Take a fresh look at your lifestyle.

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం

  • బలనిరూపణలో విఫలమైన నారాయణస్వామి
  • లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌కు రాజీనామా సమర్పణ
  • తదుపరి కార్యాచరణపై తమిళసై దృష్టి

మరో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కూలింది. పుదుచ్చేరి అసెంబ్లీలో సోమవారం జరిగిన బల పరీక్షలో ముఖ్యమంత్రి నారాయణస్వామి తన మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. బల పరీక్షలో విఫలమైన తర్వాత నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. లెప్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌ ‌తమిళిసైకి రాజీనామా అందజేశారు. మెజార్టీ నిరూపించుకోవడానికి 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. కాంగ్రెస్‌ ‌దగ్గర 12 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఆదివారం ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. విశ్వాస పరీక్షలో ఓటింగ్‌కు ముందు మాట్లాడిన నారాయణస్వామి.. తమకు మెజార్టీ ఉన్నదని చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా మాజీ గవర్నర్‌ ‌కిరణ్‌ ‌బేడీపై ఆయన ఆరోపణలు గుప్పించారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్షంతో చేతులు కలిపినట్లు విమర్శించారు.

త్వరలోనే శాసనసభ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు లెప్టినెంట్‌ ‌గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ ‌బేడీని తప్పించడం, అనంతరం కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామాతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. దీంతో శాసనసభలో బలపరీక్ష నిరూపించుకోవడంలోనూ విఫలమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌తమిళిసైకు రాజీనామా అందించారు. దీంతో తరువాత పుదుచ్చేరి రాజకీయాల్లో ఏం జరుగ బోతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎల్‌జీ తీసుకునే కీలక నిర్ణయంపైనే పుదుచ్చేరి రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి.

ముఖ్యమంత్రి రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఆయననే ఎన్నికల వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.. లేదా,? ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం ప్రతిపక్షానికి ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రంగస్వామిని కోరే అవకాశం ఉంటుంది.అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకు పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేయడం. ఒకవేళ ఇదే జరిగితే ఎన్నికలు జరిగే వరకు పుదుచ్చేరి భాజపా నియంత్రణలో ఉన్నట్లే. అయితే, ఈ ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అడిగే ముందు లేదా, అడిగిన తర్వాత ఎల్‌జీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలా ఎల్‌జీ ముందు పలు అవకాశాలు ఉన్నాయి. అయితే, పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎల్‌జీని కోరే అవకాశాలు ఉన్నప్పటికీ, విశ్వాసం కోల్పోయిన నేపథ్యంలో ఎల్‌జీ ఆయన సలహాను పరిగణలోకి తీసుకునే అవకాశాలు లేవు.ఇదిలాఉండగా, ప్రస్తుతం నాతో పాటు కేబినెట్‌ ‌మంత్రులు లెప్టినెంట్‌ ‌గవర్నర్‌కు రాజీనామా సమర్పించామని సీఎం నారాయణస్వామి అన్నారు. వీటిపై ఎల్‌జీ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్న ముఖ్యమంత్రి, తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానికి స్పందించలేదు. దీంతో పుదుచ్చేరి తదుపరి రాజకీయ భవిష్యత్తు ఎల్‌జీ తమిళిసై సౌందరరాజన్‌ ‌తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నాయి.

Leave a Reply