్‌రెడ్డికి ‘బిఫాం’ ఇచ్చారు. పొత్తులో భాగంగా టిజెఎస్‌కు కేటాయించి కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా నాగేశ్వర్‌రెడ్డి బిఫాం ఇవ్వడం వెనక అప్పట్లో బాగానే ‘చేతులు’మారాయన్న ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా, అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన ఓ రాష్ట్రస్థాయి నాయకుడు చెప్పినట్లుగా దుబ్బాక, మెదక్‌, ‌సిద్ధిపేట అసెంబ్లీ స్థానాలలో టికెట్లు ఇచ్చారనీ అప్పట్లో కాంగ్రెస్‌ ‌శ్రేణులు బహిరంగంగానే మాట్లాడుకున్నారు కూడా. ఇక ఉప ఎన్నికలో పోటీ చేస్తామనడం వెనక కూడా ఏదో మతలబు దాగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నవాళ్లు అనేకమంది ఉన్నారు.  ఇక.. పోటీ చేసిన నాగేశ్వర్‌రెడ్డి ఇప్పటి వరకు దుబ్బాక నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌పార్టీ మూడు నాలుగు గ్రూపులు వీడిపోయింది. అయితే, ఉప ఎన్నిక అనగానే కొందరు నేతలు రెక్కలు కట్టుకుని మరీ వచ్చిపోతున్నారు. కార్యకర్తలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నట్లు దుబ్బాకకు చెందిన ఓ కార్యకర్త శుక్రవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.

లీడర్లుగా చలామణి అవుతున్న వారందరూ ఎన్నడూ స్థానికంగా కార్యకర్తలకు అందుబాటులో ఉన్న పాపానపోలేదనీ, ఉప ఎన్నిక అనే సరికి అందరూ ఎగేసుకుని వస్తున్నారనీ కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు తమ మనసులోని బాధను వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి చెప్పుకోదగ్గ వోటు బ్యాంకు కూడా లేదు. ఈ పరిస్థితులలో పోటీ పెడతామంటూ పిసిసి చీఫ్‌ ‌ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనీ రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే,  అనారోగ్యంతో మృతి చెందిన రామలింగారెడ్డి సీనియర్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌నేత. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారుడు. అవసరమైనప్పుడల్లా రాజీనామా చేసి ఉద్యమానికి సహకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన అత్యంంత సన్నిహితుల్లో ఒకరు. రామలింగారెడ్డి తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారుడు. వివాదరహితుడు. అన్ని పార్టీలతో సత్సంబంధాలు కలిగిన నేత. అందుకే రామలింగారెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెడితే కాంగ్రెస్‌ ‌తరపున పోటీ పెట్టకుండా తాను అధిష్టానాన్ని ఒప్పిస్తానని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైనా స•ంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించిన విషయం విధితమే. అయితే, దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిని పోటీలో దింపుతామనీ పిసిసి చీఫ్‌ ‌ప్రకటించడం వరకు బాగానే ఉన్నా…దుబ్బాకను ఒంటిచేత్తో నడిపించే సత్తా ఉన్న నాయకుడు కాంగ్రెస్‌లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  ఒకవేళ ఎన్నిక జరిగినా గెలుపు బాధ్యత మంత్రి హరీష్‌రావుకు అప్పగించనున్నారు.  హరీష్‌రావుకు బాధ్యత అప్పగిస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకించి వేరే చెప్పనక్కర్లేదు.  టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడక లాంటిదే అవుతుంది.   ఇప్పుడిదే రాజకీయాలలో హాట్‌టాపిక్‌.

Leave a Reply