Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌స్వయం కృతం కాదు, నాయకుల పాపం

కాంగ్రెస్‌ ‌పార్టీ ద్వారా పదవులు, అధికారం పొందిన వారు ఆ పార్టీ  అధికారం కోల్పోయేసరికి ఇతర పార్టీల్లోకి జంప్‌ ‌చేయడమో, కొత్త పార్టీని నెలకొల్పడమో ఎంతో కాలంగా ఉన్నదే. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌  ఇప్పుడు మూడో స్థానంలోకి నెట్టి వేయబడటం దురదృష్టం కాదు, ఆ పార్టీ నాయకుల స్వయం కృతం. కాంగ్రెస్‌ ‌పార్టీలో ముఠాలు ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. కానీ, పార్టీకే చేటు తెచ్చే రీతిలో తారస్థాయికి చేరడం ఇటీవల కానవొస్తున్న పరిణామం. కాంగ్రెస్‌లో నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ అనే నానుడి మొదటి నుంచి ఉంది. ప్రతి వారికీ పదవి కావాలి. ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరు. అలాగే, నాయకత్వాన్ని చేపట్టేవారు కూడా పార్టీ కోసం కాకుండా తమ స్వీయ ప్రతిష్టను పెంచుకోవడానికి ప్రయత్నించడం కూడా మొదటి నుంచి ఉంది.

కాంగ్రెస్‌ అధికారానికి దూరమైనప్పుడు ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమకుమార్‌ ‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కోసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ‌చార్జి మాణికం టాగూర్‌ ‌రెండు సార్లు పైగా సంప్రదింపులు జరిపినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. చివరికి అధిష్ఠానానికి తాను సేకరించిన అభిప్రాయాలపై నివేదిక సమర్పించారు. పార్టీ అధిష్ఠానవర్గం గతంలో మాదిరిగా స్వతంత్రించి నిర్ణయాలను తీసుకోలేని స్థితిలో ఉంది. అందుకే, పార్టీ అధ్యక్షుని ఎంపికలో జాప్యం జరుగుతోంది. ఈలోగా పార్టీ నుంచి బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులను బీజేపీ ఆకర్షిస్తోంది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో మంత్రి పదవిని అధిష్టించిన డికె అరుణ  బీజేపీలో చేరిన తర్వాత కీలకమైన పదవిని పొంది తన పరిచయస్తులనూ, మిత్రులనూ కాంగ్రెస్‌ ‌నుంచి బీజేపీలో చేర్పించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అలాగే, సినీనటి విజయ శాంతి కూడా  కాంగ్రెస్‌ ‌నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత తన వారందరినీ క్రమంగా బీజేపీలో చేర్పిస్తున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇప్పుడు మిగిలింది పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న సీనియర్‌ ‌నాయకులు.

- Advertisement -

వీరిలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు వరసల ఉన్నారు. ఆయన సోదరుడు రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు కొత్త సంవత్సరారంభ దినం నాడు ప్రకటించారు. వీరిద్దరూ కాంగ్రెస్‌ ‌పాలనలో పదవులు,  అధికారం పొందినవారే. కాంగ్రెస్‌ ‌జాతీయ నాయకత్వం బలహీనంగా ఉండటం వల్లనే రాష్ట్రంలో పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. ఫలానా వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవిని ఇస్తే  తాను  రాజీనామా చేస్తానంటూ ఇటీవల ఒక సీనియర్‌ ‌నాయకుడు హెచ్చరించారు. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న వారిని విడిచి పెట్టి కొత్తగా పార్టీలో చేరిన ఇతర పార్టీల నాయకులకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు యువనాయకత్వానికి పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్‌ ‌పెరగడంతో పార్టీ ఫిరాయింపుదారులనే శషభిషలను పాటించకుండా యువనాయకుల వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వొస్తున్నాయి. పార్టీని క్రియాశీలంగా నడిపేవారు ఫిరాయింపుదారులైనా, ఎవరైనా పర్వాలేదనే ఆలోచన అధిష్ఠానంలో వొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే, గతంలో వేర్వేరు పార్టీలు మారిన వారిని తీసుకుని వొచ్చి అందలం ఎక్కిస్తే పరువు పోతుందన్న హెచ్చరికలతో అధిష్ఠానం ఎటూ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోంది. ఇది ఆ పార్టీ చరిత్రలో విషమ అవస్థ. గతంలో పార్టీ పట్ల విశ్వాసం ప్రకటించేవారుండేవారు. ఇప్పుడు పదవులిస్తేనే పార్టీలో ఉంటామని ముఖం మీదే ప్రకటనలు చేస్తున్నారు. ఇది ఒక్క కాంగ్రెస్‌కి మాత్రమే కాదు. అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్‌ ‌సంస్కృతిగా ముద్ర పడింది. గతంలో ఆ పార్టీ అనుసరించిన పద్దతినే బీజేపీ ఇప్పుడు అనుసరిస్తుండటం వల్ల కాంగ్రెస్‌ ‌నష్టపోక తప్పడం లేదు. అదేమంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటున్నారు. తెరాస కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి వొచ్చిన ఎంతో మంది ఎమ్మెల్యేలనూ, నాయకులను చేర్చుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్‌ ‌పార్టీలో తమ పార్టీని విలీనం చేస్తానన్న తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పుడు ఆ పార్టీని రెండో స్థానం నుంచి మూడో స్థానంలోకి నెట్టేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ పట్ల ఆయన వ్యహరించిన తీరునకు పరిహారాన్ని ఇప్పుడు చెల్లించుకునే పరిస్థితిలో ఉన్నారు. బీజేపీ కూడా అదే పని చేయబోతోంది.

30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రకటించారు. దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో ఆయన  స్పీడ్‌ ‌పెంచారు. అలాగే,  ఢిల్లీ వెళ్ళే ముందు కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్‌ ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కాంగ్రెస్‌ ‌నాయకులు ఆరోపిస్తున్నారు. ఏమైనా కాంగ్రెస్‌ ‌పరిస్థితిని చక్కదిద్దేందుకు అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ సరైన నాయకులు లేకపోవడం ఆ పార్టీకి పట్టిన గ్రహణంగానే భావించాలి. కాంగ్రెస్‌ అధికారంలో లేకపోయినా, కీలకమైన పదవులకు పోటీ పెరగడం ఆ పార్టీ నాయకుల్లో నాటుకుని పోయిన అధికార దాహానికి నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి సరైన నాయకుడు దొరకకపోవడం ఆ పార్టీ  చేసుకున్న పాపం కాదు. నాయకులదే ఆ పాపం. పార్టీని నిలబెట్టేందుకు ఎంతకైనా వారు సిద్ధపడతారనడానికి ప్రస్తుత పరిస్థితే నిదర్శనం.

Leave a Reply