కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్నది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారానికి దూరమైనప్పటి నుండి రోజురోజుకు పార్టీ పరిస్థితి తీసికట్టుగా మారింది. ఒక పక్క వరుస ఓటములు, మరో పక్క సీనియర్ నాయకులు పార్టీని విడిచిపెట్టి పోతుండడంతో మరింత బలహీనపడుతున్నది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చురుకైన వ్యక్తి, యువకుడు, మంచి దూకుడును ప్రదర్శిస్తాడని అదిష్టానం భావించింది. అయితే రేవంత్ పదవిని అలంకరించినప్పటి నుండి సీనియర్‌లకు ఆయనకు మధ్య దూరం పెరుగుతూ వొచ్చింది. పార్టీని ఏకతాటిపై తీసుకురావాలన్న ఆయన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వొస్తున్నాయి. పార్టీ సమావేశాలకు, సభలకు ఒకరు వొస్తే ఇంకొకరు రాకపోవడం నేటికీ జరుగుతున్న పరిస్థితి. కొందరు తమకు ఆహ్వానం రావడంలేదని, రేవంత్ వొచ్చిన తర్వాత తమను చిన్నచూపు చూస్తున్నారని ఇలా అనేక అరోపణలు నిత్యకృత్యమైనాయి. రేవంత్ సారథ్యంలో ప్రధానంగా రాష్ట్రంలో జరిగిన మూడు ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికల్లో దేనిలోనూ కనీసం రెండవ స్థానంలోనైనా రాకపోవడం పట్ల పార్టీలోని సీనియర్ నాయకులే విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.
ఇంకా ఈ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ శూన్యమేనన్న భావం ఇప్పుడు సీనియర్ నాయకుల్లో ఏర్పడింది. దీంతో ఒక్కొక్కరు పార్టీని వీడి పోతున్నారు. అయితే పార్టీని వీడి పోతున్న వారిని కనీసం నిరోధించే ప్రయత్నాలు కూడా చేయకపోవడం పట్ల పార్టీ క్యాడర్ ఆవేదన చెందుతున్నది. తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జీ అయిన మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ వీడిపోతున్నాడని తెలిసి కూడా ఆయన్ను కనీసం అనునయించే ప్రయత్నం చేయకపోవడంపట్ల పార్టీలోని మరికొందరు సీనియర్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నప్పుడు ఆయనకు నోటీస్ జారీచేసి సమాధానం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఒకేసారి పార్టీ నుండి సస్పెండ్ చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అది కూడా ఆరు సంవత్సరాలపాటు సస్పెండ్ చేయడం చూస్తుంటే ఇక వారు పార్టీలో ఎంతమాత్రం ఉండటం ఇష్టం లేదన్నట్లుగా ఉందంటున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా ఆ పార్టీ ఎంఎల్‌ఏ జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శిస్తున్నారు. శశిధర్‌రెడ్డి పార్టీ వీడుతున్నాడని తెలిసి రేవంత్ రెడ్డిగాని, భట్టి విక్రమార్కగాని, మహేష్ గౌడ్‌గాని ఆయన్ను నివారించే ప్రయత్నాలు చేయకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. పార్టీ ఇంతటి సీనియర్ నాయకుడిని కోల్పోవడం నిజంగా దురదృష్టకరమైన విషయం.
ఆయన తండ్రి ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తి. పైగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించిన ఘనచరిత్ర ఉన్న వ్యక్తి. ఆయన కుమారుడిగా శశిధర్‌రెడ్డికి పార్టీలో చాలా సౌమ్యుడిగా పేరుంది. విచిత్రమేమంటే తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాడినేనని ఆయన రాసుకున్న రాతలను ఇప్పుడు చెరుపేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతకాలంగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలతో తాను అందులో ఇముడలేకపోతున్న పరిస్థితులు తలెత్తడం వల్లే పార్టీ మారాలనుకున్నట్లుగా శశిధర్ రెడ్డి మీడియా ముందు తెలిపిన విషయం తెలిసిందే. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్న తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని, ఆ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ మాటలు బహిర్గతమైనప్పటికీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చిన క్రమశిక్షణా కమిటి, శశిధర్‌రెడ్డి విషయంలో ఆలా ఎందుకు నోటీసు ఇవ్వలేదని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. నేటికి తొమ్మిదేళ్ళ క్రితం తిరుగులేని మెజార్టీతో రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటి నుండి కాలదోషం పడుతూ వొచ్చింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో తెరాస అధికారంలోకి వొచ్చిన తర్వాత ఒక్కసారే 12 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఏలను ఆకర్షించింది.
అప్పటి నుండే దాని డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఆనాడే వారిని కాపాడుకుని ఉంటే ఇవ్వాళ కాంగ్రెస్ పరిస్థితి మరో తీరుగా ఉండేది. మొదట్లో టిఆర్‌ఎస్ ఆకర్ష్‌కు కాంగ్రెస్ నాయకులు ఆకర్షణకు గురైతే, ఇప్పుడు బిజెపి వలలో వారు చిక్కిపోతున్నారు. డికె అరుణ, విజయశాంతి, తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి హేమాహేమీలెందరో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక్కడి వ్యవహారాలను పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం టాగూర్‌లాంటి సీనియర్‌లు కూడా చక్కబెట్టలేకపోతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా శశిధర్‌రెడ్డి లాంటివారు బిజెపి తీర్థం తీసుకోపోతుండడం పట్ల వాస్తవంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందన్నదానిపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం టాగూర్‌తో పాటు ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీం జావేద్‌కు ఈ వ్యహారాలను చూడాల్సిందిగా ఖర్గే ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఇక అగ్ర నేత ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై దృష్టి సారించినట్లు వార్తలు వొస్తున్నాయి. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇప్పటికైనా పార్టీ ఫిరాయింపులను నిలుపుకోలేకపోతే ఇక కాంగ్రెస్ భవిష్యత్ ప్రశ్నార్థకమే.