Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ సృష్ఠించిన రాజకీయ శూన్యత ..!

అనేక మంది చేసిన ఉద్యమాలు, ఆత్మబలిదానాలవల్ల 2014 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్సాటు చేసింది. రాష్ట్ర ప్రజల త్యాగాలు, 1200 మంది ఆత్మబలిదానాల వల్ల ఏర్పడిన రాష్ట్రంలో అన్ని వర్గాల వారి ఆశయాలు, నెరవేరుతాయని తాము కలలు కన్న రాష్ట్రంగా రూపొందుతుందని ఆశించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు,కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్ధులు, విద్యావంతులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు బహుజనులు, ముఖ్యంగా ఆచార్య జయశంకర్‌ ‌సార్‌ ‌కలలు కన్న రాష్ట్రంగా రూపొందుతుందని తెలంగాణా రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది చెందుతుందని బంగారు తెలంగాణా సాకారమవుతుందని ఆశించారు. కాని గత 7 సంవత్సరాల పాలనను చూసిన తరువాత ప్రజలు భంగపడ్డారు. నీళ్ళు, నిధులు నియమాకాలు, ఆత్మ గౌరవం, స్వయం పాలన అనేవి మచ్చుకైనా కానరాకుండా పాలనంతాహొఆయన కనుసన్నులలో కొనసాగుతు రాష్ట్రంలో కేసీఆర్‌ ‌కుటుంబంలో బంధీ అయింది.

స్వరాష్ట్రం సిద్దించిన కొత్తలో రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలో సమీప దూరంలో వేరే రాజకీయ పార్టీ ఉనికి గాని అవసరంగాని ఉండదని సుభిక్ష రాష్ట్రంగా ఉండి ఆదర్శ రాష్ట్రంగా రూపొందుతుందని ఆశించారు. కాని కేసీఆర్‌ ‌స్వయంకృపరాధం వల్ల ఎవరి ఊహలకు అంచనాలకు అందకుండా బీజేపీ ఒక కెరటంలా వచ్చిపడింది.మొన్న దుబ్బాక నిన్న జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలతో బీజేపీ గ్రాఫ్‌ ఒక్క సారిగా పెరిగి టీఆరెస్‌ ‌గ్రాఫ్‌ అం‌తే వేగంగా పడిపోతున్నది.

తెలంగాణా రాష్ట్రంలో బహు జనులే అధిక సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ మంది వామపక్ష భావజాలంలో ఉండి కమ్యూనిస్టు పార్టీలతో మమేకమవుతుండేవారు. కొంతమంది టి.డి.పి. ఏర్పడిన తరువాత అందులోను, మరికొంతమంది కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉండేవారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పార్టీలతో సంబంధం లేకుండా బహుజనులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సకల జనుల సమ్మె, వంటావార్పు, సాగరహారం,తదితర అన్ని కార్యక్రమాలలో వీరి పాత్ర అమోఘం స్వరాష్ట్రంలో వీరికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఉంటుందని ఆశించి భంగపడ్డారు.

కేసీఆర్‌ ‌ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనచేయకుండా కేవలం ఫాంహౌజ్‌, ‌ప్రగతి భవన్‌లకే పరిమితం కావడం, వ్యక్తి పూజకే ప్రాధాన్యత నివ్వడం, పాలనంత కుటుంబంలోనే కేంద్రీకృతం కావడం జరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ వ్యతిరేకులను, ఉద్యమాన్ని అణచివేసిన వారిని చేరదీసి వారికి పదవులు కట్టబెట్టాడు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదని, విపక్షం లేకుండా చేయాలని కాంగ్రెస్‌, ‌టి.డి.పి., కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులను ఇచ్చాడు. ఇది జీర్ణించుకోలేని ప్రజలు అవకాశం కొరకు ఎదురుచూశారు. దాని ఫలితమే పార్లమెంట్‌ ఎన్నికలలో నినాదమైన సారుకారు పదహారును ప్రక్కన బెట్టి 4 స్థానాలో కాంగ్రెస్‌, 4 ‌స్థానాలో బీజేపీని గెలిపించారు. అయినప్పటికీ కేసీఆర్‌ ‌తీరు మార్చుకోక పోవడంతో మొన్న జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలలో బీజేపీ ని గెలిపించారు.

ప్రభుత్వ వ్యతిరేకత: ఈ మధ్య కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది. మొదటి 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్న, రైతుబందు, ఆసరా, ఇతర ఫించన్ల వల్ల రెండవసారి టీఆర్‌ఎస్‌ ‌ను గెలిపించారు. అయినప్పటికి అధినాయకుడి పాలనా విధానంలో మార్పురాకపోవడం, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుకు ఇచ్చిన హామిలు అమలు కాకపోవడంతో ఉద్యోగులు, ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకలే ఉండకూడదనే నిరంకుశ వైఖరి వల్ల ప్రజలు విసుగుచెందారు. వారి అసంతృప్తిని ఓట్లరూపంలో వ్యక్తపరుస్తునే ఉన్నారు.

