- వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి
- రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం టాగూర్
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం టాగూర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా చేవెళ్లలో కాంగ్రెస్ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా మాణికం టాగూర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి పాలనను కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎందుకు ప్రశ్నించరని మాణికం టాగూర్ నిలదీశారు.
వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. రైతును వ్యవసాయానికి దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతి, గవర్నర్లకు పంపుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ చట్టంతో మార్కెట్లు మూతపడి ప్రైవేటు వ్యాపారస్తుల చేతిలో వ్యవసాయదారులు నష్టపోయే ప్రమాద ముందన్నారు. 23 పంటలకు మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా కేవలం వరి, గోధుమలనే కొనుగోలు చేస్తారని తెలిపారు.