కాంగ్రెస్ పార్టీ ఒక్కరొక్కరుగా కీలక నేతలందరినీ వరుసగా కోల్పోతున్నది. వొచ్చే ఎన్నికలనాటికి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చే దిశగా ఆలోచన చేస్తున్న క్రమంలోనే పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. పార్టీని వీడుతున్న క్రమంలో జాతీయ స్థాయినాయకులు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలను సంధించి, తెలంగాణ కాంగ్రెస్‌లో రాష్ట్ర అధ్యక్షుడిపైన తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెళ్తున్నారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న వీరంతా కాంగ్రెస్‌కు బద్ధ శత్రువుగా చెప్పుకునే బిజెపిని అశ్రయిస్తున్నారు. దేశాన్నంతా కాషాయమయం చేయాలనుకుంటున్న బిజెపి పార్టీ కూడా ఒక్క కాంగ్రెస్ అనే కాకుండా వివిధ పార్టీల్లోని కీలక నేతలపై ఆకర్ష్ ప్రయోగాన్ని చాలా విజయవంతంగానే ప్రయోగిస్తుంది. దీంతో క్రింది స్థాయి నుండి, పై స్థాయి నాయకులకు ఇప్పుడు బిజెపిలో కరువు లేకుండా పోతుంది. గడచిన ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, ఆ పార్టీ వ్యవహారాల్లో ముఖ్య భూమికను నిర్వహించినవారనేకులు పార్టీని విడిచి వెళ్తున్నా పార్టీ వారిని ఏమాత్రం అనునయించే ప్రయత్నం కూడా చేయలేదన్న అపవాదు ఉంది.
వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరంగా సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని అత్యంత చాకచక్యంగా పరిష్కరించడం ద్వారా ట్రబుల్ షూటర్‌గా పేరున్న గులాబ్ నబీ ఆజాద్ లాంటివారిని పార్టీ వదులు కోవడం నిజంగా ఆ పార్టీ అశక్తతకు నిదర్శనంగా నిలుస్తుంది. జమ్ము కాశ్మీర్‌లాంటి సమస్యాత్మక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, గాంధీల ఏలుబడిలో దాదాపు అరవై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అత్యంత గౌరవ పదవులను నిర్వహించిన సీనియర్ నేతను కాంగ్రెస్ కోల్పోయింది. బిజెపీ ఆయన్ను ఆకర్షించే ప్రయత్నం చేసినా, తానే స్వంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవడం వేరే విషయం. అలాగే మరో సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి మన్ ప్రీతిసింగ్ బాదల్ బిజేపీలోకి వెళ్ళడాన్ని నిరోధించుకోలేక పోయింది కాంగ్రెస్. తాజాగా భారత తొలి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి మనుమడు ఆర్. కేశవన్ కూడా బిజెపి కండువ కప్పుకున్నాడు.
కాంగ్రెస్‌లో జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతలను నిర్వహిస్తున్న ఆయన దాదాపు రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో అత్యంత విశ్వాసపాత్రుడిగా కొనసాగిన వ్యక్తి. మరో జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఇటీవల కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా చేశాడు. సుప్రీమ్ కోర్టులో ప్రముఖ న్యాయవాది అయిన ఆయన గడచిన ఏడాదిగా సోనియా, రాహుల్ గాంధీలను కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడం వల్లే విసుగు చెంది పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించడం గమనార్హం. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులైన జ్యోతిరాదిత్య, హిమంత బిశ్వ శర్మ, జితిన్ ప్రసాద్, కేంద్ర మాజీమంత్రి ఆర్‌పిఎన్ సింగ్, న్యాయశాఖ మాజీ మంత్రి హార్థిక్ పటేల్, పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ లాంటి సీనియర్లు, పార్టీలో మంచి పట్టున్నవారంతా పార్టీని వీడిపోతున్నా కాంగ్రెస్ అదిష్ఠానం ఏమీ చేయలేకపోయింది. స్నేహితులెవరో, శత్రువులు ఎవరో తెలుసుకునే పరిస్థితిలో పార్టీ కొనసాగుతున్నదని, పార్టీ నడవడి ఇలానే ఉంటే భవిష్యత్‌లో పార్టీ అధ: పాతాళానికి దిగజారటం ఖాయమని వారంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పార్టీలో తమకు విలువలేకుండా పోయిందని కొందరు సీనియర్లు ఆవేదన వ్యక్తం చేయగా, గులాబ్ నబీ ఆజాద్‌తో సహా అసంతృప్తులైన మరో కొందరు జీ-20 నాయకులుగా పిలువబడుతున్న వారంతా రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ లేదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ మారడంలేదని, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ సోనియాగాంధీకి సుదీర్ఘ లేఖను అందించారు. దీని తర్వాతనే గులాబ్ నబీ ఆజాద్ పార్టీ వీడిపోయాడు. ఇక తెలంగాణ విషయానికొస్తే తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసిసీ రాష్ట్ర కార్యక్రమాల అమలు కమిటి చైర్‌పర్సన్‌గా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బిజెపిలో చేరిపోయారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న ఈయన తన ప్రాథమిక సభ్యత్వంతోపాటు, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ ద్వారా తెలియపర్చారు. మరుసటి రోజున్నే బిజెపి రాష్ట్ర వ్యవహారా ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలుసుకుని కాషాయకండువ కప్పుకున్నారు. ఈయనకు ముందే పార్టీలో అనేక పదవులు అలంకరించిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కష్టకాలంలో పార్టీని వీడిపోయారు.
మునుగోడు ఉప ఎన్నికలకు కారకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అయితేనేమీ, మర్రి శశిధర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అయితేనేమీ అంతకు ముందు సీనీనటి విజయ శాంతి, డికె అరుణ లాంటి వారెందరో కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడిగా చెప్పుకుంటున్న ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా బిజెపి గూటికే చేరారు. అయినా పార్టీ ఇంకా అసంతృప్త వాదులతో కొనసాగుతూనే ఉంది. రేవంత్‌రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత జూనియర్లు, సీనియర్లని, ఇతర పార్టీల నుండి వొచ్చిన వారన్న చర్చ కొనసాగుతున్నది. ఇటీవల పార్టీ నిర్మాణ క్రమంలో వేసిన జంబో కమిటీలో ఇతర పార్టీల నుండి వొచ్చిన వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారంటూ పలువురు సీనియర్లు అలగటం, వేరే మంతనాలు చేయడం, అందుకు అధిష్ఠానం జోక్యం చేసుకోవడం తాత్కాలికంగా సద్దు మణిగినట్లు కనిపిస్తున్నా, నివురుగప్పిన నిప్పులా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మహోశ్వర్ రెడ్డి ఎపిసోడ్‌లా ఏ క్షణాన్నైనా అగ్గిరాజుకునే అవకాశాలు లేకపోలేదు.