బీజేపీ బలపడటం దేనికి కారణాలు: కేసీఆర్‌ ‌ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలనే ఏ రాజకీయ పార్టీ బలపడవద్దుని, ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్ధేశంతో బలంగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ 12 మంది ఎమ్మెల్యేలను లను పార్టీలో చేర్చుకోవడం, అదేవిధంగా టి.డి.పి. నుండి గెలిచినఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని వారికి మంత్రిపదవులు ఇవ్వడం లాంటివి చేసి ప్రధాన పార్టీలను నిర్వీర్యం చేసినాడు. ఇది ప్రజాస్వామ్య వాదులను కలచి వేసింది. కాంగ్రెస్‌ ‌పార్టీలో బలమైన నాయకుడులేడని, కాంగ్రెస్‌ ‌వారిని గెలిపించినా వారు టీఆర్‌ఎస్‌ ‌లోనే చేరతారని, టి.డి.పి. ఆంద్రాపార్టీ అని ప్రజలు భావించారు. రాష్ట్రంలో విపక్షము అనేది లేకుండా ఒక రాజకీయ అగాధం ఏర్పడింది. ఇట్లాంటి రాజకీయ శూన్యతనుండి బయట పడాలంటే బీజేపీ ఒకటే ప్రత్యామ్నాయమని ప్రజలు భావించి ఆ పార్టీని బలపరచారు. దీనికి తోడు బండి సంజయ్‌ ‌లాంటి బలమైన నాయకుడి వల్ల అటు దుబ్బాకలోను ఇటు జీహెచ్‌ఎం ‌సిలోను బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేసింది. ఈ విధంగా ఎవరూ ఊహించని విధంగా బీజేపీ బలపడే సరికి బిత్తరపోవడం కేసీఆర్‌ ‌వంతు అయింది. చివరికి తాను తీసిన గోతిలో తానే పడినట్లు కేసీఆర్‌ ‌చర్యలవల్ల బీజేపీ బలపడుతూ వస్తున్నది. కేసీఆర్‌ ‌కుటుంబ నిరంకుశ వైఖరి నచ్చని నాయకులు ఇపుడు బీజేపీ వైపు చూస్తున్నారు.

చట్ట వ్యతిరేక చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వము 78 సామాజిక కార్యకర్తలపై, పేరు మోసిన పత్రికా విలేకరులపై సెక్షన్‌ 123 ‌క్రింద కేసు నమోదుచేశారు. కేసీఆర్‌ ‌తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను పక్కన బెట్టి నియంత పాలన కొనసాగిస్తున్నాడు.తెలంగాణా రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యమని తనకు పదవులు అక్కరలేదని, దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని నేను కేవలం కాపలా కుక్కవలె ఉంటానని చెప్పి రాష్ట్రం ఏర్పడగానే అన్ని వాగ్దానాలను తుంగలో తొక్కి తన నైజాన్ని చాటుకున్నాడు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యమనేది మచ్చుకైనా కానరాదు. ప్రచార సాధనాల నోళ్ళు నొక్కబడ్డాయి, సభలు సమావేశాలు నిశేధించబడ్డాయి, రాజరికం, నవాబు పాలన రాజ్యమేలుతున్నది. కేసీఆర్‌ ఇచ్చిన హామీ లు ఏవి అమలు కాలేదు. ప్రచార ఆర్భాటం, వ్యక్తి పూజతప్ప ఏమీ లేదు. కుటుంబపాలన, బందుప్రీతి, కులదురభిమానం విపరీతంగా పెరిగింది. పట్టణాలనుండి గ్రామాల వరకు వీరి ఆగడాలకు అంతులేకుండా పోయింది. కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేటు, బిల్డర్లు బాగా పెరిగిపోయారు. అధికార పార్టీనేతలు, ఎమ్మెల్యేలు అనేక భూకుంభకోణాలకు పాల్పడుతున్నారు. అవినీతి విపరీతంగా పెరిగి దేశంలో రెండవ స్థానానికి చేరింది. అణచివేత, అప్రజాస్వామిక పాలనను ప్రజలు ఏవగించుకుంటున్నారు. ఈ పాలనను భరంచలేక ఈ పీడను వదలించుకోవాలని చూస్తున్నారు. స్వరాష్ట్రంలో ఇటుంటి పాలనను ప్రజలు ఊహించుకోలేదు. సరిగ్గా ఇటువంటి సమయంలో ఒక ఆశాకిరణంగా ప్రజలకు బీజేపీ కనపడింది. విపక్షమే ఉండకూడదని అన్ని పార్టీల అంతానికి పూనుకొని ఒక రాజకీయ శూన్యతను సృష్ఠించిన కేసీఆర్‌ ఆ ‌గోతిలోనే పడ్డాడు.

manda ashok kumar
ప్రొ. మంద అశోక్‌ ‌కుమార్‌
‌కన్వీనర్‌ ,‌తెలంగాణ ఇంటలెక్చవల్‌ ‌ఫోరమ్‌
‌కాకతీయ యూనివర్సీటి, వరంగల్‌,
‌తెలంగాణా.
సెల్‌ ‌నెం. 9885055693

Leave a Reply